ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ | CM Revanth Reddy Unveiling The Statues Of Sri Mahatma Jyotirao Phule and Savitribai Phule | Sakshi
Sakshi News home page

ముందే ఫీజు రీయింబర్స్‌మెంట్‌

Aug 15 2026 6:27 AM | Updated on Aug 15 2026 6:27 AM

CM Revanth Reddy Unveiling The Statues Of Sri Mahatma Jyotirao Phule and Savitribai Phule

ఫూలే దంపతుల విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో దానం, పొన్నం, వీహెచ్, మహేశ్‌గౌడ్, ఆది శ్రీనివాస్, వాకిటి, ఆర్‌. కృష్ణయ్య, కొండా సురేఖ, అంజన్‌కుమార్‌ యాదవ్‌ తదితరులు

ఏటా అడ్వాన్స్‌గా రూ.2,400 కోట్ల నిధులు బ్యాంకులో జమ

అడ్మిషన్లు పూర్తయిన వెంటనే విద్యార్థుల ఖాతాకు బదిలీ

ఇకపై విద్యార్థులను కాలేజీలు ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు

జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చట్టసభల్లోకి రావాలి

జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకంలో సంస్క­రణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పా­రు. ‘ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే మార్పులు అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయితే ఇకపై ఈ నిధులను ముందుగానే అడ్వాన్స్‌గా బ్యాంకులో జమ చేస్తాం. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే దరఖాస్తులను పరిశీలించి కేవలం నెల వ్యవధిలోనే విద్యార్థి ఖాతాలో ఫీజు నిధులు జమ చేస్తాం. ఈ ఏ­డాది ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేశాం. ఇకపై కా­లేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు..’అని సీఎం తెలిపారు. శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయి పూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. 

నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు
‘ప్రస్తుతం విద్య ఒక్కటి ఉంటే సరిపోదు. నైపుణ్యంతో కూడిన విద్య అత్యవసరం. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలొస్తాయి. దశాబ్దం క్రితం ఇంజనీర్‌కు ఇప్పుడు మార్కెట్‌ లేదు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు తగినట్లుగా మారిన వారికే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రజా ప్ర­భు­త్వం ఏటీసీలను అభివృద్ధి చేసింది. అక్కడ చదివే విద్యార్థులకు రూ.2 వేల స్టైపెండ్‌ ఇస్తున్నాం. స్కిల్స్‌ యూనివర్సి­టీని ఏర్పాటు చేసి అత్యుత్తమ నైపుణ్యాలను అందించి పరిశ్రమలకు తగిన మానవ వనరులను తయారు చేస్తోంది. 

కులాలు లేని విద్యా వ్యవస్థకు రూపకల్పన
విద్య ఒక్కటే మనిషికి ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది. ఆ విద్యను అందరికీ సమానంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యం. కులాలు లేని విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నాం. అందుకే సమీకృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలనే భేదాలు లేకుండా అందరికీ ఒకేచోట విద్యను అందించనున్నాం. నర్సరీ నుంచి ఇంటర్‌ వరకు అన్ని వసతులు కల్పిస్తున్నాం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్‌ అందిస్తున్నాం. 

ఇప్పుడు నూటికి నూరు మార్కులు వచ్చిన విద్యార్థులు 90 శాతం మంది ఉంటున్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించేందుకు స్పోర్ట్స్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం. మీ రేవంతన్న దేశంలోనే మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యను పరిష్కరించాడు. బీసీ జనగణన చేయడానికి దేశంలో ఎవరూ ధైర్యం చేయలేదు. బ్రిటిష్‌ వాళ్ల తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం కుల గణన చేసి బీసీల లెక్క తేలి్చంది. 

గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకొమ్మంది..
గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకోండని, చెప్పులు కుట్టుకోండని, చేపలు పట్టుకోమని చెప్పింది. వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలాలన్నదే వాళ్ల ఆలోచన. బీసీలు రాజ్యాధికారంలో భాగం అడుగుతారన్న ఉద్దేశంతోనే గొర్రెలు, బర్రెలు పెంచుకోమన్నారు. ఇప్పుడు కూడా చెప్పులు కుట్టుకోవాల్సిందే­నా? గొర్రెలు, బర్రెలు కాయాల్సిందేనా? ఈ సమాజం చదువుకోవద్దా? ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యే­లు కావొద్దా.? చదువు ఒక్కటే తలరాతలు మారుస్తుంది. తెలంగాణను మారుస్తుంది. జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చట్టసభల్లోకి రావాలి. నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. మీ బంగారు భవిష్యత్తుకోసం రోజుకు 18 గంటలు పని­చేస్తా. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కృషి చేయాలి..’అని సీఎం అన్నారు. 

మహనీయుల స్ఫూర్తితో మా పాలన సాగుతోంది: భట్టి
సామాజిక అసమానతలను తొలగించి బడుగు, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఫూలే దంపతులు జీవితాంతం పోరాడారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వారి స్ఫూర్తితోనే విద్య, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఫూలే ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 300 నుంచి 700కు పెంచామని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఆశయాలకు, సామాజిక న్యాయానికి ఇస్తున్న గౌరవానికి సూచనగా ఈ విగ్రహాల ఆవిష్కరణ చేపట్టామన్నారు. కుల, లింగ వివక్ష, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఫూలే దంపతులు పోరాడారని, విద్యే సమాజ మార్పునకు శక్తివంతమైన ఆయుధమని చాటిచెప్పారని తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, మహమ్మద్‌ అజహరుద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement