breaking news
Jyotiba phule
-
ముందే ఫీజు రీయింబర్స్మెంట్
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకంలో సంస్కరణలు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే మార్పులు అమలు చేస్తున్నాం. ఈ పథకం కింద ప్రతి ఏటా రూ.2,400 కోట్లు ఖర్చు చేస్తున్నాం. అయితే ఇకపై ఈ నిధులను ముందుగానే అడ్వాన్స్‌గా బ్యాంకులో జమ చేస్తాం. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయిన వెంటనే దరఖాస్తులను పరిశీలించి కేవలం నెల వ్యవధిలోనే విద్యార్థి ఖాతాలో ఫీజు నిధులు జమ చేస్తాం. ఈ ఏడాది ఇప్పటికే రూ.250 కోట్లు విడుదల చేశాం. ఇకపై కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండదు..’అని సీఎం తెలిపారు. శుక్రవారం నెక్లెస్‌రోడ్‌లోని హెచ్ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన మహాత్మ జ్యోతిబా ఫూలే, సావిత్రీ బాయి పూలే విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలు‘ప్రస్తుతం విద్య ఒక్కటి ఉంటే సరిపోదు. నైపుణ్యంతో కూడిన విద్య అత్యవసరం. నైపుణ్యం ఉంటేనే ఉద్యోగాలొస్తాయి. దశాబ్దం క్రితం ఇంజనీర్‌కు ఇప్పుడు మార్కెట్ లేదు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు తగినట్లుగా మారిన వారికే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితిని అంచనా వేసిన ప్రజా ప్రభుత్వం ఏటీసీలను అభివృద్ధి చేసింది. అక్కడ చదివే విద్యార్థులకు రూ.2 వేల స్టైపెండ్ ఇస్తున్నాం. స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసి అత్యుత్తమ నైపుణ్యాలను అందించి పరిశ్రమలకు తగిన మానవ వనరులను తయారు చేస్తోంది. కులాలు లేని విద్యా వ్యవస్థకు రూపకల్పనవిద్య ఒక్కటే మనిషికి ఆత్మ గౌరవాన్ని ఇస్తుంది. ఆ విద్యను అందరికీ సమానంగా అందించడమే ప్రభుత్వ లక్ష్యం. కులాలు లేని విద్యా వ్యవస్థను తయారు చేస్తున్నాం. అందుకే సమీకృత గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలనే భేదాలు లేకుండా అందరికీ ఒకేచోట విద్యను అందించనున్నాం. నర్సరీ నుంచి ఇంటర్ వరకు అన్ని వసతులు కల్పిస్తున్నాం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, స్నాక్స్ అందిస్తున్నాం. ఇప్పుడు నూటికి నూరు మార్కులు వచ్చిన విద్యార్థులు 90 శాతం మంది ఉంటున్నారు. కేవలం చదువులోనే కాకుండా క్రీడల్లోనూ రాణించేందుకు స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నాం. మీ రేవంతన్న దేశంలోనే మొదటిసారి ఎస్సీ వర్గీకరణ చేసి సమస్యను పరిష్కరించాడు. బీసీ జనగణన చేయడానికి దేశంలో ఎవరూ ధైర్యం చేయలేదు. బ్రిటిష్ వాళ్ల తర్వాత ఈ ప్రజా ప్రభుత్వం కుల గణన చేసి బీసీల లెక్క తేలి్చంది. గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకొమ్మంది..గత ప్రభుత్వం బర్రెలు, గొర్రెలు పెంచుకోండని, చెప్పులు కుట్టుకోండని, చేపలు పట్టుకోమని చెప్పింది. వాళ్ల పిల్లలు రాజ్యాలు ఏలాలన్నదే వాళ్ల ఆలోచన. బీసీలు రాజ్యాధికారంలో భాగం అడుగుతారన్న ఉద్దేశంతోనే గొర్రెలు, బర్రెలు పెంచుకోమన్నారు. ఇప్పుడు కూడా చెప్పులు కుట్టుకోవాల్సిందేనా? గొర్రెలు, బర్రెలు కాయాల్సిందేనా? ఈ సమాజం చదువుకోవద్దా? ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మంత్రులు, ఎమ్మెల్యేలు కావొద్దా.? చదువు ఒక్కటే తలరాతలు మారుస్తుంది. తెలంగాణను మారుస్తుంది. జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చట్టసభల్లోకి రావాలి. నాణ్యమైన విద్యను అందించే బాధ్యత నాది. మీ బంగారు భవిష్యత్తుకోసం రోజుకు 18 గంటలు పనిచేస్తా. ఇంత మంచి అవకాశం మళ్లీ రాదు. ఈ ప్రభుత్వాన్ని కొనసాగించేందుకు కృషి చేయాలి..’అని సీఎం అన్నారు. మహనీయుల స్ఫూర్తితో మా పాలన సాగుతోంది: భట్టిసామాజిక అసమానతలను తొలగించి బడుగు, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో జీవించేలా ఫూలే దంపతులు జీవితాంతం పోరాడారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. వారి స్ఫూర్తితోనే విద్య, సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. ఫూలే ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌ల సంఖ్యను 300 నుంచి 700కు పెంచామని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. జ్యోతిబా ఫూలే, సావిత్రీబాయి ఆశయాలకు, సామాజిక న్యాయానికి ఇస్తున్న గౌరవానికి సూచనగా ఈ విగ్రహాల ఆవిష్కరణ చేపట్టామన్నారు. కుల, లింగ వివక్ష, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఫూలే దంపతులు పోరాడారని, విద్యే సమాజ మార్పునకు శక్తివంతమైన ఆయుధమని చాటిచెప్పారని తెలిపారు. మంత్రులు శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, మహమ్మద్ అజహరుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. -
‘మహాత్మా’.. వసతులేవి ?
వైరారూరల్ : మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాల, కళాశాలలో సరైన వసతులు లేవంటూ విద్యార్థినుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రెండో శనివారం కావడంతో తమ పిల్లలను కలిసేందుకు వారు కళాశాలకు రాగా.. కనీస సౌకర్యాలు లేవంటూ విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు వైరా – జగ్గయ్యపేట రాష్రీ్టయ రహదారిపై బైఠాయించి 2 గంటలు ఆందోళన చేశారు.పక్కా భవనాలు లేకపోవడంతో రెబ్బవరంలో మూతబడిన ప్రైవేటు పాఠశాల భవనాన్ని అద్దెకు తీసుకొని అందులో కొనసాగిస్తున్నారు. ముసలిమడుగు ఎంజీపీ గురుకుల విద్యార్థులు 440 మంది, వైరా ఎంజీపీ విద్యార్థులు 310 మంది.. రెండూ కలిపి 750 మంది విద్యారి్థనులు ఈ భవనంలోనే ఉంటున్నారు. అయితే భవన ఆవరణలో 22 మరుగుదొడ్లు మాత్రమే ఉన్నాయి. పరిమితికి మించి విద్యార్థినులు ఉండడంతో ఇబ్బంది అవుతోందని గురుకులాల నిర్వాహకులు పలుమార్లు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా పట్టించుకోలేదు.దీంతో పాఠశాలకు వచి్చన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. రెండు గంటలు వాహనాల రాకపోకలకు అంతరాయం వాటిల్లడంతో ఎస్సై వంశీకృష్ణ భాగ్యరాజ్ వచ్చి ఆందోళన విరమింపజేసేలా ప్రయతి్నంచారు. కానీ వసతుల కల్పనపై అధికారులు హామీ ఇవ్వాల్సిందేనని తల్లిదండ్రులు పట్టుబట్టడంతో ఇన్చార్జ్ డిప్యూటీ వార్డెన్ సుధ అక్కడకు చేరుకొని నెల రోజుల్లో మరో కొత్త భవనంలోకి మారుస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
Savitribai Phule: మహిళా విద్యకు తొలి వెలుతురు
‘సావిత్రిబాయి ఫూలే ప్రతిరోజూ సంచిలో అదనంగా చీర పెట్టుకుని స్కూల్‌కు వెళ్లేవారు. దారిలో ఎవరో ఒకరు ఆమె మీద పేడ విసిరితే కడుక్కుని కట్టుకోవడానికి’ అని రాస్తుంది రీతా రామస్వామి గుప్తా. నిమ్న వర్గాల ఆడపిల్లల విద్యకు జీవితాన్ని అంకితం చేసిన సావిత్రిబాయి ఫూలేమీద ఎన్నో పుస్తకాలు వచ్చాయి. కాని రచయిత్రి రీతా రామస్వామి మరిన్ని జీవిత చిత్రాలను సేకరించి తెచ్చిన పుస్తకం ‘సావిత్రిబాయి పూలే’ తాజాగా విడుదలైంది. రీతా రామస్వామి గురించి, పుస్తకంలో ఉన్న విశేషాల గురించి... ‘ఇవాళ బాలికల విద్య అనగానే ప్రపంచానికి మలాలా పేరు గుర్తుకొస్తుంది. కాని బాలికల విద్య కోసం జీవితాన్ని అర్పించిన తొలి మహిళ సావిత్రిబాయి పూలే. మన దేశంలో ఆమె తొలి మహిళా ఉపాధ్యాయిని. ఆడపిల్లల చదువును ప్రచారం చేయడానికి ఆమె ఎదుర్కొన్న వ్యతిరేకత అంతా ఇంతా కాదు’ అంటుంది రీతా రామస్వామి గుప్తా. గతంలో నటుడు సంజీవ్ కుమార్‌పై రాసిన బయోగ్రఫీతో పాఠకులకు తెలిసిన రీతా రామస్వామి ఆ తర్వాత ‘రంగ్ దే బసంతి’ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కలిసి అతని జీవిత సంగ్రహం రాసింది. ‘ఇలా ఇంకొన్ని పుస్తకాలు రాయాలనుకుంటుండగా నా 18 ఏళ్ల కుమార్తె– అమ్మా... ఎందుకు నువ్వు ఎప్పుడూ మగవాళ్ల గురించే రాస్తావు. నువ్వు రాయదగ్గ స్త్రీలు లేరా? అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న నన్ను ఆలోచింపచేసింది. దానికి జవాబే నా కొత్త పుస్తకం– సావిత్రిబాయి పూలే.. హర్ లైఫ్.. హర్ రిలేషన్షిప్స్.. హర్ లెగసీ’ అంది రీతా రామస్వామి. హార్పర్ కాలిన్స్ ఇండియా ప్రచురణ సంస్థ నుంచి ఈ పుస్తకం తాజాగా విడుదలైంది. బలహీనులకు అందని విద్య ‘బ్రిటిష్ వారు 1813లో క్రైస్తవ మిషనరీల ద్వారా మన దేశంలో పాశ్చాత్య విద్యకు అంకురార్పణ చేశారు. అయితే వారి ఉద్దేశాలు వేరే. తమ వ్యవహారాల కోసం ఇంగ్లిష్ తెలిసిన కొంతమంది ఉద్యోగులు అవసరం కనుక పై వర్గాల వారికి చదువు నేర్పిస్తే వారి నుంచి కింది వర్గాల వారికి చదువు అందుతుంది అని భావించారు. కాని పై వర్గాలకు మొదలైన చదువు కింది వర్గాల వరకూ చేరలేదు. కింది వర్గాల వారికి పాఠశాలల్లో అనుమతి లేని పరిస్థితి. అంటరానితనం విస్తృతంగా ఉండేది. ఇక చదువుకు ఆడపిల్లలు నిషిద్ధం చేయబడ్డారు. ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లిష్ వచ్చి ఉండాలన్న నియమం కూడా బ్రిటిష్ ప్రభుత్వం పెట్టింది. వీటన్నింటినీ దాటి సావిత్రిబాయి పూలే టీచర్ అయ్యింది. జ్యోతిబా పూలేతో కలిసి 1848లో బ్రిటిష్‌వారితో సంబంధం లేని, మిషనరీలతో సంబంధం లేని బాలికల తొలి పాఠశాలను మొదలెట్టింది. దిగువ వర్గాల బాలికల విద్య కోసం పోరాడింది’ అంటుంది రీతా రామస్వామి. ఆ ఇద్దరు ‘సావిత్రిబాయి పూలే హర్ లైఫ్, హర్ రిలేషన్షిప్స్, హర్ లెగసీ’... పుస్తకంలో రీతా రామస్వామి కేవలం సావిత్రిబాయి పూలే గురించే రాయలేదు. ఆమెను ఆదర్శంగా తీసుకుని బాలికల విద్య కోసం తోడైన తొలి ముస్లిం ఉపాధ్యాయిని ఫాతిమా షేక్ గురించీ... సావిత్రి, ఫాతిమా కలిసి మహరాష్ట్రలో బాలికల విద్య కోసం స్కూళ్లు స్థాపించి నిర్వహించడానికి పడిన ఆరాటం గురించి కూడా రాసింది. ‘ఫాతిమ షేక్ తొలి క్వాలిఫైడ్ ముస్లిం ఉమెన్ టీచర్ మన దేశంలో. ఆమె సావిత్రిబాయి పూలేకి బాసటగా నిలిచింది. ఒక దశలో సావిత్రిబాయి సుదీర్ఘకాలం జబ్బు పడితే స్కూళ్ల నిర్వహణభారం మోసింది. ఆ వివరాలన్నీ నా పుస్తకంలో ఉన్నాయి’ అని తెలిపింది రీతా రామస్వామి. ఎన్నెన్నో అవమానాలు ‘దిగువ వర్గాల వారిలో ఆడపిల్లలకు చదువెందుకు అనే భావన విపరీతంగా ఉండేది. వాళ్లకు చిన్న వయసులో పెళ్లిళ్లు చేసేవారు. కాని వారి ఇళ్లకు వెళ్లి బడికి పంపమని కోరేది సావిత్రి. వారు శాపనార్థాలు పెట్టేవారు. దారిన పోతూ ఉంటే రాళ్లు విసిరేవారు. దానికి తోడు పేద వర్గాల వారిని చదివిస్తున్నందుకు అగ్రవర్ణాలు కక్ష కట్టి సావిత్రిబాయి మీద పేడనీళ్లు చల్లేవారు. అందుకని ఆమె స్కూలుకు వెళుతున్నప్పుడు తన సంచిలో చీర అదనంగా పెట్టుకునేది. ఎవరైనా పేడ నీళ్లు చల్లినా వెరవకుండా స్కూలుకు వెళ్లి చీర మార్చుకుని పాఠాలు చెప్పేది. ఆమె స్ఫూర్తి నేటికీ కొనసాగడం వల్ల మన దేశంలో బాలికల విద్య గణనీయంగా పెరిగింది. చదువులో ఉద్యోగాల్లో అమ్మాయిలు గొప్పగా రాణిస్తున్నారు. వారంతా తప్పక తెలుసుకోవాల్సిన మహనీయురాలు సావిత్రిబాయి పూలే’ అంది రీతా రామస్వామి. -
జ్యోతిరావ్‌పూలే ఆశయాలు ఆదర్శం: జగన్
సాక్షి, గుంటూరు : దేశ దళిత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రిజర్వేషన్ల పితామహుడు, దేశ దర్శనికుడు మహాత్మా జ్యోతిరావ్‌పూలేకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న ఆయన బుధవారం ఉదయం గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని జ్యోతిరావ్‌పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ పూలే ఆశయాలు యువతకు ఆదర్శమని అన్నారు. భారతదేశంలో నిమ్నకులాల అభ్యున్నతికి కృషి చేసిన పోరాటయోధుడు జ్యోతిరావుపూలే అని కొనియాడారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని అందుకోసం విద్యను చదువుకొవాలని ప్రోత్సహించి, స్వయానా ఆయనే పాఠశాలలను నిర్మించి, తన భార్య సావిత్రిబాయికి విద్యాబుద్ధులు చెప్పి, మహిళల కోసం తన భార్యను ఉపాధ్యాయురాలుగా నియమించిన స్ఫూర్తిప్రధాత అన్నారు. సామాజిక చైతన్యం కావాలని పోరుసల్పిన సామాజిక ఉద్యమ పితామహుడు జ్యోతిరావ్‌పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. Paying tributes to Mahatma Jyotirao Phule, who fought relentlessly against social inequalities and strived for the downtrodden. pic.twitter.com/TFTYp6KK8z — YS Jagan Mohan Reddy (@ysjagan) 11 April 2018 -
బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించింది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సంతకం చేశారు. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు మాత్రమే ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలవుతోంది. మొదటిసారిగా బీసీల కోసం ఓవర్సీస్ స్కాలర్షిప్ కార్యక్రమాన్ని చేపట్టాలని సీఎం నిర్ణయించారు. దీని ద్వారా విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునే విద్యార్థులకు గరిష్టంగా రూ.20 లక్షల వరకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందించనుంది. తొలి ఏడాది 300 మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా రూ.60 కోట్ల ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.


