కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన ఏపీ యాత్రికులు | AP pilgrims stranded in Kedarnath | Sakshi
Sakshi News home page

కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన ఏపీ యాత్రికులు

Sep 28 2026 1:11 PM | Updated on Sep 28 2026 1:19 PM

AP pilgrims stranded in Kedarnath

కేదార్‌నాథ్‌: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడటంతో చిక్కుకుపోయిన సుమారు 1,500 మంది యాత్రికులను అధికారులు సురక్షితంగా తరలిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో చిర్‌బాసా ప్రాంతంలో యాత్రికులు చిక్కుకుపోయినట్లు సమాచారం అందడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌ బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలు చేపట్టాయి. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు ఉన్నట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలానికి చెందిన 45 మంది యాత్రికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. దర్శనాలు ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. తమతో పాటు వేలాది మంది యాత్రికులు ఇక్కడే నిలిచిపోయినట్లు రాయవరం యాత్రికులు చెబుతున్నారు. ఈ వివరాలను ఫోన్ ద్వారా యాత్రికుడు పీవీ కృష్ణారెడ్డి తెలియజేశారు. కాగా ఈ యాత్రికుల క్షేమంపై కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు.

సోన్‌ప్రయాగ్‌కు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిర్‌బాసా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడటంతో మార్గంలో భారీగా మట్టి, రాళ్లు పేరుకుపోయాయి. అంతేకాకుండా కొండపై నుంచి రాళ్లు పడుతుండటంతో యాత్రికుల రాకపోకలు ప్రమాదకరంగా మారాయి. సమాచారం అందుకున్న వెంటనే సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆశిష్‌ డిమ్రీ నేతృత్వంలోని ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందం ఘటనా స్థలానికి చేరుకుంది. పరిస్థితిని అంచనా వేసిన అనంతరం ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్‌డీఆర్‌ఎఫ్‌, డీడీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సంయుక్తంగా సహాయక చర్యలు ప్రారంభించారు.

ప్రమాదకరమైన కొండచరియల ప్రాంతాన్ని యాత్రికులు సురక్షితంగా దాటేలా రెస్క్యూ సిబ్బంది మార్గనిర్దేశం చేశారు. అనంతరం వారిని మరోవైపునకు చేర్చి గౌరీకుండ్‌కు తరలించారు. ఈ ఘటనలో యాత్రికులందరినీ సురక్షితంగా తరలించినట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా, ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో చార్‌ధామ్‌ యాత్ర వరుసగా రెండో రోజూ నిలిచిపోయింది. వర్షాలు, కొండచరియల కారణంగా యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

ఇదీ చదవండి: అజిత్ పవార్‌ను తలచుకుని సునేత్ర కన్నీరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement