దేశంలో పౌరులకు ఆదాయపు పన్ను ఉంటుందని అందరికీ తెలుసు. నిర్ణీత మొత్తం కంటే ఎక్కువ సంపాదించే వారంతా ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. వివిధ రంగాల్లో ఎక్కువ జీతాలు తీసుకునేవారంతా ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. అయితే ముఖ్య మంత్రులు, మంత్రులు వంటి హోదాల్లో ఉన్న వారికి కూడా పెద్ద మొత్తంలో జీతాలు ఉంటాయి. మరి వీరంతా తమకొచ్చే జీతంపై ఆదాయపు పన్నును తామే చెల్లిస్తున్నారా.. లేక ప్రభుత్వం చెల్లిస్తోందా? ప్రభుత్వం చెల్లిస్తోంది అంటే వారు కట్టాల్సిన ట్యాక్స్ ప్రజలుగా మనం కడుతున్నట్లే..
సాధారణ ఉద్యోగి జీతం ఒక పరిమితిని దాటితే ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే. ప్రైవేట్ ఉద్యోగి అయినా, ప్రభుత్వ ఉద్యోగి అయినా.. తన ఆదాయానికి వర్తించే నిబంధనల ప్రకారం ట్యాక్స్ చెల్లిస్తారు. అయితే ముఖ్యమంత్రి, మంత్రుల విషయంలో మాత్రం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి, మంత్రుల జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకు సంబంధించిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరించేలా చట్టాల్లో నిబంధనలు ఉన్నాయి. అంటే.. ఆ పన్ను వ్యక్తిగతంగా సీఎం లేదా మంత్రి భరించకుండా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తుంది.
ఏపీలో ఉన్న నిబంధనలేంటి?
ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న వేతనాల చెల్లింపు చట్టం, 1953లోని సెక్షన్ 3(4) ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతోంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఈ చట్టం కింద లభించే జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకు సంబంధించిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
అంటే ముఖ్యమంత్రి హోదాలో అందుకునే జీతం, సంబంధిత అలవెన్సులు, పెర్క్విజిట్లపై వర్తించే ఇన్‌కమ్ ట్యాక్స్ విషయంలో ఆ మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అయితే సీఎం లేదా మంత్రి ఇతర వ్యక్తిగత ఆదాయాలు పొందితే వాటికి ఈ నిబంధన వర్తించదు. ఈ ప్రత్యేక మినహాయింపు చట్టంలో పేర్కొన్న జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకే పరిమితం.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగుతున్నారు. కొన్ని ప్రకారం సీఎంగా ఆయనకు లభిస్తున్న పారితోషికం నెలకు సుమారు రూ.3.35 లక్షలు. ఇందులో జీతంతో పాటు వివిధ రకాల అలవెన్సులు కలిసి ఉంటాయి.
తెలంగాణలోనూ ఇదే నిబంధన
తెలంగాణలో కూడా ఇదే తరహా నిబంధన కొనసాగుతోంది. వేతనాల చెల్లింపు చట్టం, 1953లోని సెక్షన్ 3(4) ప్రకారం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, ఇతర మంత్రులకు ఈ చట్టం కింద లభించే జీతం, అలవెన్సులు, పెర్క్విజిట్లకు సంబంధించిన ఆదాయపు పన్నును రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.
ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. 2026-27 బడ్జెట్ పత్రాల్లో ఆయన ప్రాథమిక నెల జీతం రూ.4.11 లక్షలుగా తొలిసారి వివరాలు వెల్లడైనట్లు ది హిందూ నివేదించింది. అయితే బేసిక్ జీతంతో పాటు ఇతర అలవెన్సులు, సౌకర్యాలు వేర్వేరుగా ఉండొచ్చు.
మరి ప్రజల డబ్బుతో ట్యాక్స్ కడుతున్నారా?
రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ప్రధాన ఆదాయ వనరుల్లో ప్రజలు చెల్లించే వివిధ పన్నులు, ఫీజులు, కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఇతర ప్రభుత్వ ఆదాయాలు ఉంటాయి. వీటన్నింటి నుంచి ప్రభుత్వ ఖజానా ఏర్పడుతుంది. అదే ఖజానా నుంచి ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల ఖర్చులతో పాటు చట్టప్రకారం సీఎం, మంత్రుల జీతానికి సంబంధించిన ఆదాయపు పన్ను వంటి చెల్లింపులు కూడా జరుగుతాయి.
ఇలా చూస్తే.. ఏపీ, తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రుల అధికారిక జీతం-అలవెన్సులకు సంబంధించిన పన్ను భారం చివరకు ప్రభుత్వ ఖజానాపైనే పడుతుంది. అంటే ఆ చెల్లింపు ప్రభుత్వ వ్యయంగా మారుతుంది.


