విజయవాడ ధర్నాలో భారీగా పాల్గొన్న గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు
చంద్రబాబు మోసపూరిత చర్యలపై ప్రభుత్వ ఉద్యోగులు కన్నెర్ర
ఐఆర్, పీఆర్సీ, ఐదు డీఏలు, మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిల మాటేంటని నిలదీత
బెదిరింపులు, నిర్బంధాలు దాటుకుని నిరసన తెలిపిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు
నోషనల్ ఇంక్రిమెంట్లు, జూనియర్ అసిస్టెంట్ స్థాయి హోదా, సొంత మండలాల్లో నియామకాలకు వీలు, జీవో 11 రద్దు చేయాలని డిమాండ్
ఎక్కడికక్కడ అడ్డుకుని నిరంకుశంగా వ్యవహరించిన సర్కారు
మహిళా ఉద్యోగులను పోలీసులు ఈడ్చుకెళుతుంటే తిరగబడి ఆందోళన కొనసాగింపు
లాఠీలతో చెదరగొట్టినా అదరక, బెదరక మండుటెండలో రోడ్డుపై బైఠాయింపు
సమస్యలు చెప్పుకోవడానికి వస్తుంటే ఇన్ని ఆంక్షలేంటని మండిపాటు
పోలీసులు అమానుషంగా వ్యవహరించేలా ఆదేశాలివ్వడం దుర్మార్గమని ఆగ్రహం
తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించే వరకు విశ్రమించేది లేదని హెచ్చరిక
పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పలు పోలీస్‌స్టేషన్‌లకు తరలింపు
భోజనం, నీళ్లు ఇవ్వకుండా, కాలకృత్యాలు తీర్చుకోనీయకుండా సతాయింపు.. 70 మందిపై కేసులు
సర్కారు తీరును నిరసిస్తూ నేడు అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు వినతిపత్రాలు
రేపు మూకుమ్మడిగా అనధికారికంగా సెలవు
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నిర్ణయం
‘నా కొడుకు జాగ్రత్త అమ్మా’ అని పుట్టింటిలో చంటి బిడ్డను వదిలి న్యాయబద్ధంగా రావాల్సిన హక్కులు, డిమాండ్ల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో జరుగుతున్న నిరసనలో పాల్గొనడానికి వచ్చాను. ఇన్ని అవాంతరాలు, ఇన్ని ఆంక్షలు ఎదురవ్వడం నిజంగా బాధాకరం. మాకు మాత్రమే ఎందుకు ఈ ఆంక్షలు? నా లాంటి ఎంతో మంది మహిళా ఉద్యోగులు వారి పిల్లలను, కుటుంబాలను వదిలి, ఉద్యోగ సమస్యల కోసం ఇక్కడికి వచ్చారు. మా గోడు చెప్పుకునేందుకు అనుమతి లేదంటున్న వారికి మా వంటి తల్లుల మనసులోని బాధ కనిపించ లేదా? మేమేమీ చట్టాన్ని ఉల్లంఘించడానికి రాలేదు. మా సమస్యలను శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో తెలియజేయడానికి మాత్రమే వచ్చాం. మా గొంతు వినండి. మా బాధను అర్థం చేసుకోండి.
– సచివాలయ సగటు మహిళా ఉద్యోగి ఆవేదన, ఆక్రందన
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్న చంద్రబాబు.. ఉద్యోగుల వ్యతిరేక చర్యలను నిరసిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు తిరగబడ్డారు. ఐఆర్, పీఆర్సీ అమలు చేయడంతో పాటు ఐదు పెండింగ్ డీఏలు.. మొత్తంగా రూ.40 వేల కోట్ల బకాయిలు చెల్లింపులపై ఇచ్చిన హామీ ఎందుకు అమలు చేయడం లేదంటూ నిలదీశారు. దీంతో పాటు సచివాలయ ఉద్యోగులకు న్యాయబద్ధంగా రావాల్సిన నోషనల్ ఇంక్రిమెంట్లు, జూనియర్ అసిస్టెంట్ స్థాయి హోదా, సొంత మండలాల్లో నియామకాలకు వీలు, జీవో 11 రద్దు వంటి అంశాలపై నినదిస్తూ నిప్పులు చెరిగారు. ప్రభుత్వ బెదిరింపులు లెక్క చేయక, అడుగడుగునా పోలీసు నిర్బంధాలను దాటుకుని వేలాది మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం విజయవాడకు చేరుకొని సర్కారు తీరుపై కదం తొక్కారు. ఆయా డిమాండ్ల సాధనకు ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి పిలువునివ్వగా.. ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది.
ఉద్యోగులు విజయవాడ వచ్చే అన్ని మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మార్గం మధ్యలోనే పలువురిని నిర్బంధించింది. వారిని ఆయా ప్రాంతాల్లోని పోలీసు స్టేషన్లకు తరలించింది. అయినా వేల సంఖ్యలో ఉద్యోగులు వివిధ మార్గాల్లో చేరుకుని ‘ఛలో విజయవాడ’ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విజయవాడ అలంకార్ సెంటర్ చుట్టుపక్కల దాదాపు 500 మంది పోలీసులు మోహరించి.. అన్ని వైపులా బారికేడ్లు ఏర్పాటు చేసినా, ఉద్యోగులు ఉదయం 9 గంటల కల్లా పెద్ద సంఖ్యలో ధర్నా చౌక్ ప్రాంతానికి చేరుకున్నారు. ఓ వైపు పోలీసులు ఉద్యోగులను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేసినా.. చీమల దండు మాదిరి ఉద్యోగులు వెల్లువెత్తడంతో 10 గంటలకు ఆ ప్రాంతం వారితో కిక్కిరిసింది. మధ్యాహ్నం దాకా నిమిష నిమిషానికీ వారి సంఖ్య మరింతగా పెరిగిపోయింది. సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల నుంచి వస్తూనే ఉన్నారు. ఉద్యోగులు ఇలా తరలి రావడంతో ప్రభుత్వం పోలీసులకు కనుసైగ చేయడంతో అక్కడ పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
మహిళా ఉద్యోగులను ఈడ్చుకుంటూ..
ధర్నా చౌక్‌కు చేరుకున్న ఉద్యోగులను పోలీసులు కొంత మంది చొప్పున విభజిస్తూ పోలీసు వాహనాల్లోకి బలవంతంగా ఎక్కించుకుని వెళ్లే ప్రయత్నం చేయడంతో 10.30 గంటలకు ఉద్యోగులు ప్లకార్లు ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. దీంతో పోలీసులు సచివాలయ ఉద్యోగుల చొక్కా పట్టుకొని లాక్కుంటూ వాహనాల్లోకి ఎక్కించారు. మహిళా ఉద్యోగులను మగ పోలీసులే చుట్టు ముట్టి ఈడ్చుకుంటూ తీసుకెళ్లి వాహనాల్లోకి తోసేశారు. ఈ క్రమంలో కొందరు సచివాలయ ఉద్యోగులను పోలీసులు పొట్టలో, ఇతర భాగాల్లో పిడి గుద్దులతో హింసించినట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఉద్యోగులను ఎక్కించిన వాహనాలు అక్కడి నుంచి కదలకుండా మిగతా ఉద్యోగులు చుట్టుముట్టి ఆందోళన కొనసాగించారు. దీంతో వాహనాల్లో ఎక్కించిన ఉద్యోగులను కిందకు దించి వేయక తప్పలేదు. అనంతరం ఉద్యోగులను వందలాది మంది పోలీసులు చుట్టుముట్టడంతో రోడ్డుపైనే కూర్చొని ఆందోళన కొనసాగించారు.
లాఠీలతో చెదరగొట్టిన పోలీసులు
ఉద్యోగులను వాహనాల్లో ఎక్కించి అక్కడి నుంచి తరలించే ప్రయత్నం సఫలం కాకపోవడంతో.. పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టు ముట్టి మండుటెండలో ఆందోళన కొనసాగిస్తున్న ఉద్యోగులను డ్రోన్ల సహాయంతో పర్యవేక్షిస్తూ ఉండిపోయారు. మధా్నహ్నం ఒంటి గంటకు అదనపు పోలీసు బలగాలను రప్పించి 1.20 గంటలకు లాఠీలతో ఉద్యోగులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. అయితే, మహిళా సచివాలయ ఉద్యోగులు ముందు వరుసలో ఉండి పోలీసులకు ఎదురు తిరగడంతో రోప్ పార్టీలతో వెనక్కి నెట్టుకుంటూ వెళ్లారు. దీంతో ఉద్యోగులు రెండు గ్రూపులుగా విడిపోయి, అలంకార్ సెంటర్‌కు అటు, ఇటు రోడ్డుపై కూర్చొని ఆందోళన కొనసాగించారు.
వందల మంది చనిపోయినా పట్టదా?
భద్రత విధుల్లో ఉన్న సీఐ ఒకరు గుండెపోటుకు గురై ఆసుపత్రిలో చేరిన అనంతరం మరణించిన సంఘటనను చూపుతూ.. ఆందోళన విరమింపజేసేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తూ ప్రభుత్వం కక్ష పూరితంగా రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టింది. మితిమీరి ఇంటింటి సర్వేలు చేయించింది. సెలవు రోజుల్లో కూడా విధులకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో మాపై పని ఒత్తిడి పెరిగింది. ఈ ఒత్తిడి తట్టుకోలేక ఈ రెండేళ్లలో వందలాది మంది ఉద్యోగులు చనిపోయారు. వారి కుటుంబాలను ఆదుకోవాలని అనేక వినతిపత్రాల ద్వారా కోరినా ఈ ప్రభుత్వం పట్టించుకోలేదు. చిన్న స్థాయి ఉద్యోగులమైన మేము సమస్యలు చెప్పకోవడానికి వస్తుంటే ప్రభుత్వం ఇన్ని ఆంక్షలు పెట్టడం న్యాయమా? రెండేళ్లుగా పట్టించుకోని ప్రభుత్వం.. ఇప్పుడైనా మా ఆవేదన తెలుసుకోవాలి. ఉద్యోగం చేస్తాం గానీ, ఊడిగం చేయం. మీరు (పోలీసులు) కూడా ఉద్యోగులే కదా.. మా డిమాండ్లు న్యాయమైనవా.. కాదా.. మీరే చెప్పండి’ అని నిలదీశారు. 
పోలీస్‌స్టేషన్‌లో మహిళా ఉద్యోగుల నిర్బంధం
అటు శ్రీకాకుళం జిల్లా మొదలు ఇటు అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి బస్సులు, రైళ్లలో వచ్చే ఉద్యోగులను దారిపొడవునా తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ పోలీసులు నిర్బంధించారు. విజయవాడ రైల్వే స్టేషను, బస్సు స్టేషన్‌లో వందల మంది పోలీసులు ఉద్యోగులను అడ్డుకొని సమీప పోలీసు స్టేషన్లకు తరలించారు. విజయవాడ నగరంలో పోలీసు స్టేషన్లతో పాటు సమీప ప్రాంత పోలీసు స్టేషన్లన్నీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో నిండిపోయాయి. పదుల సంఖ్యలో మహిళా ఉద్యోగులను కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించి తాళం వేశారు. 109 మంది ఉద్యోగులను బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుంచి బస్సుల్లో 39 మందిని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు, 70 మందిని పెదకాకాని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఎన్‌పురం పోలీస్‌స్టేషన్‌తో పాటుగా కంకిపాడు, ఉయ్యూరు, ఇబ్రహీంపట్నం తదితర పోలీస్ స్టేషన్‌లు ఆదివారం సచివాలయాల ఉద్యోగులతోనే నిండిపోయాయి. 70 మందిపై 35(3) సెక్షన్ మేరకు కేసులు పెట్టారు. 
ఈ కేసులను విజయవాడ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఉద్యోగుల నుంచి, రాష్ట్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో రాత్రి 8, 9 గంటల తర్వాత 41 నోటీసులతో పాటు 35 (3) సెక్షన్ కాగితాలపై సంతకాలు చేయించుకుని, ఆధార్ జిరాక్స్ తీసుకుని వదిలేశారు. తిండి పెట్టలేదు సరికదా.. అనారోగ్యంతో ఉన్నామని చెప్పినా రాత్రి వరకూ కనికరించలేదని ఉద్యోగులు వాపోయారు. కాల కృత్యాలు తీర్చుకోవడానికి కూడా అనుమతించలేదని మండిపడ్డారు. కాగా, పోలీసుల తీరుతో బస్టాండ్, రైల్వే స్టేషన్‌లో సాధారణ ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించిన 70 మందికి మధ్యాహ్నం భోజన సదుపాయం కూడా కల్పించకపోవడంతో వారు ఆకలితో అలమటించారు. ఈ క్రమంలో ఉద్యోగ సంఘం నేత వెంకట్రామిరెడ్డి, సీఐటీయూ నేతలు అక్కడికి వెళ్లి వారిని పరామర్శించారు. మరోవైపు, రాష్ట్రమంతటా అన్ని చోట్ల ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ సచివాలయ ఉద్యోగులు నిరసన ర్యాలీలు చేపట్టారు. 
మేమేమన్నా తీవ్రవాదులమా?
మా న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని రెండేళ్లుగా ప్రభుత్వానికి వినతుల రూపంలో తెలియజేసినా ఉపయోగం లేకపోయింది. దీంతో రాజ్యాంగ బద్దంగా శాంతియుత నిరసన తెలియజేసేందుకు వెళ్తున్న మమ్మల్ని పోలీసులు అడ్డుకుని ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్‌లకు తరలించడం దుర్మార్గం. పోలీసుల్లాగే మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే. అయినా వారు మాతో ఇంత అమానుషంగా ప్రవర్తించి, నిర్బంధించి తీసుకువెళ్లడం దారుణం. మేమేమన్నా తీవ్రవాదుల్లా కనిపిస్తున్నామా? మమ్మల్ని నిర్బంధించినంత మాత్రాన పోరాటం ఆగదు. ప్రభుత్వం దిగివచ్చి మా న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుంది.
– రాజ్‌కుమార్, శ్రీలక్ష్మీ దంపతులు, రాజమండ్రి


