విజయవాడ ధర్నా చౌక్ వద్ద బందోబస్తు విధుల్లో విషాదం
పాయకాపురం (విజయవాడరూరల్)/లబ్బీపేట (విజయవాడతూర్పు): విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆదివారం బందోబస్తు విధుల్లో ఉన్న నున్న పోలీస్‌స్టేషన్ సీఐ ఎస్‌కే అహ్మద్ ఆలీ (54) గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్యతోపాటు ఐదేళ్లు, ఏడేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. సచివాలయ ఉద్యోగుల ఆందోళన సందర్భంగా విధుల్లో ఉన్న సీఐ ఉదయం 11 గంటల సమయంలో అలసటగా ఉందంటూ డ్రైవర్‌ను తీసుకుని సూర్యారావుపేటలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ డాక్టర్‌కు సమస్యను చెప్పడంతో ఈసీజీ, ఎకో చేద్దామన్నారు. డాక్టర్‌తో మాట్లాడుతుండగానే, ‘ఎక్కడ ఉన్నా వెంటనే రావాలంటూ’ ఏసీపీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో మళ్లీ వస్తానని డాక్టర్‌కు చెప్పి సీఐ ధర్నా చౌక్ వద్దకు వచ్చేశారు.
అలా వచ్చిన కాసేపటికే సీఐ తీవ్ర గుండెపోటుతో కుప్పకూలారు. చికిత్సకోసం ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వారంరోజులుగా అలీ నలతగానే ఉంటూ విధులు నిర్వహించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. సీఐ అలీ స్వగ్రామం ఏలూరు సమీపంలోని గోపన్నపాలెం. ఆయన 1996 ఎస్‌ఐగా విధుల్లో చేరారు. అనంతరం ఏలూరు జోన్‌లోని ఉభయగోదావరిజిల్లాలతో పాటు, కృష్ణాజిల్లాలో ఎస్‌ఐగా, సీఐగా విధులు నిర్వహించారు. మరికొద్ది నెలల్లో ఏసీపీగా ఉద్యోగోన్నతి పొందనున్న తరుణంలో ఆకస్మికంగా మరణించారు.
అత్యంత బాధాకరం: పోలీసు అధికారుల సంఘం
సీఐ ఎస్‌కే అహ్మద్ ఆలీ ఆకస్మిక మృతిపట్ల ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేసింది. ఈ ఘటన అత్యంత బాధాకర, దురదృష్టకరమని విచారం వ్యక్తంచేసింది. ఆయన మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియచేసింది. సీఐ కుటుంబానికి అన్ని విధాలా అండదండలు అందిస్తామని హామీ ఇచ్చిన సీపీ ఎస్‌వీ రాజశేఖరబాబు, అడ్మిన్ డీసీపీ కేజీవీ సరితలకు సంఘం ధన్యవాదాలు తెలియజేసింది.


