రోజురోజుకు రెచ్చిపోతున్న టీడీపీ నేతలు
రేయింబవళ్లు ఇసుకను తోడేస్తున్న అక్రమార్కులు
బెంగళూరుకు తరలించి సొమ్ముచేసుకుంటున్న వైనం
భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆందోళన
పట్టించుకోని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం అండతో టీడీపీ నేతలు రోజురోజుకు మరింత పేట్రేగిపోతున్నారు. ప్రకృతి సంపదను నిలువునా దోచేస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా పాపాఘ్ని నదిలో ఇసుకను తోడేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లె నుంచి బెంగళూరుకు నిత్యం పదుల సంఖ్యలో భారీ టిప్పర్లతో ఇసుక తరలిస్తున్నారు. చంద్రబాబు కూటమి సర్కార్ ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక తెలుగుతమ్ముళ్ల అక్రమార్జనకు మార్గంగా మారింది. కోట్లాది రూపాయలు సంపదను కొల్లగొడుతున్నారు.
ఇసుక తరలింపుతో భూగర్భ జలాలు అడుగంటుతాయని రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగినా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. వెరశి పాపాఘ్ని నదికి గర్భశోకం తప్పడంలేదు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె, చక్రాయపేట మండలాల్లో పాపాఘ్ని నది ప్రవహిస్తోంది. పాపాఘ్నిలో నాణ్యమైన ఇసుక ఉంది. బెంగళూరు నగరంలో ఇసుక డిమాండ్ ఉండడంతో అక్రమార్కులు దృష్టి పాపాఘ్నిపై పడింది. వేంపల్లె నుంచి నిత్యం 60కి పైగా టిప్పర్లు, వందలాది ట్రాక్టర్లతో ఇసుక తరలించుకెళ్తున్నారు. బెంగళూరులో టిప్పర్ ఇసుక ధర రూ.లక్షకు పైగా పలుకుతుండటంతో వీరు భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.
పొక్లెయిన్లతో తవ్వకాలు
తెలుగుదేశం పార్టీ నాయకులు వేంపల్లె, చక్రాయపేట మండలాల్లోని పాపాఘ్ని నదిలో పొక్లెయిన్‌లు పెట్టి యథేచ్చగా ఇసుక తవ్వేస్తున్నారు. రెండు మండలాల్లో నిత్యం వంద టిప్పర్ల ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి సమీప బంధువు కనుసన్నల్లో రెండు మండలాల్లో ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. ఇసుక అక్రమ రవాణా కోసం పాపాఘ్ని నదిలో ఏకంగా గ్రావెల్ మట్టితో రోడ్డు ఏర్పాటు చేశారు.
గత కొన్ని రోజులుగా దుర్గామల్లేశ్వరస్వామి ఆలయ సమీపంలో ఇసుకను డంప్ చేసి ట్రాక్టర్లు, టిప్పర్లతో తరలించారు. ఆపై ఏకంగా పాపాఘ్ని నదిలోకి గ్రావెల్ మట్టి రోడ్డును ఏర్పాటు చేసుకుని ట్రాక్టర్లు, టిప్పర్లతో నేరుగా తరలిస్తున్నారు. అక్రమ తవ్వకాల వల్ల ఏర్పడిన గోతుల్లోని వర్షపునీటిలో చిక్కుకుని అద్దాలమర్రి వద్ద అన్నదమ్ములైన ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. అయినా అధికారుల్లో చలనం కనిపించలేదు. మరోవైపు భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయని, ఇసుక తరలింపు ఆపాలని రైతులు ప్రత్యక్ష ఆందోళనకు దిగినా అధికారులు పట్టించుకోలేదు. పైగా అక్రమార్కులు రైతులపై దౌర్జన్యానికి దిగారు.
ఎమ్మెల్యే బంధువు అండ
పాపాఘ్ని నది జిల్లాలో పులివెందుల, కమలాపురం నియోజకవర్గాల్లో ప్రవహిస్తోంది. వేంపల్లె, చక్రాయపేట ప్రాంతాల్లో పులివెందుల టీడీపీ నేత సమీప బంధువు కనుసన్నులల్లో ఇసుక అక్రమ రవాణా నడుస్తుంటే, వీరపునాయునిపల్లె, పెండ్లిమర్రి, వల్లూరు మండలాల్లో టీడీపీ ఎమ్మెల్యే సమీప బంధువు అండతో ఇసుక అక్రమ రవాణా కొనసాగుతోంది. టీడీపీ నేతలు ప్రధాన పట్టణాలు, నగరాలకు ఇసుక తరలిస్తున్నారు. జిల్లాకు చెందిన ముఖ్య అధికారికి నెల మామూళ్లు అందుతుండటం వల్లే ఇసుక అక్రమ రవాణా గురించి రెవెన్యూ, మైనింగ్ అధికారులు పట్టించుకోవడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు.


