టీడీపీది దుర్మార్గపాలన | - | Sakshi
Sakshi News home page

టీడీపీది దుర్మార్గపాలన

Sep 28 2026 1:17 AM | Updated on Sep 28 2026 1:17 AM

● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి

● నేలమట్టమైన అరటి పంటను పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు

మైదుకూరు : కూటమి ప్రభుత్వం లాంటి దుర్మార్గమైన పరిపాలనను గతంలో చూడలేదని వైఎస్సార్‌సీపీ కడప జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె వద్ద ఆదిరెడ్డిపల్లెకు చెందిన కౌలు రైతు నానుబాల చిన్నవీరభద్రుడు అరటిపంట గాలివానకు నేలమట్టంది. ఈ పంటను ఆదివారం మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ రైతు విభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి తదితరులతో రవీంద్రనాథ్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకున్న పరిస్థితి ఎప్పుడూ లేదన్నారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకం కింద రైతులకు రూ. 20,000 ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, కేంద్రం ఇచ్చే రూ. 6,000లతో కలిపి రూ. 14,000 మాత్రమే ఇస్తూ సరిపెడుతున్నారని, అది కూడా కొందరికే ఇస్తున్నారని ఆరోపించారు. రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేకపోతే ఆదుకున్న పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు కరువు కవల పిల్లలని ఇద్దరు వెనకా ముందు వస్తుంటారని ఎద్దేవా చేశారు. చాలా రాష్ట్రాల్లో 102 శాతం పంటలు సాగయ్యాయని .. మన రాష్ట్రంలోనే మైనస్‌ 54 శాతం వర్షపాతం ఉందన్నారు.

రాయలసీమ లిఫ్ట్‌ను పూర్తి చేసి ఉంటే..

రాయలసీమ లిఫ్ట్‌ను ఈ ప్రభుత్వం పూర్తి చేసి ఉంటే రైతులకు మేలు జరిగి ఉండేదని రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ప్రాజెక్టు 90 శాతం పూర్తయిందని మరో 10 శాతం పూర్తి చేసి ఉంటే ఇప్పటి పరిస్థితుల్లోనూ శ్రీశైలం నుంచి నీటిని డ్రా చేసి ఉండొచ్చు అన్నారు. శ్రీశైలం నిండినప్పుడు రిజర్వాయర్లకు చెరువులకు, నీరు ఇవ్వకుండా ప్రభుత్వం చేష్టలుడిగి ఉండటం ఎప్పుడూ చూడలేదని విమర్శించారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారని స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని తెలిపారు. నష్టపోయిన కౌలు రైతు వీరభద్రుడును ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు.

బాధిత రైతును ఆదుకోకపోతే ఆందోళన

గాలివానకు అరటి పంట నేలమట్టమై తీవ్రంగా నష్టపోయిన బాధిత రైతు చిన్న వీరభద్రుడును ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి డిమాండ్‌ చేశారు. దెబ్బతిన్న పంటను కలెక్టర్‌, రెవెన్యూ, ఉద్యాన అధికారులు పరిశీలించి ఆయనకు పరిహారం చెల్లించాలని కోరారు. కూటమి ప్రభుత్వ హయాంలో అతివృష్టి, అనావృష్టితో రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కేసీ ఆయకట్టు కింద రెండు లక్షల ఎకరాల్లో పంటలు సాగుకు నోచుకోలేదని తెలిపారు. వైఎస్సార్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో బాధిత రైతు నానుబాల చిన్నవీరభద్రుడు, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి, ఊటుకూరు రఘురామిరెడ్డి, గల్లా నరసింహారెడ్డి, పులి సునీల్‌ కుమార్‌, నేట్లపల్లె శివరాం, మూలె సుధాకర్‌రెడ్డి, రెడ్యం చంద్రశేఖర్‌రెడ్డి, బండి నాగేంద్ర ప్రసాద్‌, ఇర్షాద్‌, మూలె సుబ్బిరెడ్డి, నాగేంద్ర బాబు, భూమిరెడ్డి శీను, బత్తల సుబ్బరాయుడు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆస్తుల లూటీ

మైదుకూరు : ప్రభుత్వ ఆస్తులను లూటీ చేసే పనిలో చంద్రబాబు ఉన్నాడని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మైదుకూరు మండలం మిట్టమానుపల్లె వద్ద ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక అన్ని అమ్మేసే కార్యక్రమం చేపట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలోని 8 చక్కెర ఫ్యాక్టరీలను అమ్మేందుకు చంద్రబాబు ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిందన్నారు. కోఆపరేటివ్‌ సెక్టార్‌లో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను అమ్మేందుకు సిద్ధపడ్డారని అన్నారు. విక్రయానికి పెట్టిన చక్కెర ఫ్యాక్టరీలకు 770 ఎకరాల భూమి ఉందని, హైవేలకు దగ్గరలో ఉన్న అవి రూ.3వేల కోట్లు విలువ చేస్తాయని తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీలపై ఉన్న అప్పు రూ.1300 కోట్లు మాత్రమేనని, చంద్రబాబు చేసిన రూ.4లక్షల కోట్ల అప్పులో రూ.1300 కోట్లు చెల్లించి పునరుద్దరణ చేస్తే సహకార కర్మాగారాలన్నీ తెరుచుకుంటాయన్నారు. గతంలో వైఎస్సార్‌, వైఎస్‌ జగన్‌ పునరుద్ధరించారని తెలిపారు. చక్కెర ఫ్యాక్టరీలను తమ బినామీలకో, తన వాళ్లకో పప్పు బెల్లాలకు కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement