కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : కడపలో జరగనున్న సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం కడప నగరంలోని కళాక్షేత్రంలో జరుగుతున్న బహిరంగ సభ ఏర్పాట్లను సీపీఐ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను వ్యతిరేకించడంతో పాటు.. ప్రజా సమస్యలపై పోరాటాలను మరింత బలోపేతం చేసేందుకు భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ప్లీనరీ సమావేశాలను కడపలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్లీనరీ సమావేశాల్లో భాగంగా సోమవారం కడప కోటిరెడ్డి సర్కిల్ నుంచి భారీ ర్యాలీ ప్రారంభమై ఎన్టీఆర్ సర్కిల్, 7 రోడ్స్, గోకుల్ లాడ్జ్ మీదుగా కడప కళాక్షేత్రం వరకు కొనసాగుతుందన్నారు అనంతరం కళాక్షేత్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ సభకు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ నాయకులు కె.రామకృష్ణ, పల్లా వెంకటరెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, జిల్లా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారని వెల్లడించారు. దేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతులు, కార్మికుల సమస్యలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, ప్రజా సంక్షేమం, ప్రజాస్వామ్య హక్కులు వంటి అంశాలపై ప్లీనరీలో చర్చించనున్నట్లు తెలిపారు. కడపలో జరుగుతున్న సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయా లని కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువజను లు, ప్రజాసంఘాల నాయకులు, ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ జిల్లా నాయకులు నాగ సుబ్బారెడ్డి,వెంకటశివా, వేణుగోపాల్, బాదుల్లా ,విజయలక్ష్మి,మద్దిలేటి శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


