గ్యాస్ సబ్సిడీకి..
కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో సబ్సిడీ వంట గ్యాస్ కనెక్షన్ కలిగిన వేలాదిమంది వినియోగదారులు అవగాహన లేక ఈ–కేవైసీ చేయించుకోలేకపోయారా? అక్టోబరు 1 నుంచి సబ్సిడీ గ్యాస్ పొందలేని పరిస్థితి తలెత్తనుందా? కమర్షియల్ గ్యాస్ ధర చెల్లించి అదీ కేవలం ఐదు లేదా పది కిలోలు పొందాల్సి ఉంటుందా? ఉలుకు పలుకు లేని డీఎస్‌ఓ తీరును చూస్తే ఈ సందేహాలన్నింటికీ అవుననే సమాధానమే వినిపిస్తోంది.
గ్యాస్ వినియోగదారులందరూ ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని కేంద్రం కొన్ని నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసింది. దీనిపై పలుసార్లు గడువు కూడా పెంచింది. ఈ మేరకు అక్టోబరు 1 నుంచి ఈ–కేవైసీ చేయించుకోని వినియోగదారులకు సబ్సిడీ వంట గ్యాస్ సరఫరా నిలిపి వేయనున్నారు. వీరు సబ్సిడీ లేకుండా మార్కెట్ ధర ప్రకారం డబ్బు చెల్లించి ఐదు లేదా పది కిలోల గ్యాస్‌ను మాత్రమే పొందాల్సి ఉంటుంది. ఈ వినియోగదారులు ఏజెన్సీల నుంచి 14.2 కిలోల గ్యాస్ సిలిండర్ పొందడానికి వీలు ఉండదు. భారత పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం జిల్లాలో సబ్సిడీ వంట గ్యాస్ 14.2 కిలోల సిలిండర్ ధర రూ.950గా ఉంది. సబ్సిడీ లేని కమర్షియల్ గ్యాస్ 19 కిలోల సిలిండర్ ధర రూ. 3000 ఉంది. ఈ–కేవైసీ చేయించుకోని వినియోగదారులు ఐదు కిలోల నాన్ డొమెస్టిక్ సిలిండర్‌ను రూ. 829.50లకు, పది కిలోల సిలిండర్ రూ.1765.00 చొప్పున ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా గ్యాస్ పొందడానికి వీలుండదు. ఈ–కేవైసీ చేయించుకున్న వారికి మాత్రం ఎప్పటిలాగే సబ్సిడీ ధరతో ఏజెన్సీల వద్ద ఎల్‌పీజీ సిలిండర్‌ను పొందవచ్చని భారత పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
స్పందించని డీఎస్‌ఓ !
జిల్లా పౌరసరఫరాల అధికారి రఘురాం ఈ–కేవైసీపై ఇటీవల పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం జిల్లాలో మొత్తం ఐఓసీఎల్ గ్యాస్ కనెక్షన్లు 3,20,706 ఉండగా, అందులో 2,89,984 మంది ఈ–కేవైసీ చేయించుకున్నారు. ఇంకా 30,722 మంది చేయించుకోవాల్సి ఉంది. హెచ్‌పీసీఎల్ కనెక్షన్లు 2,07,345 ఉండగా, 2,05,052 మందికి ఈ–కేవైసీ నిర్వహించారు. ఇంకా 2293 మంది చేయించుకోవాల్సి ఉంది. ఇలా ఈ రెండు కంపెనీల కనెక్షన్లు 528051 ఉండగా, 495036 మంది ఈ–కేవైసీ చేయించుకోగా, 33015 మంది చేయించుకోవాల్సి ఉంది. బీపీసీఎల్ కంపెనీ ద్వారా ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో, అందులో ఎంతమందికి ఈ–కేవైసీ పూర్తి చేశారో? ఇంకా ఎంతమంది మిగిలిపోయి ఉన్నారో? అనే సమాచారం ఆయన ఇవ్వలేదు. సమగ్ర సమాచారం కోసం ఈనెల 21, 22 తేదీలలో ఆయన్ను ఫోన్ ద్వారా సంప్రదించాలని ‘సాక్షి’ప్రయత్నించగా ఆయన కాల్ లిఫ్ట్ చేయలేదు. మూగనోము పట్టిన డీఎస్‌ఓ తీరును పరిశీలిస్తే జిల్లాలో వేలాది మంది వంట గ్యాస్ వినియోగదారులు అక్టోబరు 1 నుంచి సబ్సిడీ కోల్పోయే ప్రమాదం ఏర్పడనుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ–కేవైసీ ఉద్దేశ్యం
వినియోగదారుల ధృవీకరణను బలోపేతం చేయడం, లబ్ధిదారుల రికార్డులను ఖచ్చితంగా నిర్వహించడం, ఎల్‌పీజీ కనెక్షన్ల దుర్వినియోగాన్ని నివారించడం, నిజమైన వినియోగదారులకు ఎల్‌పీజీ సరఫరా అంతరాయం లేకుండా చూడటం ఈ–కేవైసీ ఉద్దేశ్యంగా కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ–కేవైసీ సకాలంలో పూర్తి చేసేందుకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లతో కలిసి ఏజెన్సీ కార్యాలయాల ద్వారా, ప్రత్యేక నమోదు శిబిరాల ద్వారా ఈ కేవైసీ చేయించాలని పేర్కొంది. అలాగే ఇంటింటి సందర్శనలు, డోర్ స్టెప్ సేవల ద్వారా విస్తృత అవగాహన, ఔట్ రీచ్ కార్యక్రమాలను నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. తొలుత ఆగస్టు 15లోపు ఈ–కేవైసీ పూర్తి చేయించుకోవాలని నిర్దేశించిన కేంద్రం పలుమార్లు గడువు పొడిగించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ఎల్‌పీజీ డిస్ట్రిబ్యూటర్లు, ఇతర వాటాదారులను సమన్వయపరిచి ఈ–కేవైసీ పూర్తి చేయడం ద్వారా ఎల్‌పీజీ సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా పౌరసరఫరాల అధికారిపై ఉంటుంది.
ఈకేవైసీ లేకుంటే వంట గ్యాస్ నిలిపివేత!
జిల్లాలో వేలాది మంది వినియోగదారుల సబ్సిడీకి గండం!
ఉలకని, పలకని జిల్లా పౌరసరఫరాల అధికారి


