ప్రొద్దుటూరు క్రైం : యూనిఫాం ధరిస్తే పోలీస్.. క్రీడా బరిలోకి దిగితే పోరాటయోధుడు.. గెలుపుకోసం చెమటోడ్చి, పతకంతో తిరిగొచ్చే పట్టుదల ఆయన సొంతం. చిన్ననాట తైక్వాండోతో మొదలైన బాషా ప్రస్థానం.. నేడు జాతీయ స్థాయిలో పతకాలు సాధించే బాద్‌షాగా నిలిచాడు. విధి నిర్వహణతో పాటు క్రీడారంగంలోనూ ప్రతిభను చాటుతూ పోలీస్ శాఖకు గర్వకారణంగా నిలుస్తున్నారు కానిస్టేబుల్ ఎస్‌పీ మహబూబ్‌బాషా. తైక్వాండో, పెన్సింగ్ క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో అనేక పోటీల్లో పాల్గొని పతకాలు సాధించిన ఆయన ప్రస్థానం నేటి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. కడప జిల్లాలోని పోరుమామిళ్లకు చెందిన మహబూబ్‌బాషా 1999లో నాయబ్‌రసూల్ వద్ద తైక్వాండోలో శిక్షణ ప్రారంభించారు. చిన్న వయసులోనే క్రీడపై ఆసక్తి పెంచుకున్న ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో తన ప్రతిభను చాటారు.
పతకాలు సాధిస్తూ..
1999లో నంద్యాలలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో సబ్‌జూనియర్ విభాగంలో కాంస్య పతకంతో ప్రారంభమైన ఆయన పతకాల ప్రస్థానం.. 2001, 2005, 2007 సంవత్సరాల్లో రాష్ట్రస్థాయి పోటీల్లో రజత, కాంస్య పతకాలతో కొనసాగింది. 2006లో విశాఖపట్నంలో జరిగిన 6వ ఓపెన్ జాతీయ తైక్వాండో పోటీల్లో,2009లో మహరాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన 9వ ఓపెన్ జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. 2009లో బ్లాక్‌బెల్ట్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించగా.. 2011లో జాతీయస్థాయి తైక్వాండో రిఫరీ సెమినార్‌లో ఉత్తీర్ణత సాధించి రిఫరీగా కూడా సేవలందించారు. క్రీడా ప్రతిభ ఆధారంగా 2012లో పోలీస్‌శాఖలో ఉద్యోగం పొందిన బాషా.. విధి నిర్వహణతో పాటు క్రీడా ప్రస్థానాన్ని కొనసాగించారు. ప్రొద్దుటూరు కడప, కడపలోని చిన్నచౌక్, కలసపాడు ప్రాంతాల్లో విధులు నిర్వహించిన ఆయన ప్రస్తుతం ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌లో సేవలందిస్తున్నారు.
ఆల్ ఇండియా పోలీస్ పోటీల్లోనూ ప్రతిభ
2017లో వెస్ట్ బెంగాల్, 2018లో న్యూడిల్లీ, 2022లో న్యూడిల్లీ, 2024లో అస్సాంలోని గౌహతిలో జరిగిన ఆల్ ఇండియా పోలీస్ జూడో క్లస్టర్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. అలాగే 2025 మార్చిలో పంజాబ్‌లోని జలంధర్‌లో జరిగిన తొలి ఆల్ ఇండియా పోలీస్ ఫెన్సింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించారు. ఈ ప్రతిభకు గుర్తింపుగా డీజీపీ రూ. లక్ష నగదు పురష్కారంతో పాటు ఒక ఇంక్రిమెంట్‌ను అందచేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో జరిగిన 14వ జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన జిల్లా పోలీస్ స్పోర్ట్స్ మీట్‌కు హాజరైన కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలు అభినందించారు.
పట్టుదల ఉంటే సాధించలేనిది లేదు..
క్రీడపై చిన్ననాటి నుంచి పెంచుకున్న ఆసక్తిని మధ్యలో వదిలిపెట్టకుండా, ఉద్యోగ బాధ్యతలతో సమన్వయం చేసుకుంటూ జాతీయ స్థాయికి ఎదిగిన మహబూబ్‌బాషా ప్రస్థానం క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఉంటే లక్ష్యాన్ని చేరుకోవచ్చనే సందేశాన్ని యువతకు అందిస్తోంది. క్రీడలను కేవలం వినోదంగా కాకుండా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక మార్గంగా ఎంచుకోవాలని ఆయన ప్రస్ధానం చాటి చెబుతోంది.
తైక్వాండోలో తిరుగులేని ప్రతిభ
ఉద్యోగంతో పాటు క్రీడల్లోనూ జాతీయస్థాయిలో రాణింపు
ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్‌ష్టేషన్‌లో విధులు


