గౌహతి: అస్సాంలో ఆదివారం కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వాలంటీర్ల సమావేశం ప్రారంభం కాకముందే ఉద్రిక్తత నెలకొంది. గౌహతిలో సీజేపీ కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకాతో పాటు పలువురు పార్టీ నేతలు, వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తీవ్రంగా స్పందించారు. పోలీసుల చర్యను ప్రశ్నిస్తూ పలు ఆరోపణలు చేశారు.
సీజేపీ ఆదివారం గౌహతిలో తొలిసారిగా ప్రాంతీయ వాలంటీర్ల సమావేశాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సమావేశానికి పలువురు నేతలు, కార్యకర్తలు హాజరుకావాల్సి ఉంది. అయితే సమావేశానికి వెళ్లే మార్గంలో పోలీసులు అడ్డంకులు సృష్టించారని, కార్యక్రమ స్థలానికి చేరుకోకుండా పలువురిని నిలిపివేశారని సీజేపీ పేర్కొంది. సీజేపీ కో-కన్వీనర్ ఆశుతోష్ రాంకా శనివారమే అస్సాంకు చేరుకున్నారు. ఆదివారం జరగాల్సిన సమావేశంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది. అయితే సమావేశానికి వెళ్లే సమయంలో ఆయనతో పాటు పలువురు నేతలు, వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పార్టీ తెలిపింది. వారిని పోలీసులు గుర్తుతెలియని ప్రాంతానికి తరలించారని అభిజీత్ దీప్కే ఆరోపించారు.
పోలీసులపై అభిజీత్ దీప్కే ఆగ్రహం
ఈ ఘటనపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే సోషల్ మీడియా వేదికగా స్పందించారు. చిన్న స్థాయి వాలంటీర్ల సమావేశానికి వెళ్తున్న తమ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. అదుపులోకి తీసుకున్న వారిని ఎక్కడికి తీసుకెళ్లారనే విషయం వెంటనే తెలియలేదని తెలిపారు. అస్సాంలో ఎన్నికల జాబితా పునర్విమర్శతో ప్రభావితమైన కుటుంబాలను సీజేపీ కలవాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి వాటి పరిస్థితిని పరిశీలించాలని రాంకా గతంలో ప్రకటించారు. ఎన్నికల జాబితా పునర్విమర్శపై కూడా ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ప్రక్రియ ద్వారా రాష్ట్ర ఎన్నికల్లో చోటుచేసుకున్న అవకతవకలు వెలుగులోకి రావచ్చని ఆయన పేర్కొన్నారు.
సమావేశం జరిగే ప్రాంతం సమీపంలో టియర్ గ్యాస్ పరికరాలను మోహరించినట్లు కూడా సీజేపీ ఆరోపించింది. అదుపులోకి తీసుకున్న కార్యకర్తలను కలిసేందుకు తమ న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదని పార్టీ తెలిపింది. ఎంతమంది వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారో, వారు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో వెంటనే నిర్ధారించలేకపోయామని సీజేపీ పేర్కొంది. అదుపులోకి తీసుకున్న ఆశుతోష్ రాంకాతో పాటు ఇతర వాలంటీర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. పోలీసుల చర్యలతో సంబంధం లేకుండా అస్సాంలో తమ గ్రాస్‌రూట్ ప్రచారం కొనసాగుతుందని సీజేపీ స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ


