బోధ్‌గయ: బాలీవుడ్ నటుడు రాజేశ్ కుమార్ పితృపక్ష మేళా సందర్భంగా బిహార్‌లోని గయా చేరుకున్నారు. బోధ్‌గయలోని ధర్మారణ్య వేదిక వద్ద తన పూర్వీకులకు పిండప్రదానం, తర్పణం నిర్వహించారు. నేపాల్‌లో ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం కూడా ప్రార్థనలు చేశారు. గయ జిల్లాలోని గురువా ప్రాంతానికి చెందిన రాజేశ్ కుమార్ శనివారం ధర్మారణ్య వేదిక వద్ద పూర్వీకులను స్మరించుకున్నారు. అనంతరం సీతాకుండ్‌లో దర్శనం, పూజలు చేశారు. తన జీవితంలో తొలిసారి పితృపక్ష మేళాలో పాల్గొనే అవకాశం రావడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు.
పితృపక్షం కేవలం మతపరమైన ఆచారాలకు మాత్రమే పరిమితం కాదని, పూర్వీకులను గుర్తు చేసుకుని వారికి కృతజ్ఞతలు తెలిపే సమయమని రాజేశ్ కుమార్ పేర్కొన్నారు. గయకు తరచూ వస్తున్నప్పటికీ ఇంతకుముందు పితృపక్ష మేళాకు రాలేకపోయానని చెప్పారు. ఫల్గు నదిలో నీటి ప్రవాహాన్ని చూసి సంతోషం వ్యక్తం చేశారు. తన పూర్వీకులతో పాటు నేపాల్‌లో ప్రకృతి విపత్తుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మశాంతి కోసం కూడా రాజేశ్ కుమార్ పిండప్రదానం, తర్పణం నిర్వహించారు. వారికి మోక్షం కలగాలని ప్రార్థించారు.
పితృపక్షం తొలి రోజున ఫల్గు నది ఘాట్ల వద్ద భారీగా భక్తులు తరలివచ్చారు. వర్షం పడుతున్నప్పటికీ పిండప్రదానం కోసం తీర్థయాత్రికులు పెద్ద సంఖ్యలో కనిపించారు. జొన్నలు, బియ్యం, పాలతో తయారు చేసిన ఖీర్‌తో పిండాలను తయారు చేసి, సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించారు. శనివారం భక్తుల సంఖ్య 65 వేలకుపైగా ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. పితృపక్షం రెండో రోజైన ఆదివారం ప్రేతశిల, బ్రహ్మకుండ్, రామకుండ్, రామశిల తదితర వేదికల వద్ద పిండప్రదానం నిర్వహించనున్నారు. ప్రేతశిల వద్ద పిండప్రదానం చేస్తే ప్రేతయోని నుంచి విముక్తి లభిస్తుందని భక్తుల విశ్వాసం. పూజల అనంతరం భక్తులు విష్ణుపాద ఆలయంలో శ్రీ విష్ణుచరణాలను దర్శించుకున్నారు.
ఇదీ చదవండి: యూపీలో వర్ష బీభత్సం..15 మంది మృతి


