నేపాల్‌ వరదలు.. ఇప్పటికీ ఆచూకీలేని 800 మంది! | 800 People Remain Missing from Hydropower Projects after Bhotekoshi Floods | Sakshi
Sakshi News home page

నేపాల్‌ వరదలు.. ఇప్పటికీ ఆచూకీలేని 800 మంది!

Sep 24 2026 12:24 PM | Updated on Sep 24 2026 12:49 PM

800 People Remain Missing from Hydropower Projects after Bhotekoshi Floods

కాఠ్మాండు: నేపాల్‌లో ఆగస్టు 26న సంభవించిన బోటేకోషి వరదల సమయంలో పలు ప్రాజెక్టులలో చిక్కుకున్న 800 మంది ఆచూకీ నేటికీ లభ్యంకాలేదు. వారు భూగర్భ నిర్మాణాల్లో చిక్కుకుపోయి ఉండొచ్చని, వరదల్లో కొట్టుకుపోయి ఉండొచ్చని భావిస్తున్నారు.  వారి కోసం గాలింపు, సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని ఇంధన మంత్రి బిరాజ్ భక్త శ్రేష్ఠ పార్లమెంట్‌కు తెలిపారు. వరదల్లో గల్లంతైన వారిని గుర్తించే అవకాశం ఉన్నంతకాలం సహాయక చర్యలు కొనసాగిస్తామని మంత్రి చెప్పారు. గల్లంతైన వారిలో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన 47 మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.

216 మెగావాట్ల అప్పర్ త్రిశూలి-1 ప్రాజెక్టులో వరదలకు ముందు 1,433 మంది పనిచేస్తున్నారు. వారిలో 955 మంది ప్రమాదం నుంచి బయపడ్డారు. 439 మంది ఆచూకీ ఇంకా తెలియలేదు. వరదల 12వ రోజున ఓ చైనా పౌరుడిని సజీవంగా రక్షించారు. ప్రాజెక్టు సొరంగం నుంచి ఇప్పటివరకు 39 మృతదేహాలను వెలికితీశారు. అప్పర్ త్రిశూలి-3ఏలో 39 మంది, అప్పర్ త్రిశూలి-3బీలో 178 మంది, రసువాగఢి జలవిద్యుత్ ప్రాజెక్టులో 93 మంది, మెయిలుంగ్ ఖోలా ప్రాజెక్టులో ఏడుగురు, రసువా-బోటేకోషి ప్రాజెక్టులో ముగ్గురు గల్లంతయ్యారు. లాంగ్‌టాంగ్ ఖోలా ప్రాజెక్టులో 39 మంది ఆచూకీ లభించలేదు. అక్కడ 19 మందిని రక్షించగా, రెండు మృతదేహాలు లభించాయి.

చిలిమే జలవిద్యుత్ కేంద్రంలోని పవర్‌హౌస్‌లో సహాయక చర్యల సమయంలో నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన ఐదుగురు ఉద్యోగులు మృతిచెందినట్లు గుర్తించారు. మరో ఉద్యోగి ఆచూకీ తెలియాల్సి ఉంది. మధ్య త్రిశూలి గంగా ప్రాజెక్టులో ఇద్దరు, త్రిశూలి జలవిద్యుత్ కేంద్రంలో ముగ్గురు గల్లంతయ్యారు.

నేపాల్ సైన్యం, పోలీసులు, సాయుధ పోలీసు బలగాలు, స్థానిక అధికారులు, భూగర్భ సొరంగ నిపుణులు, భూవిజ్ఞాన శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, సాంకేతిక నిపుణులు, సహాయక సిబ్బంది, బాధితుల కుటుంబాలు కలిసి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నాయి. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ప్రత్యేక హెలికాప్టర్, వాహనాలను ఏర్పాటు చేసింది. గల్లంతైన నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉద్యోగుల కుటుంబాలకు తక్షణ సాయంగా రూ.5 లక్షలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా ఆ ఉద్యోగుల జీతంలో 50 శాతాన్ని ఆరు నెలల పాటు కుటుంబాలకు చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: ట్రక్‌ను ఢీకొన్న కారు.. మంత్రి కుమార్తెతో సహా నలుగురు మృతి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement