ముంబై: నెలకు రూ.75 వేల వరకు సంపాదిస్తున్న ఓ ఆటో డ్రైవర్.. తన నెలవారీ ఖర్చుల వివరాలు వెల్లడించడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇంటి అద్దె, ఈఎంఐ, ఇంటి ఖర్చులు, వాహన నిర్వహణతో పాటు కుమార్తె చదువుకు భారీగా ఖర్చు చేస్తున్నట్లు ఆయన చెప్పాడు. ఈ ఖర్చులన్నీ పోగా చేతిలో ఏమీ మిగలడం లేదని, కొన్ని సందర్భాల్లో బిల్లులు చెల్లించేందుకు అప్పు చేయాల్సి వస్తోందని తెలిపాడు.
కుమార్తె చదువుకు ఏడాదికి రూ.1.40 లక్షలు
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ఆటో డ్రైవర్‌ను అతడి నెలవారీ ఆదాయం, ఖర్చుల గురించి అడిగాడు. నెలకు సగటున రూ.75 వేల వరకు సంపాదిస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడు. ఇంటి అద్దె, గ్యాస్, వాహనం ఈఎంఐ, ఇంటి అవసరాలు తదితర ఖర్చుల వివరాలను అతడు వెల్లడించాడు. తనకు ఒక కుమార్తె ఉందని, ఆమె చదువుకు ఏడాదికి రూ.1.40 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాడు.
‘నేను చదువుకోలేదు.. కూతురును చదివిస్తున్నా’
తాను చదువుకోలేదని, అందుకే తన కుమార్తెను మంచి పాఠశాలలో చదివిస్తున్నానని ఆటో డ్రైవర్ చెప్పాడు. ఆమె విద్య కోసం ఏడాదికి రూ.1.40 లక్షలు వెచ్చిస్తున్నట్లు వివరించాడు. చదువు ఖర్చులు తన కుటుంబ బడ్జెట్‌పై అత్యధిక ప్రభావం చూపుతున్నాయని అతడి మాటలను బట్టి తెలుస్తోంది.
ఖర్చుల తర్వాత మిగిలేది ఏమీ లేదట
నెలకు రూ.75 వేల వరకు ఆదాయం ఉన్నప్పటికీ అన్ని ఖర్చులు చెల్లించిన తర్వాత పొదుపు చేయలేకపోతున్నానని డ్రైవర్ చెప్పాడు. అప్పుడప్పుడు నెలవారీ బిల్లులు చెల్లించేందుకు అప్పు చేయాల్సి వస్తోందని తెలిపాడు. ఈ వీడియోను ఓ ఆర్థిక సేవల సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది.
విద్యా ఖర్చులపై నెటిజన్ల చర్చ
వీడియో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. కుమార్తె చదువుకు అయ్యే ఖర్చును తగ్గించి, భవిష్యత్ విద్య కోసం కొంత మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టాలని ఓ వ్యక్తి సూచించాడు. భారత్‌లో విద్య ఎందుకు ఇంత ఖరీదుగా మారిందంటూ మరొకరు ప్రశ్నించారు. కొందరు మాత్రం తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా పిల్లల విద్యా ఖర్చులను నిర్ణయించుకోవాలని వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: పెన్సిల్ ముల్లుపై కొలువైన సూక్ష్మ గణపతి


