గొప్ప సూఫీ జ్ఞాని హసన్ బస్రీ చివరి ఘడియల్లో ఉన్నప్పుడు, ఒక సన్నిహితుడు ‘హసన్, నీ గురువు ఎవరు?’ అని అడిగాడు. దానికి హసన్ ఇలా అన్నాడు: ‘‘అది చెప్పడం కొంచెం కష్టం.
ఎందుకంటే నాకు వేలమంది గురువులు ఉన్నారు. ఇప్పుడు అందరి గురించీ చెప్పేంత సమయం లేదు. కానీ ముగ్గురు గురువుల గురించి చెప్తాను.
మొదటి గురువు– ఒక దొంగ: ఒకసారి నేను ఎడారిలో దారితప్పి అర్ధరాత్రి ఒక ఊరికి చేరుకున్నప్పుడు, ఒక దొంగ నన్ను తన ఇంటికి తీసుకెళ్ళాడు. అతని వద్ద ఒక నెల రోజులు ఉన్నాను. ప్రతి రాత్రి అతనికి ఏమీ దొరకకపోయినా ఎప్పుడూ నవ్వుతూ, రేపు మళ్ళీ ప్రయత్ని స్తాను. దేవుడి దయ ఉంటే రేపు నా పని పూర్తవుతుంది అనేవాడు. ఏళ్ళ తరబడి నేను ధ్యానం చేస్తూ తీవ్ర నిరాశకు గురైనప్పుడు, ఆ దొంగకే అంత ఆశ, నమ్మకం ఉన్నప్పుడు నేను ఎందుకు ప్రయత్నించకూడదు? అనిపించేది.
రెండో గురువు– ఒక కుక్క: ఒక రోజు తీవ్రమైన దాహంతో ఉన్న ఒక కుక్క నీటిలోకి చూడగానే, తన నీడను చూసి వేరొక కుక్క అనుకుని భయపడింది. చివరకు దాహం ఎక్కువై, భయాన్ని పక్కన పెట్టి నీటిలోకి దూకగానే ఆ నీడ మాయమై హాయిగా నీళ్ళు తాగింది. నేను కూడా జ్ఞాన సాధనలో భయపడి వెనక్కి తగ్గినప్పుడు ఆ కుక్కను గుర్తుచేసుకుని ధైర్యంగా ముందుకు దూకాను. దాంతో నాలోని భయం, నేను అనే భావం మాయమై పరమాత్మ మిగిలాడు.
మూడో గురువు– ఒక చిన్న పిల్లాడు: చేతిలో వెలుగుతున్న ప్రమిదను పట్టుకుని వెళ్తున్న పిల్లాడిని ఈ వెలుగు ఎక్కడి నుండి వచ్చిందో చెప్పగలవా? అని అడిగాను. ఆ పిల్లాడు గాలి ఊది ఆ దివ్వెను ఆర్పేసి, వెలుగు ఎక్కడికి పోయిందో మీరే చెప్పండి! అన్నాడు. ఆ క్షణం నుండి నా పండితత్వాన్ని, జ్ఞానమనే అహంకారాన్ని పూర్తిగా వదిలేశాను’’.
– యామిజాల జగదీశ్


