పాండిత్యమా.. స్వానుభవమా? సత్యాన్ని చూపించేది ఏది? | Spirituality Self Realization Jaimal Singh | Sakshi
Sakshi News home page

పాండిత్యమా.. స్వానుభవమా? సత్యాన్ని చూపించేది ఏది?

Sep 22 2026 7:43 AM | Updated on Sep 22 2026 7:43 AM

Spirituality Self Realization Jaimal Singh

ప్రతీకాత్మక చిత్రం (ఏఐ ఫోటో)

జ్యోతిర్మయం

హర్షులు స్వానుభవంతో రచించిన గ్రంథాలనే శాస్త్రాలని అంటారు. అవి ఏ భాషలో ఉన్నా ఆ భాషలో ప్రావీణ్యత వున్న వారందరికీ ఆ శాస్త్రాలు బాగా అర్థమవుతాయని చెప్పలేము. ఆ యా మహర్షులు ఏ అనుభవాన్ని పొంది వాటిని రచించారో ఆ అనుభవాన్ని పొందిన వారికే ఆ శాస్త్రాల సారం తెలుస్తుంది. కేవల పాండిత్యం అసలైన అర్థాన్ని గ్రహించలేక పోవటమేకాక తప్పు అర్థాన్నిచ్చి తప్పుదారి పట్టించే ప్రమాదం కూడా ఉంది.

ఒకసారి రాధాస్వామి సత్సంగ్‌కు చెందిన జైమల్‌ సింగ్‌జీ వద్దకు ముగ్గురు పండితులు వచ్చారు. వారు ఏదో ఒక శాస్త్ర అంశంపై వాదించుకొని, ఏది సరైన భావమో తేల్చుకోలేక, జైమల్‌ ఒక మహాత్ముడనీ; అంతర దృష్టి, స్వానుభవం గల వ్యక్తి అయినందున సరైన అర్థం చెప్పగలడనీ భావించారు. బాబాజీ వారితో ‘నాకు సంస్కృతం రాదు, అర్థమై
నంత చెబుతాను’ అంటూనే విషయాన్నంతా విడమరచి చెప్పినారు. ఆ పండితులు నివ్వెరపోయారు. ‘మమ్మల్ని మీ శిష్యులుగా చేసికొని ఉపదేశమివ్వండి’ అని ప్రార్థించారు. కానీ జైమల్‌ సింగ్‌జీ  వారితో ‘బాగా చదువుకున్నవారు, విద్యను ఆధారం చేసుకునేవారు నామాభ్యాసాన్ని (సాధనను) చేయలే’రని అన్నారు.

మహా పండితుడైన కావ్యకంఠ గణపతి శాస్త్రి గారికి మోక్షం వస్తుందా అని భగవాన్‌ రమణ మహర్షిని ఎవరో అడిగారట– ‘ఇంత పాండిత్యం ఉన్నవారికి మోక్షమెట్లొస్తుంది’ అన్నారట ఆయన. పాండిత్యం సత్యాన్ని మరుగు పరుస్తుంది. అహంకారాన్ని పెంచుతుంది. స్వానుభవం సత్యాన్ని ప్రకాశింప చేస్తుంది. వినయాన్ని వృద్ధిచేసి, ఆత్మ విశ్వాసాన్ని ధృఢ పరుస్తుంది. జైమల్‌ సింగ్‌జీ మాటల్ని విన్న పండితుల్లో ఇద్దరు వెళ్ళిపోయారు, ఒక్కరు పట్టుదలతో ఆయన వద్దే ఉండి దీక్ష పొందాడు (పుట 58 – భూతల స్వర్గము–రాధాస్వామి సత్సంగ్‌ బ్యాస్‌). పాండిత్యం కోసం ప్రాకులాడక, అంతర్ముఖులై సత్య సాక్షాత్కారానికై కృషి చేయటమే శ్రేయస్కరమన్నది పెద్దల మాట.
– రాచమడుగు శ్రీనివాసులు

ఇదీ చదవండి: విష్ణు సహస్ర నామాలు ఎలా లభించాయంటే..? 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement