ఫండే
కథాకళి
‘‘బి.కాం, ఎం.బి.ఏ. చేశాను సర్. బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో నాకు ఆరేళ్ళ అనుభవం ఉంది.’’ ముప్ఫై రెండేళ్ళ అనీత్ చెప్పాడు.
కంపెనీ యజమానికి అతని జవాబులు సంతృప్తిని ఇచ్చాయి. ఆయన అడిగాడు.
‘‘ఎంత ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు?’’
జీతం మీద ఇద్దరికీ అవగాహన కుదిరాక, ఆయన ఇంటర్‌కంలో సెక్రటరీకి చెప్పాడు.
‘‘అనీత్ పేరు మీద అపాయింట్‌మెంట్ ఆర్డర్ టైప్ చే...’’ అకస్మాత్తుగా ఆయన చెప్పడం ఆపేశాడు.
‘‘సరే. మళ్ళీ నీకు కబురు చేస్తాను.’’ లైన్ కట్ చేసి అనీత్‌తో చెప్పాడు.
‘‘అదేమిటి సార్? నన్ను సెలెక్ట్ చేసుకున్నానని చెప్పారు?’’ అనీత్ ఆశ్చర్యంగా అడిగాడు.
‘‘నీకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇస్తేనే పక్కా ఐనట్లు.’’
అనీత్ తనని ఆ కంపెనీకి రికమండ్ చేసిన తన మేనమామ దగ్గరకి వెళ్ళి జరిగింది వివరించి బాధగా చెప్పాడు.
‘‘చివరి క్షణంలో ఆయన మనసు ఎందుకు మార్చుకున్నారో చెప్పలేదు.’’
ఆయన వెంటనే బాగా మిత్రుడైన ఆ కంపెనీ యజమానికి ఫోన్ చేసి అడిగాడు.
‘‘నీ దగ్గరకి అనీత్ అనే కేండిడేట్‌ని పంపించాను. ముందు సరేనని, తర్వాత వద్దన్నావుట?’’
‘‘అవును. అతను నాకు సూటబుల్ కాదు అనిపించింది.’’
‘‘అనిపించిందా? అకస్మాత్తుగా ఎందుకలా అనిపించింది?’’
‘‘అతని వల్ల కంపెనీకి నష్టం వాటిల్లచ్చని గ్రహించాను.’’
‘‘ఏం నష్టం?’’ అనీత్ మేనమామ అడిగాడు.
‘‘మిత్రమా. వివరాలు అడక్కు.’’ ఆయన లైన్ కట్ చేసేశాడు.
స్పీకర్లో ఆ సంభాషణని విన్న అనీత్ మొహం మాడిపోయింది.
‘‘నావల్ల ఏం నష్టం వస్తుందట?’’ అడిగాడు.
‘‘అక్కడ ఏం జరిగిందో చెప్పు.’’
అనీత్ వివరించాడు. కాని ఆయనకి ఎందుకు తన మిత్రుడు విరమించుకున్నాడో బోధపడలేదు.
∙∙
తన గదిలోకి వచ్చిన అనీత్‌ని చూసి ఆయన కరకుగా చెప్పాడు.
‘‘మళ్ళీ వచ్చావా? నీకు ఉద్యోగం ఇవ్వను. మరో అభ్యర్థిని ఇంకో గంటలో ఇంటర్వ్యూ చేస్తున్నాను. గుడ్ డే.’’
‘‘నావల్ల మీ కంపెనీకి ఏం నష్టం వాటిల్లవచ్చు? అది తెలుసుకోడానికే వచ్చాను. దయచేసి చెప్పండి.’’ అనీత్ అడిగాడు.
‘‘నీ వ్యక్తిగత విషయాలు, దురలవాట్ల గురించి నీతో చర్చించను. గుడ్ డే అగైన్.’’
‘‘ప్లీజ్ సర్. ఇది నా కెరీర్‌కి సంబంధించింది. నన్ను నేను సరిదిద్దుకునే అవకాశం ఇవ్వండి. నావల్ల మీ కంపెనీకి ఏం నష్టం వాటిల్లుతుంది? సప్లై చెయిన్ లోని నా అనుభవం విని ఇంప్రెస్ అయ్యారు. నిన్న మీరు అన్నిటికీ తృప్తి చెందినట్లుగానే కనిపించారు.’’
‘‘ఈ చర్చ ఇంతటితో ముగిసింది.’’ ఆయన కఠినంగా చూస్తూ చెప్పాడు.
‘‘లేదు. మీరు నాకు ఆ వివరణ ఇవ్వాలి. అది తెలుసుకునే హక్కు నాకుంది.’’
ఆయన మౌనంగా బల్ల మీది మానిటర్‌ని చూస్తూ, మౌస్‌ని అందుకుని తన పనిని చేసుకోసాగాడు. ఐదు నిమిషాలు వేచి చూశాక అనీత్ చెప్పాడు.
‘‘ఆల్‌రైట్. నావల్ల మీ కంపెనీకి ఎందుకు నష్టం వస్తుందో చెప్పేదాకా నేను ఇక్కడ నించి కదలను. మీ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాను.’’
ఆయన తన పనిని ఆపి ఏదో మాట్లాడబోయాడు. కాని ఆయన మొబైల్ మోగింది. ఆయన దాన్ని ఆన్సర్ చేసి మాట్లాడసాగాడు. అనీత్ ఓపికగా వేచి చూశాడు. దాదాపు పది నిమిషాల తర్వాత ఆ బిజినెస్ కాల్ ముగిసింది.
‘‘చూడండి. ప్రతివారు తమ సంపదని రక్షించుకోవాలని అనుకుంటారు. సంపద అంటే ఆస్తిపాస్తులు, కేష్, బంగారాలే కాదు. గౌరవం కూడా. మీరు నా గౌరవానికి భంగం కలిగించారు. దాన్ని నేను కాపాడుకోవాలంటే, మీరు నాకా ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి తీరాలి.’’ అనీత్ కోపంగా అడిగాడు.
అతని వంక నిరసనగా చూసి, ఆయన నెమ్మదిగా తన బల్ల కుడివైపు డ్రాయర్‌ని తెరిచి, అందులోంచి ఓ జిప్‌లాక్ కవర్‌ని తీసి అతని వైపు కోపంగా విసిరేశాడు. అందులో జెమ్ క్లిప్స్, గుండుసూదులు ఉన్నాయి. జెమ్ క్లిప్స్ పూర్తిగా పొడవు తీగల్లా తెరిచి ఉన్నాయి. గుండుసూదులు ‘యు’ ఆకారంలో వంచబడి ఉన్నాయి.
ఆయన తను ఫోన్‌లో మాట్లాడేప్పుడు, అనీత్ కాలక్షేపానికి అలా చేసిన వాటిని కూడా చూపించి చెప్పాడు.
‘‘నీ ఈ చెడ్డ అలవాటు చాలామంది ఉద్యోగస్తుల్లో ఉంది. నాశనం నేను సహించలేని మొదటిది. ఇది నా కంపెనీకి నష్టం కాదా? నీ ముందున్నది గంటలోపు నష్టం. ప్రభుత్వ ఆఫీసుల్లో, చాలా ప్రైవేట్ కంపెనీల్లో దీన్ని పట్టించుకోరు. నేను అలా కాదు. నీ కాలక్షేపానికి ఏడాదికి స్టేషనరీ రూపంలో ఎంత నష్టాన్ని కలిగించగలవో నువ్వే ఆలోచించు.’’
- మల్లాది వెంకట కృష్ణమూర్తి
ఇదీ చదవండి: ఒక్కరోజూ కలిసి లేరు... విడిపోవడానికి 20 ఏళ్లు! ట్విస్ట్ ఏంటంటే?


