సైతాను సయ్యాట.. ఈ రచయిత ప్రత్యేకత ఇదే! | Funday Literature Special Story On Laszlo Krasznahorkai Nobel Literature Satantango | Sakshi
Sakshi News home page

అక్షర ప్రపంచానికి అతడే చక్రవర్తి!

Sep 20 2026 10:12 AM | Updated on Sep 20 2026 10:12 AM

Funday Literature Special Story On Laszlo Krasznahorkai Nobel Literature Satantango

ఫండే

లిట్‌వరల్డ్‌

పోస్టల్‌ స్టాంపులు సేకరించే ఆసక్తి వున్న ఫిలాటెలిస్టులకు బాగా తెలిసిన పేరు ‘మాగ్యార్‌ పోస్ట’ హంగేరియన్‌ పోస్టల్‌ స్టాంపులను అలా పిలుస్తారు. హంగేరియన్‌ జాతీయులను కూడా మాగ్యార్లనడం కద్దు. యూరప్‌ నడిమధ్యలో, తూర్పు–పడమరలను కలిపే ప్రాంతంలో పుట్టి, నల్ల సముద్రంలో కలుస్తుంది డాన్యూబ్‌. ఆ నదీపరీవహక ప్రాంతం పొడుగునా విస్తరించిన దేశం హంగరీ. దాని జనాభా ప్రస్తుతం కోటికి కొంచెం అటూ–యిటూగా వుంటుంది.

జాతుల కూర్పు విషయానికి వస్తే, చరిత్రకు తెలిసిన నాటినుంచి హంగరీ బహుళజాతీయ రాజ్యంగానే వుంటోంది! అదే అక్కడ సంకీర్ణ సంస్కృతి అభివృద్ధి చెందడానికి దారి తీసింది. అదే, హంగరీలో ఎందరో మహారచయితలు జన్మించి, ప్రపంచ ప్రసిద్ధి పొందడానికి సైతం కారణమయింది. పదమూడో శతాబ్దికి చెందిన సిమోన్‌ ఆఫ్‌ కేజా బహుశా వారందరిలోకీ ప్రాచీనుడు. ఇరవై ఒకటో శతాబ్ది ప్రథమ పాదం ముగియనుండగా నోబెల్‌ సాహిత్యపురస్కారం గెల్చుకున్న ల్యాజ్లో క్రాజ్నహార్కయ్‌ బహుశా ఈ తరానికి కూడా తెలిసిన బహుముఖ ప్రజ్ఞావంతుడు. ల్యాజ్లో అంటే మహారాజు, చక్రవర్తి లాంటి అర్థాలు చెప్తున్నాయి నిఘంటువులు.

నవలాకారుడిగానూ, సినిమా స్క్రిప్టుల రచయితగానూ సుప్రసిద్ధుడు ల్యాజ్లో. ఆయన కొన్ని యాత్రా చరిత్రలు సైతం రాశారు. ఎవరో, ఆయన్ని వ్యాకులాత్ముడిగా చిత్రించారు– అందులో ఆవ గింజంతైనా అతిశయోక్తి  లేదు! ల్యాజ్లో నవలల్లో భవిష్యత్తు మీద ఆశ కలిగించే లక్షణం దాదాపు శూన్యం. వర్తమానం పట్ల నిరాశనూ, నిర్వేదాన్నీ పెంచే ఆ క్షణమే ల్యాజ్లో నవలల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. పేరుపొందిన ఆయన నవలల జాబితాలో ‘సైతాను సయ్యాట’, ‘ప్రతిఘటన–వ్యాకులత’, ‘హోమర్‌ వేట’, ‘అదిగో అడుగున అమృతమూర్తి’ ప్రముఖంగా కనిపిస్తాయి. ‘నింగి నీడలో విధ్వంసం–విషాదం’ పేరిట ల్యాజ్లో తన చైనా–మంగోలియా యాత్రానుభవాలను గ్రంథస్థం చేశారు. ఈ పుస్తకాలన్నిటి గురించి చెప్పుకోవడం సాధ్యం కాదు కానీ, ల్యాజ్లో విశిష్ట రచనారీతికి ప్రాతినిధ్యం వహించే కొన్ని రచనల గురించి క్లుప్తంగానైనా ప్రస్తావించుకోవడం భావ్యమేమో!

నోబెల్‌ సాహిత్యపురస్కారాన్ని 2025లో గెల్చుకోవడానికి 40 యేళ్ళకు ముందు ల్యాజ్లో రచించిన నవల ‘సైతాను సయ్యాట’. అదే ఆయన తొలి నవల కూడా. ఈ నవల నిత్యాధునికవాదం అనే పోస్ట్‌–మాడర్నిస్ట్‌ రచనా ధోరణికి చెందిందంటారు. ఇందులో ఇతివృత్తం (లాంటిది) ఒకటే కానీ, కథనం మాత్రం అనేక కోణాలనుంచి జరుగుతుంది. ఇది లోకానికి తెలియని కథన రీతేం కాదు– 1950లో అకిరా కురసావ రూపొందించిన ‘రషోమాన్‌’లోనూ ఇదే తరహా కథన రీతి కనిపిస్తుంది. దాదాపు యాభయ్యేళ్ళ తర్వాత జెర్మన్‌ దర్శకుడు టాం టైక్వా రూపొందించిన సినిమా ‘రన్‌ లోలా రన్‌!’లోనూ ఇదే తరహా కథనరీతి కనిపిస్తుంది.

అయితే, ల్యాజ్లో ప్రత్యేకత కథనరీతిలో లేదు. లేదా, నవలలోని ప్రతి అధ్యాయాన్నీ టాంగో నృత్య ముద్రలను తలపించేలా తీర్చిదిద్దడంలోనూ లేదు. అంతకుమించి ఈ నవలను బెలా తార్‌ దర్శకత్వంలో ఏడుగంటల సినిమాగా రూపొందించడంలో అస్సలు లేదు– అలా చెయడంలోని సారాంశంలో ఉంది రచయిత– దర్శకుల విశిష్టత! ‘సైతాను సయ్యాట’ నవల మొత్తం ఓ పాడుపడిన పల్లెటురులో జరుగుతుంది. ఇందులో కథానాయకుడిలా ప్రవేశించిన పాత్రే నిజానికి ప్రతినాయకుడు.

అతగాడే రచయిత దృష్టిలో సైతాను. వాడు చెప్పినట్లల్లా ఆడే కీలుబొమ్మల కదలికలే, అతని సయ్యాటలు. ఆ దిక్కుమాలిన పల్లెలో పడివుండే అమాయకుల్ని ఈ సైతాను మోసగించి వాళ్ళ కష్టార్జితం దోచుకుంటాడు; ఆ తర్వాత వాళ్ళు దేశాలు పట్టిపోయేలా చేస్తాడు. ఇప్పుడు ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు ఇలాంటి సైతాన్ల చేతజిక్కి వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మల్లా ఆడటం చూస్తూనే వున్నాంగా! ఈ పరిణామాన్ని నలభయ్యేళ్ళ కిందటే ఊహించడం, దాన్ని కళాత్మకంగా తీర్చిదిద్దడం ల్యాజ్లో దార్శనికత! అదేమాట 14 సంవత్సరాల కిందటే ‘గార్డియన్‌’ పత్రికలో ఓ సమీక్షకుడు చెప్పాడు.

ల్యాజ్లో 2019లో, హంగేరియన్‌ భాషలో రాసిన నవలిక ‘హోమర్‌ వేట.’ ఇది రెండేళ్ళ తర్వాత ఇంగ్లిషులోకి అనువాదమయింది. ప్రసిద్ధ జెర్మన్‌ చిత్రకారుడు మ్యాక్స్‌ న్యూమన్‌ ఈ నవలికకు బొమ్మలేశారు. నిజానికి ఈ నవలానాయకుడు ఓ అనామకుడు. ప్రాచీన కులీన జెర్మన్‌– పారశీకం– ల్యాటిన్‌– హీబ్రూ– మ్యాండరిన్‌– ఎనిమిదో శతాబ్ది నాటి జపనీస్‌ భాషల్లో ఈ అనామకుడు నిష్ణాతుడు. తనను హతమార్చడానికి తరుముకు వస్తున్న వారి నుంచి తప్పించుకుని పారిపోతున్నానంటాదు సదరు అనామకుడు.

అయితే తనను తరుముతున్న వాళ్ళ రూపురేఖలను మాత్రం అతగాడు వివరించడు. మధ్యధరా సముద్రానికి ఉత్తరాది తీరం వెంబడి ఈ అనామకుడి పలాయనం సాగుతూవుంటుంది. హోమర్‌ ‘ఒడిస్సీ’లో ప్రస్తావించిన అగీజియా ద్వీపంగా చెప్పే ఓ దీవిలో కూడా ఈ అనామకుడి పలాయనం సాగుతుంది. (ఈ ద్వీపంలో వుండే జలదేవత క్యాలిప్సో, తనతో ఉండిపోతే అమరత్వం ప్రసాదిస్తానని యులిసెస్సుకు ఆశపెట్టిందని హోమర్‌ తన కావ్యం ఒడిస్సీలో పాడాడు!) ఈ నవలికకు ఇటు ప్రశంసలూ– అటు అభిశంసలూ బాగానే ప్రాప్తించాయి.

శామ్యుఎల్‌ బెకెట్, ఫ్రాంత్జ్‌ కాఫ్కా, జ్షాన్‌ క్లాడ్‌ ఫాన్‌ డమ్మీల సాహిత్యాత్మల సంకీర్ణ సంతానంగా ఈ నవలికను అభివర్ణించింది ‘పబ్లిషర్స్‌ వీక్లీ.’ అయితే, ఈ నవలికను ‘పరాయీకరణ–ప్రవాసాల పోస్ట్‌–మాడర్న్‌ అధ్యయనం’గా అభివర్ణించింది కిర్కస్‌ రెవ్యూస్‌ పత్రిక ప్రశంసించింది. లోకో భిన్న రుచిః అన్నారు అందుకే!

- మందలపర్తి కిషోర్‌

ఇదీ చదవండి: అహం బ్రహ్మాస్మి: గడ్డిపరక ప్రశ్నకు.. సింహం సమాధానం ఏంటి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement