ఫండే
హెల్త్
కంటి చుక్కలతో కాంతిరేఖ అంధత్వానికి కొత్త వెలుగు!
కంటి చూపుతో చంపేస్తానంటాడు ఒక తెలుగు సినిమాలో హీరో. అవును! కంటికి అంత పవర్ ఉంది. ఆ పవర్ అంతా ఆ కన్ను చూసే చూపులో ఉంది. అంతటి శక్తిమంతమైన చూపు... క్షీణిస్తే?! జీవితం అనుక్షణ దుర్భరం అవుతుంది. ఆ దుర్భర త్వాన్ని తొలగించి తిరిగి చూపును రప్పించే ‘చుక్కల మందు’ను శాస్త్ర పరిశోధకులు తాజాగా కనిపెట్టారు. ఎలుకలు, జెబ్రాఫిష్‌పై ఫలించిన ఆ ప్రయోగాలు ఇప్పుడు మానవుల మీద మొదలవుతున్న దశలో ఉన్నాయి.
చూపు కోల్పోయిన ఎలుకలపై శాస్త్రవేత్తలు చేసిన ఈ ప్రయోగం నిజంగా అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. కాంతికి స్పందించే ఒక ప్రత్యేకమైన రసాయనాన్ని తయారుచేసి, దానిని కంటి చుక్కల మందు రూపంలో అందించినప్పుడు, చూపు లేని ఆ ఎలుకలు మళ్లీ వెలుగును గుర్తించటమే కాకుండా వెలుగుకు అనుగుణంగా స్పందించడం ప్రారంభించాయి!
సాధారణంగా చూపు పునరుద్ధరణ కోసం సంక్లిష్టమైన జన్యు చికిత్సలు (జీన్ థెరపీ), కంటిలో ఆపరేషన్ చేసి ఇంప్లాంట్లు అమర్చడం లేదా ప్రత్యేకమైన లైటింగ్‌ను వాడటం వంటివి చేస్తుంటారు. కానీ ఎలాంటి సర్జరీలు లేదా చిప్‌ల అవసరం లేకుండా, కేవలం కంటి చుక్కల మందుతోనే చూపును తిరిగి తీసుకురావటం ఇది! రెండు రకాల మందుల మిశ్రమంతో శాస్త్రవేత్తలు కనిపెట్టిన దివ్యౌషధం వంటి ఈ చుక్కల మందు ఎలుకల్లో, జెబ్రాఫిష్‌లో చాలా బాగా పనిచేసింది. భవిష్యత్తులో దృష్టి లోపాలు, పూర్తి అంధత్వంతో బాధపడే మానవులకు కూడా చూపు తెప్పించే చికిత్సను అందించవచ్చనే ఆశను ఈ ప్రయోగం శాస్త్రవేత్తల్లో కలిగిస్తోంది.
వెలుగును గుర్తించే శక్తి ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20 కోట్ల మంది ప్రజలు వయసు పైబడటం వల్ల వచ్చే ‘మాక్యులర్ డిజెనరేషన్’ (ఎ.ఎం.డి.), ‘రెటినైటిస్ పిగ్మెంటోసా’ (ఆర్.పి.) వంటి వ్యాధుల వల్ల చూపు కోల్పోతున్నారు. ఈ అంధత్వం కారణంగా వ్యక్తుల రోజువారీ జీవితం, స్వేచ్ఛ దెబ్బతినడమే కాకుండా, వైద్య ఖర్చులు, ఉత్పాదకత తగ్గడం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఏటా రూ. 33,40,000 కోట్లకు పైగా భారం పడుతోంది.
మన కంటిలోని రెటీనాలో ఉండే ‘ఫొటోరిసెప్టర్’ కణాలు కాంతిని గుర్తుపట్టి దాన్ని సంకేతాలుగా మారుస్తాయన్నది తెలిసిందే. అయితే ఎ.ఎం.డి., ఆర్.పి. వ్యాధులలో ఈ ఫొటోరిసెప్టర్ కణాలు నెమ్మదిగా క్షీణించి చనిపోతాయి. ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ఈ ఫొటోరిసెప్టర్లు చనిపోయినప్పటికీ, కంటి లోపల ఉండే మిగిలిన నరాల వ్యవస్థ మాత్రం చాలా వరకు ఆరోగ్యంగానే పనిచేస్తూ ఉంటుంది! కానీ కాంతిని గ్రహించే ఫొటోరిసెప్టర్లు లేకపోవడం వల్ల, ఈ నరాలకు వెలుగు సంకేతాలు అందక మెదడుకు సమాచారం వెళ్లదు.
అందుకే శాస్త్రవేత్తలు కంటిలో సజీవంగా ఉన్న ఈ మిగిలిన నరాల వ్యవస్థను లక్ష్యంగా చేసుకుని, వాటికి మళ్లీ కాంతిని గుర్తించే శక్తిని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న జన్యు చికిత్సలు కేవలం కొద్దిమంది రోగులకు మాత్రమే ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎలక్ట్రానిక్ రెటీనా పరికరాలు చాలా ఖరీదైనవి, సర్జరీ అవసరమైనవి. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తల ఈ చుక్కల మందు మంచి ఫలితాలు సాధించినప్పటికీ, అంధులకు సాధారణ కాంతిలో కూడా స్పష్టమైన దృష్టిని అందించడం ఇప్పటికీ ఒక పెద్ద సవాలుగానే మిగిలింది.
చికిత్స సరళం.. సురక్షితం
ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయోఇంజినీరింగ్ ఆఫ్ కెటలోనియా ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం కాంతి ఆధారంగా స్విచ్‌లా పనిచేసే ఈ కొత్త రకం చుక్కల మందు అణువులను తయారుచేసింది. ఈ పరిశోధన ఫలితాలు ‘జర్నల్ ఆఫ్ ది అమెరికన్ కెమికల్ సొసైటీ’ లో ప్రచురితమయ్యాయి.
చనిపోయిన ఫొటోరిసెప్టర్లు చేసే పనిని తమపైన వేసుకునే విధంగా ఈ రసాయన సమ్మేళనాలను పరిశోధకులు రూపొందించారు. వీటిని కంటికి ఇంజెక్షన్ ద్వారా లేదా కంటి చుక్కల మందు రూపంలో నేరుగా వేయవచ్చు. దీనికోసం ఎలాంటి జన్యు మార్పులు, లేదా కంటిలో పరికరాలు అమర్చడం వంటివి చేయాల్సిన అవసరం లేదు. అలాగే, ఇవి సురక్షితమైనవని కూడా రుజువైంది.
‘‘ఈ అణువులు అంధత్వాన్ని శాశ్వతంగా నయం చేయలేవు, ఎందుకంటే ఇవి ఫొటోరిసెప్టర్ కణాలు చనిపోవడాన్ని నిలిపివేయలేవు. కానీ, ఇవి చూపును తిరిగి తెప్పించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. అంధులకు అత్యంత తేలికైన, సులువైన పద్ధతిలో చూపును అందించడం వీటి ప్రధాన విశేషం’’ అని కెటలోనియా ప్రొఫెసర్ పావ్ గోరోస్టిజా అంటున్నారు.
ఈ అధ్యయన సహ రచయిత్రి రోసల్బా సోర్టినో మాట్లాడుతూ.. ‘‘ఆరోగ్యవంతమైన కంటి రెటీనా ఏ విధంగా పనిచేస్తుందో, సరిగ్గా అదే రకమైన అణు ప్రక్రియ ద్వారా చూపును పునరుద్ధరించడమే మా లక్ష్యం. కంటి నరాల వ్యవస్థను దాటి పోకుండా, చనిపోయిన ఫొటోరిసెప్టర్ల స్థాయిలోనే రెటీనాను మళ్లీ క్రియాశీలం చేయడానికి మేము ప్రయత్నించాం’’ అని తెలిపారు.
సుమారు 10 ఏళ్లకు పైగా సాగిన సుదీర్ఘ పరిశోధనల ఫలితంగా ఈ విజయం సాధ్యమైంది. ఆల్కాలా విశ్వవిద్యాలయం, స్పెయిన్ జాతీయ పరిశోధనా మండలి, బార్సిలోనా విశ్వవిద్యాలయం, ఇంకా పలు ప్రముఖ పరిశోధన సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు కలిసి ఈ అద్భుతాన్ని సాధించారు.
మందు పని చేసే విధానం
మన కంటిలో కాంతిని గుర్తించే ‘ఫొటోరిసెప్టర్లు’ సాధారణంగా సమాచారాన్ని ‘ఆన్ బైపోలార్’ అనే కంటి నరాల కణాలకు అందిస్తాయి. ‘‘ఆరోగ్యవంతమైన కంటిలో వెలుగు పడినప్పుడు ఆ సమాచారాన్ని మెదడుకు పంపడంలో ఈ ఆన్ బైపోలార్ కణాలు కీలక పాత్ర పోషిస్తాయి. కంటి వ్యాధుల వల్ల ఫొటోరిసెప్టర్లు చనిపోయినప్పటికీ, వాటి కింద ఉన్న ఈ నరాల వ్యవస్థ సజీవంగానే ఉంటుంది కానీ నిద్రావస్థలో ఉండిపోతుంది. సరిగ్గా ఇక్కడే వైద్య చికిత్సకు ఒక గొప్ప అవకాశం లభించింది’’ అని ఈ పరిశోధనకు సహ నేతృత్వం వహించిన దే లా విల్లా వివరించారు.
ప్రోతే6 మందు కంటి సజీవ నరాల వ్యవస్థలోని ఎంగ్లూ6 అనే ప్రోటీన్‌ను టార్గెట్ చేస్తుంది. ఇలా చేయడం ద్వారా చనిపోయిన ఫొటోరిసెప్టర్లు చేయాల్సిన పనిని ప్రోతే6 తనే స్వయంగా పూర్తి చేస్తుంది. కంటిపై వెలుగు పడగానే ఈ మందు అణువులు తమ ఆకారాన్ని మార్చుకుంటాయి. ఈ ఆకార మార్పు వల్ల కంటిలో సహజంగా జరిగే చూపు ప్రక్రియ లాగానే విద్యుత్ సంకేతాలు మొదలవుతాయి. ఎటువంటి ఆపరేషన్లు, ఇంప్లాంట్లు లేదా జన్యు మార్పులు లేకుండానే రెటీనా మళ్లీ వెలుగును గుర్తించేలా చేస్తున్నందున శాస్త్రవేత్తలు వీటిని ‘మాలిక్యులర్ ప్రోస్థెసిస్’ (అణు పరికరాలు) అని పిలుస్తున్నారు.
ఈ విధానంలో ఉన్న మరో గొప్ప విశేషం ఏంటంటే... ఇది సాధారణ వెలుతురులో కూడా అద్భుతంగా పనిచేస్తుంది. కొన్ని ఇతర పద్ధతుల్లో లాగా కంటికి ప్రత్యేకమైన బ్రైట్ లైట్లు లేదా కాంతిని పెంచే పరికరాలు అమర్చే అవసరం ఇందులో అవసరం లేదు. ఈ అణువులు చాలా చిన్నవి, నీటిలో కరిగే గుణం ఉన్నవి. ఇవి మనం ఇంట్లో వాడే సాధారణ లైటింగ్ లేదా బయట ఉండే పగటి వెలుతురుకి కూడా స్పందించి చూపును పునరుద్ధరిస్తాయి.
అంధులకు వరం
ఒకవేళ ఈ కంటి చుక్కల ప్రయోగం మానవులపై కూడా అనుకున్నట్లుగా విజయవంతమైతే, ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఖరీదైన చూపు–పునరుద్ధరణ సాంకేతికతలకు ఇది ఒక సులువైన, అందుబాటు ధరలోని ప్రత్యామ్నాయం అవనుంది.. ముఖ్యంగా తీవ్రమైన అంధత్వంతో బాధపడుతూ, ఇప్పటివరకు ఎలాంటి చికిత్సా మార్గం లేని లక్షలాది మందికి ఇది ఒక గొప్ప వరంగా మారుతుంది.
దారి చూపిన జెబ్రాఫిష్, ఎలుకలు
ఈ చుక్కల ముందు చికిత్స ‘ఫొటోఫార్మకాలజీ’ అనే విధానంపై ఆధారపడి పనిచేస్తుంది. అంటే, మందు పనితీరును కాంతి సహాయంతో నియంత్రించటం జరుగుతుంది. శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, మందు రసాయన నిర్మాణంలో కాంతికి స్పందించే ఒక చిన్న ‘లైట్ స్విచ్’ను అమర్చారు. కంటిపై వెలుగు పడగానే ఈ స్విచ్ ఆన్ అయ్యి మందు తన పని ప్రారంభిస్తుంది.
ఈ పద్ధతిని ఉపయోగించి పరిశోధకులు ‘ప్రోతే6’ అని పిలిచే రసాయన సమ్మేళనాల సమూహాన్ని తయారుచేశారు. ఇవి కంటిలోని ‘ఆన్ బైపోలార్’ నరాలపై పనిచేస్తాయి. మన కంటిపై వెలుగు పడినప్పుడు, ఆ వెలుగు/కాంతి సంకేతాలను గుర్తించి, వాటిని విద్యుత్ తరంగాలుగా మార్చి మెదడుకు పంపడంలో ఈ ఆన్ బైపోలార్ నరాలు కీలక పాత్ర పోషిస్తాయి. (కంటిపై వెలుతురు పడగానే ఈ నరాలు ఉత్తేజితమై పనిచేయడం ప్రారంభిస్తాయి కనుకనే వీటిని ‘ఆన్’ బైపోలార్ కణాలు అంటారు. చీకటి పడినప్పుడు పనిచేసేవాటిని ‘ఆఫ్’ బైపోలార్ కణాలు అంటారు). దృష్టి స్పష్టతను పరీక్షించడానికి ఉపయోగించే ‘జెబ్రాఫిష్’ లార్వాలలో ఈ మందు వేయగానే, అవి తమ చూపు శక్తితో కంటి గుడ్లను తిప్పడం ప్రారంభించాయి. జెబ్రాఫిష్ లార్వాలే ఎందుకంటే, వాటి కంటి నిర్మాణం, నాడీ వ్యవస్థ.. మానవుల కంటిని పోలి ఉంటాయి.
అంతేకాకుండా, మాక్యులర్ డీజెనరేషన్, రెటినైటిస్ పిగ్మెంటోసా వల్ల అంధత్వం వచ్చిన ఎలుకల్లో కూడా ఈ మందుతో వెలుగును గుర్తించే సహజ ప్రవర్తన తిరిగొచ్చింది. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న ఎలుకలు ఎక్కువ వెలుగు ఉన్న ప్రాంతాల కంటే చీకటి ప్రాంతాల్లోనే ఉండటానికి ఇష్టపడతాయి. కానీ చూపు కోల్పోయిన ఎలుకలు వెలుగు–చీకటి తేడా తెలియక అన్ని చోట్లా తిరుగుతాయి. అయితే, ఈ ఎలుకలకు ‘ప్రోతే6’ మందు ఇవ్వగానే, అవి మళ్లీ స్వచ్ఛందంగా చీకటి ప్రాంతాల వైపు వెళ్లడం ప్రారంభించాయి. అంటే ఎలాంటి శిక్షణ లేకుండానే ఇవి కాంతిని గుర్తించి, దానికి అనుగుణంగా ప్రవర్తించగలుగుతున్నాయని స్పష్టం అయింది. మన ఇంట్లో ఉండే సాధారణ వెలుతురు లేదా మేఘావృతమైన రోజున బయట ఉండే వెలుతురులో కూడా ఈ మందు చాలా బాగా పనిచేసింది.
ముఖ్యంగా ‘ప్రోతే6–12’, ‘ప్రోతే6–15’ అనే రెండు రకాల సమ్మేళనాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. ఇవి కంటిలోకి ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినప్పుడు మాత్రమే కాకుండా, కేవలం కంటి చుక్కల మందు రూపంలో వేసినప్పుడు కూడా ఎలుకలకు చూపు తిరిగొచ్చింది!
మానవుల్లో మొదలైన టెస్ట్ డోస్‌లు
అంధత్వ నివారణ కోసం ఈ ‘ఫొటోఫార్మాకోలాజికల్’ చుక్కల మందు మానవులపై క్లినికల్ ట్రయల్స్ దశకు చేరుకుంది. ఫొటోఫార్మాకాలజీ అనేది కేవలం ఒక ప్రయోగశాల పరిశోధనగానే మిగిలిపోకుండా, నిజమైన వైద్య చికిత్సగా మారుతోందని ఇది నిరూపిస్తోంది.
ప్రోతే6 సాంకేతికత ఇప్పటికే పేటెంట్ హక్కులను పొందింది. పరిశోధకులు ప్రస్తుతం దీని సురక్షితత్వాన్ని పరీక్షించడంతో పాటు, ఒక్కసారి చుక్కల మందు వేస్తే ఆ చూపు ఎంత ఎక్కువ సమయం నిలిచి ఉంటుందో పరిశీలించేందుకు, అలాగే చూపు సమయాన్ని పెంచేందుకు రసాయన సమ్మేళనాన్ని మెరుగుపరుస్తున్నారు. ఈ సాంకేతికతను మానవ ప్రయోగాలకు, క్లినికల్ ట్రయల్స్‌కు తీసుకువెళ్లడానికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చుకోవడానికి శాస్త్రవేత్తల బృందం ‘ఐల్యూమినియా’ అనే స్టార్టప్ కంపెనీతో కలిసి పనిచేస్తోంది.
‘‘ఈ పరిశోధనను ఒక పరిపూర్ణ వైద్య చికిత్సగా మార్చడం సుదీర్ఘమైన, కష్టమైన ప్రక్రియ. కానీ, ఎలాంటి ఆపరేషన్లు లేకుండా, అత్యంత సురక్షితమైన రీతిలో మందుల ద్వారానే మెరుగైన చూపును తిరిగి తెప్పించవచ్చని ఈ ఫలితాలు నిరూపిస్తున్నాయి. రోగికి ఎలాంటి జన్యు లోపం లేదా ఎలాంటి కంటి వ్యాధి ఉన్నప్పటికీ, దాదాపు అందరికీ ఇది పనిచేస్తుంది’’ అని పరిశోధక ప్రొఫెసర్ గోరోస్టిజా నమ్మకంగా చెబుతున్నారు.
చీకటిని తరిమికొట్టి కొత్త ఆశల కాంతులు నింపడమే శాస్త్రసాంకేతికత సాధించే అసలైన విజయం. చూపు లేని జీవుల్లో వెలుగులు నింపిన ఈ కంటి చుక్కల మందు ప్రయోగం, రేపటి రోజున లక్షలాది మంది అంధుల జీవితాల్లో సరికొత్త రంగులను నింపుతుందని శాస్త్రవేత్తలు నమ్మకంతో ఉన్నారు. నల్లని చీకటి తెరల వెనుక వెలుగుల కోసం ఎదురుచూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఈ పరిశోధన ఒక వెలుగు దివ్వెగా మారి, వాళ్లు మళ్లీ ఈ అందమైన ప్రపంచాన్ని చూసేలా చేయాలి.
- సాక్షి స్పెషల్ డెస్క్
ఇదీ చదవండి: అల్జీమర్స్ నివారణకు...


