ఫండే
లీగలాటా
ఇదో విచిత్రమైన విడాకుల కేసు. పెళ్లి జరిగింది కానీ, ఇద్దరూ ఒక్క రోజూ కలిసి జీవించలేదు, కాపురం చేయలేదు. దాంపత్య జీవితం మొదలుకాకముందే వారి వివాహ బంధం ముగిసిపోయింది. అయితే వీరు వేరు పడడానికి, విడాకులు తీసుకోవడానికి 20 ఏళ్లు పట్టింది. కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు నడిచింది. చివరికి భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించి సుప్రీంకోర్టు ఈ వివాహాన్ని రద్దు చేసి, ఈ కేసుకు ముగింపు పలికింది.
తమిళనాడుకు చెందిన శివశంకరన్, సంతిమీనాల్‌కు 2002లో వివాహం జరిగింది. పెళ్లి తర్వాత ఆమె అత్తారింటికి వెళ్లలేదు. ఎవరికీ చెప్పకుండా పెళ్లి రోజు రాత్రి కల్యాణమండపం నుంచి సొంతూరికి వెళ్లిపోయింది. మరుసటి రోజు బంధువులు ఆమెను తిరిగి తీసుకొచ్చి కాపురం చక్కబెట్టేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. పెళ్లి ఆమె సమ్మతితో జరగలేదని భావిస్తోందని, అందుకే ఈ విధంగా చేస్తోందని భర్త పేర్కొన్నాడు. భార్య ప్రవర్తనతో తాను మానసికంగా కుంగిపోయానని పేర్కొంటూ హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(1)(ఐ–ఏ)కింద 2002లోనే విడాకుల నోటీసు పంపాడు.
వివాహ పునరుద్ధరణ కోరిన భార్య
‘అదనపు కట్నం కోసం తనను వేధించారని, తన భర్త నుంచి అతని సోదరులే తనని దూరం చేశారని సంతిమీనాల్ ఆరోపించారు. వివాహ పునరుద్ధరణ కోరుతూ ఆమె పిటిషన్ దాఖలు చేశారు..ఆమె భర్త సోదరులపై చేసిన ఆరోపణలు మౌఖికంగా తప్ప సాక్ష్యాధారాలను సమర్పించలేదు. భార్యభర్తలు కలిసి జీవించకపోవడం, వివాహ పునరుద్ధరణ కోసం చేసిన ప్రయత్నాలు సఫలం కాకపోవడం తదితర కారణాలను దృష్టిలో ఉంచుకుని 2008లో ట్రయల్ కోర్టు విడాకులు మంజూరు చేసింది. అప్పటికి వారికి వివాహం జరిగి ఆరేళ్లు.
ఆరు రోజులకే రెండో పెళ్లి
విడాకుల తీర్పు వచ్చిన ఆరు రోజులకే భర్త రెండో వివాహం చేసుకున్నాడు. విడాకుల తీర్పుపై మొదటి భార్య అప్పీల్‌కు Ðð ళ్లింది. అప్పిలేట్‌కోర్టు ఆమె వాదనను అంగీకరిస్తూ వివాహ బంధాన్ని కొనసాగించాలని తీర్పు ఇచ్చింది. విడాకుల డిక్రీని రద్దు చేసింది. భర్త ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేశాడు. అప్పీలు కోర్టు తీర్పును పక్కన పెట్టి, ట్రయల్ కోర్టు ఇచ్చిన విడాకుల డిక్రీని సమర్థిస్తూ హైకోర్టు 2018లో తీర్పు ఇచ్చింది. అప్పటికే వారికి పెళ్లయి 15 సంవత్సరాలకు పైగా గడిచిపోయాయి.
రివ్యూ పిటిషన్ దాఖలు
వివాహ బంధం కొనసాగడం లేదన్న ఒక్క కారణంతో విడాకులు మంజూరు చేసే అధికారం ట్రయల్, హైకోర్టులకు లేవని పేర్కొంటూ ఆమె రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. చివరకు ఈ వివాదం సుప్రీంకోర్టు చేరింది. భర్త నుంచి ఎటువంటి మెయింటెనెన్స్ కోరడం లేదని, రెండో వివాహ స్థితిని ప్రభావితం చేయాలని మొదటి భార్య భావించడం లేదని ఆమె తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చాడు. అయితే ‘మొదటి వివాహం ముగిసిపోయిందనే వాదనను ఆమె సమ్మతించడం లేదని పేర్కొన్నాడు.’ ఈ దశలో ఏం చేయాలనేదే సుప్రీంకోర్టు ముందున్న అసలు సమస్య.
ఆర్టికల్ 142ని వినియోగించుకున్న ‘సుప్రీం’
భర్తతో కలిసి ఉంటానని భార్య చెప్పినప్పటికీ ఏళ్ల తరబడి ఆమె వేరుగా ఉంటోంది. వారి బంధం కొనసాగించేందుకు మధ్యవర్తుల ప్రయత్నాలూ ఫలించలేదు. ఈ కారణాలతో వివాహ బంధం కొనసాగే పరిస్థితులు కనిపించడం లేదని కోర్టు నిర్ధారణకు వచ్చింది. పైగా ఆర్‌టీఐ కింద భర్త వ్యక్తిగత వివరాలు కోరడం, రెండో వివాహంపై భర్త పని చేసే కార్యాలయ ఉన్నతాధికారులకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం. ఐపీసీ సెక్షన్ 494 కింద కేసు పెట్టడం వంటి అంశాలను సుప్రీంకోర్టు పరిశీలించింది. కేవలం విడిగా ఉన్నారనే అంశమే కాకుండా, ఇతర వాటినీ పరిశీలించింది. తిరిగి చక్కదిద్దలేని విధంగా వివాహ బంధం వికటించిందనే అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు– భారతరాజ్యాంగంలోని ఆర్టికల్ 142 కింద ప్రత్యేక అధికారాల్ని వినియోగించుకుని వారికి విడాకులు మంజూరు చేసింది. వారి వివాహ బంధానికి ముగింపు పలికింది. దీంతో పాటు ఆమె ఆర్థిక ప్రయోజనాలను కాపాడడానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఆమెకు శాశ్వత భరణం ఏకమొత్తం ఒకేసారి చెల్లించాలని ఆదేశించింది.
ఈ కేసులో కేవలం ఏళ్ల తరబడి విడిగా ఉండడం, మానసిక క్రూరత్వాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోలేదు. ఈ రెండు ఉన్న అన్నీ కేసుల్లోనూ ఆర్టికల్ 142 కింద విడాకుల మంజూరుకు అవకాశం లేదు. ప్రత్యేక పరిస్థితులను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. కలిసి జీవించలేని ఇద్దర్ని ఒక వివాహ బంధం పేరుతో బంధించి ఉంచడం కంటే విడివిడిగా అయినా ప్రశాంత జీవితం గడపడమే మేలని భావించింది. వారి వివాహ బంధానికి, సుదీర్ఘన్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. ఇద్దరికీ కొత్త జీవితానికి మార్గం చూపింది.
- దిలీప్ మాదిరెడ్డి
ఇదీ చదవండి: కూతురి కోసం తండ్రి మొక్కు.. 75 ఏళ్లుగా దేశానికే పండుగ!


