నాట్ ఫినిష్డ్... స్టార్ట్స్ నౌ
ఒక ప్రాణానికి జన్మనివ్వడం సృష్టిలోనే అత్యంత మధురమైన కార్యం. అది తీయనైన మాతృత్వం. కానీ కాన్పు తర్వాత స్త్రీ శరీరంలో వచ్చే సహజమైన మార్పులను ట్రోల్ చేయడం పచ్చి వికృతత్వం. నటి కత్రినా కైఫ్ ప్రసవానంతర శరీరంపై తాజాగా సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ దీనికి నిదర్శనం. అయితే తల్లిగా మారిన ప్రతి స్త్రీ తన రూపాన్ని ఓన్ చేసుకుంటూ, సమాజానికి గట్టిగా చెప్పాల్సిన మాట ఒక్కటే– ‘నో... షి ఈజ్ నాట్ ఫినిష్డ్’.... ఎందుకంటే అమ్మగా ఆమె జీవితంలో పరిపూర్ణ దశ ఇప్పుడే మొదలైంది.
‘వావ్.. ఎంత చక్కగా ఉందో’ అంబానీ ఇంట్లో వినాయక చవితి వేడుకల్లో కత్రినా కైఫ్‌ని చూసిన ప్రతి ఒక్కరూ అనుకున్న మాట ఇది. కానీ కొందరు సోషల్ మీడియా ట్రోల్ రాయుళ్లకు మాత్రం ఆమెలో పరిణిత సౌందర్యం కనిపించలేదు. వాళ్ల కళ్లకు ఆమె కేవలం బొద్దుగా ఉన్న సంగతే కనిపించింది. ఇంకేముంది.. ఒకడైతే ఎక్స్ (ట్విట్టర్)లో ఆమె ఫొటో పక్కన ‘షీ ఈజ్ ఫినిష్డ్‘ (ఆమె పని అయిపాయింది) అంటూ కామెంట్ పెట్టాడు. దాంతో ఇంటర్నెట్‌లో ఒక్కసారిగా హల్‌చల్ మొదలైంది. ప్రసవం తర్వాత స్త్రీ శరీరంలో వచ్చే మార్పులను కూడా భరించలేని నెటిజన్ల సంకుచిత బుద్ధి గురించి మళ్లీ చర్చ మొదలైంది.
ఆమెకు ఇండస్ట్రీ సపార్ట్...
2025 నవంబర్‌లో కత్రీనా మగబిడ్డకు జన్మనిచ్చారు. అయితే భర్త విక్కీ కౌశల్‌తో కలిసి మొదటిసారిగా మొన్న అంబానీ ఇంటి వేడుకల్లో కనిపించారు. వెంటనే ట్రోల్స్ మొదలయ్యాయి. అయితే ట్రోలర్స్ నోళ్లు మూయించడానికి ఇండస్ట్రీ మొత్తం కత్రినా వెనుక స్ట్రాంగ్‌గా నిలబడింది. ‘బ్యాంగ్ బ్యాంగ్’ సినిమాలో ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకున్న హృతిక్ రోషన్ ఆ ట్రోలర్లను తిప్పికొడుతూ పెట్టిన పాస్ట్‌ను లైక్ చేసి గట్టి సపార్ట్ ఇచ్చాడు.
శివాలిక ఒబెరాయ్, ఖుష్బూ సుందర్ లాంటి నటీమణులైతే సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. ‘బిడ్డకు జన్మనిచ్చిన అమ్మ దేహం మారడం భౌతిక స్వభావం. డెలివరీ అవ్వగానే హీరోయిన్లు మళ్లీ పాత సైజ్‌లోకి వచ్చేయాలనే మీ అవాస్తవిక బ్యూటీ స్టాండర్డ్స్‌ను ఇకనైనా ఆపండి‘ అంటూ గట్టి కౌంటర్లు ఇచ్చారు. కత్రినా కూడా చాలా హుందాగా స్పందించింది. ‘కెరీర్ స్టార్టింగ్‌లో అందానికి కొన్ని రూల్స్ ఉండేవేమో కానీ ఇప్పుడు నా దృష్టిలో అందంగా కనిపించడం కంటే ఆరోగ్యంగా, ఆత్మవిశ్వాసంతో ఉండటమే ముఖ్యం’ అని తేల్చేసింది.
ఐశ్వర్యారాయ్ నుంచి నేటి తరం దాకా...
హీరోయిన్లు ట్రోలింగ్‌లు ఫేస్ చేయడం ఇండస్ట్రీలో కొత్త కాదు. ఐశ్వర్యారాయ్ తన కూతురు ఆరాధ్య పుట్టిన తర్వాత బరువు పెరిగినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా, ఇటు సోషల్ మీడియా ఎంత క్రూరంగా ప్రవర్తించాయో అందరికీ గుర్తే. కేన్స్ లో ఆమె లుక్స్‌పై దారుణమైన కామెంట్లు చేశారు. కానీ ఐశ్వర్య వాటన్నింటినీ హుందాగా తిప్పికొట్టింది. విద్యాబాలన్ కూడా ‘శరీరాన్ని ఇతరుల కోసం మార్చుకోవడం కంటే దాన్ని ఎలా ఉందో అలాగే అంగీకరించడమే అసలైన అందం’ అని చాటిచెప్పింది. ఒకప్పుడు తన బరువుపై వచ్చిన విమర్శల వల్ల ఎంతో బాధపడిన సోనాక్షి సిన్హా ఆ తర్వాత గట్టిగా నిలబడి ‘నేను ఎలా ఉన్నానో అలాగే ఉంటాను’ అని తేల్చి చెప్పేసింది.
ఇక టీనేజ్ నుంచే బాడీ షేమింగ్‌ని ఫేస్ చేసిన ప్రియాంక చో ప్రా సినీ ప్రపంచంలోని హిపాక్రసీని ప్రశ్నిస్తూ ‘ఇక్కడ అంతా ఫిట్‌గా, పర్‌ఫెక్ట్‌గా కనిపించాలనే ఒక పిచ్చి ధోరణి నడుస్తోంది. నిజానికి సమస్య మన శరీర పరిమాణంలో లేదు.. పర్‌ఫెక్ట్‌గా కనిపించాలనే చూసేవారి ఆలోచనల్లోనే ఉంది’ అంటూ పాయింట్ లేవనెత్తింది. ఈ బాడీ షేమింగ్ వల్ల వచ్చే మానసిక ఒత్తిడి గురించి సోనమ్ కపూర్ మాట్లాడుతూ ‘ఇతరులు మనలో లోపాలు వెతక్క ముందే మనమే అద్దంలో చూసుకుని లోపాలు వెతుక్కునేలా చేస్తారు. పబ్లిక్ అప్పియరెన్స్‌కు ఎంతలా సిద్ధపడినా లోపల ఆత్మవిశ్వాసంలో హెచ్చు తగ్గులు రావడం సహజం’ అంటూ మనసులోని బాధను పంచుకుంది. ఇలియానా కూడా ‘ఎవరి శరీరమూ అసహజమైనది కాదు.. ఇతరుల అంచనాలకు తగ్గట్టుగా ఏ స్త్రీ మారాల్సిన అవసరం లేదు’ అని ఖరాఖండిగా స్పష్టం చేసింది.
మారాల్సింది చూసే చూపే...
మన సొసైటీలో ఒక విచిత్రమైన హిపాక్రసీ (ద్వంద్వ నీతి) నడుస్తోంది. స్టేజీలెక్కితే ‘లవ్ యువర్ బాడీ’ అంటూ స్పీచెస్ ఇస్తారు. కానీ అదే ఒక సెలబ్రిటీ ఫొటో కనిపిస్తే జూమ్ చేసి మరీ బాడీ షేమింగ్ చేస్తారు. వయసు పెరిగినా ప్రశ్నే, తగ్గినా ప్రశ్నే. హీరోయిన్ అనగానే ఎల్లప్పుడూ బొమ్మలా పర్‌ఫెక్ట్‌గా ఉండాలనే భ్రమల్లో బతికేస్తూ వారు కూడా మనలాంటి మనుషులే అనే విషయాన్ని మర్చిపాతున్నారు.
స్త్రీ శరీరం మారడం ప్రకృతి నియమం. బిడ్డకు జన్మనిచ్చిన మాతృత్వపు మురిపెంలో ఉన్న కత్రినా కైఫ్‌ని చూసి ‘ఫినిష్డ్’ అని అనడం నెటిజన్ల దురుసుకు పరాకాష్ట. జీవన గమనంలో ఉన్న ఏ స్త్రీ ఫినిష్ కాదు. అవదు. కాబట్టి మారాల్సింది సెలబ్రిటీల శరీరం కాదు.. వాళ్లను చూసే మన సమాజపు చూపు!
– రమా జంబుల


