‘‘తల్లయిన హీరోయిన్లకు గతంలో అవకాశాలు చాలా తక్కువగా వచ్చేవి. హీరోయిన్‌గా చాన్స్‌లు వచ్చేవి కాదు. కానీ, ప్రస్తుతం అలా కాదు... పెళ్లయ్యాక, తల్లయ్యాక కూడా కథానాయికల సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. నటించాలనే ఆసక్తి ఉన్నంతకాలం అమ్మతనం కెరీర్‌కు అడ్డంకిగా మారదు’’ అని పరిణితీ చోప్రా తెలిపారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘షఖ్: ట్రస్ట్ నో వన్’.
ఈ నెల 24 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా పరిణితీ చోప్రా మాట్లాడుతూ–‘‘పెళ్లి, పిల్లలు తర్వాత అవకాశాలు అందుకునే విషయంలో గతంలో ఒక తరం నటీమణులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. తల్లయిన మహిళలను లీడ్ రోల్స్‌లో చూడడానికి ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపలేదు. నాటి ప్రేక్షకులు, పరిశ్రమ ఆలోచనా విధానం వల్ల ఒక తరం నటీమణులు కెరీర్‌ను త్యాగం చేయాల్సి వచ్చింది. బిడ్డకు జన్మనివ్వడం జీవితంలో అందమైన విషయం. ఆ కారణం వల్ల పని కోల్పోవాల్సి వస్తే బాధగా ఉంటుంది.
ఇప్పుడు తల్లులైన హీరోయిన్ల సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తుండటం వల్లే రచయితలు, దర్శకులు వారికి తగ్గ కథలను సిద్ధం చేస్తున్నారు. ఆలియా, దీపికా, ప్రియాంకా చోప్రా వంటి వారు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే కెరీర్‌ను ముందుకు తీసుకెళుతుండటం సంతోషం. నటిగా నేను కూడా ఒకే తరహా పాత్రలు కాకుండా నాకు సరిపోయే వైవిధ్యమైన క్యారెక్టర్స్ చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. ఇదిలా ఉంటే... పొలిటీషియన్ రాఘవ్ చద్దాని 2023లో పరిణితి పెళ్లి చేసుకున్నారు. వీరికి నీర్ అనే కుమారుడు ఉన్నారు.


