‘జీరో’ నుంచి రూ .1.4 కోట్ల జీతానికి.. టెకీ సక్సెస్ స్టోరీ వైరల్ | Techie Career Journey Unpaid Job to 1 4 crore Salary reddit | Sakshi
Sakshi News home page

‘జీరో’ నుంచి రూ .1.4 కోట్ల జీతానికి.. టెకీ సక్సెస్ స్టోరీ వైరల్

Aug 14 2026 5:26 PM | Updated on Aug 14 2026 5:54 PM

Techie Career Journey Unpaid Job to 1 4 crore Salary reddit

కెరీర్ ప్రారంభంలో జీతం లేకుండా పనిచేసిన ఓ టెక్ ప్రొఫెషనల్.. 14 ఏళ్లకు పైగా అనుభవంతో ప్రస్తుతం ఏడాదికి దాదాపు రూ.1.4 కోట్ల సమానమైన వేతనం అందుకుంటున్నానని వెల్లడించడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ 35 ఏళ్ల క్లౌడ్, డెవ్‌ఆప్స్ ప్రొఫెషనల్ తన జీతం ఎలా దశలవారీగా పెరిగిందో సోషల్‌ ప్లాట్‌ఫామ్‌ రెడిట్‌లో పంచుకున్నారు.

రెడిట్‌లోని r/IndianWorkplaceలో ‘DevOpsHumbleFool’ పేరుతో ఉన్న యూజర్  తన కెరీర్ ప్రయాణాన్ని వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ టెక్నికల్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ‘సగటు కంటే తక్కువ’ కాలేజీ నుంచి చదువు పూర్తి చేశానని, తన కెరీర్‌ను ఢిల్లీలో జీతం లేని ఉద్యోగంతో ప్రారంభించానని చెప్పారు. ఆ పని ఏడాదిలోపే ముగిసిందని, అనంతరం బెంగళూరులో రూ.6 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగంలో చేరి రెండేళ్లు పనిచేసినట్లు రాసుకొచ్చారు.

ఆ తర్వాత మరో సంస్థలో రూ.7 లక్షల నుంచి రూ.9 లక్షల వరకు వేతనం పెరిగింది. అక్కడ దాదాపు 4.7 సంవత్సరాలు పనిచేశారు. తదుపరి బెంగళూరు సంస్థలో రూ.17 లక్షల ప్యాకేజీతో చేరి, ఐదేళ్లలో దాన్ని రూ.35 లక్షలకు పెంచుకున్నారు. ఈ దశలో మరో సంస్థ నుంచి రూ.70 లక్షల ఆఫర్ వచ్చినప్పటికీ, తాను ఆ ఉద్యోగంలో చేరలేదని చెప్పారు. అయితే ఆ ఆఫర్ తన మార్కెట్ విలువను అర్థం చేసుకునేలా చేసిందని పేర్కొన్నారు.

రూ.35 లక్షల నుంచి విదేశీ క్లయింట్ల వరకు..

కెరీర్‌లో కీలక మలుపు విదేశీ క్లయింట్లతో పనిచేయడం ద్వారా వచ్చిందని ఆయన వివరించారు. ‘క్లయింట్ A’తో సుమారు రెండేళ్లు పనిచేసిన సమయంలో ఏడాదికి రూ.1.15 కోట్ల సమానమైన ఆదాయం వచ్చినట్లు, ప్రస్తుతం ‘క్లయింట్ B’తో ఏడాదికి రూ.1.40 కోట్ల స్థాయిలో సంపాదిస్తున్నట్లు వెల్లడించారు. ఈ మొత్తాలు అమెరికా డాలర్లలో అందుతున్నాయని, తాను ప్రస్తుతం అమెరికాలో ఉన్నానని ఆయన కామెంట్లలో స్పష్టం చేశారు. క్లయింట్ A రిమోట్ రోల్‌ కాగా, క్లయింట్ B పాత్ర ఆన్‌సైట్ అని తెలిపారు.

సైడ్ గిగ్స్‌తో అదనపు ఆదాయం

ప్రధాన ఉద్యోగంతో పాటు కెరీర్‌లో సైడ్ గిగ్స్ కూడా చేశానని ఆయన వెల్లడించారు. అలా తనకు నెలకు సుమారు రూ.15,000 నుంచి రూ.65,000 వరకు అదనపు ఆదాయం వచ్చేదని చెప్పారు. యూట్యూబ్, పెయిడ్ ఇంటర్వ్యూలు, చిన్న ప్రాజెక్టులు, టెక్నికల్ కన్సల్టేషన్స్, ఫోన్ ద్వారా టెక్నికల్ సహాయం వంటి పనులు చేసేవాడినని వివరించారు. తన యూట్యూబ్ కంటెంట్ కారణంగా లింక్డ్‌ఇన్‌లో గుర్తింపు పెరిగి, అక్కడి నుంచే చాలా సైడ్ గిగ్ అవకాశాలు వచ్చాయని తెలిపారు. అయితే ప్రస్తుతం అమెరికాలో ఉండటంతో ఉద్యోగం, వీసా నిబంధనల నేపథ్యంలో సైడ్ గిగ్స్ పూర్తిగా నిలిపివేశానని చెప్పారు.

డిగ్రీ కంటే నైపుణ్యాలకే ప్రాధాన్యం

తన విద్యా నేపథ్యం గొప్పది కాకపోయినా, DevOps, Cloud టెక్నాలజీలపై విస్తృత నైపుణ్యాలు తన కెరీర్ ఎదుగుదలకు ప్రధాన కారణమయ్యాయని ఆయన అభిప్రాయపడ్డారు. జావా డెవలపర్‌గా కెరీర్ ప్రారంభించి, బిల్డ్‌ & రిలీజ్‌ ఇంజినీరింగ్‌ నుంచి డెవాప్స్‌, ఆ తర్వాత క్లౌడ్‌ విభాగంలోకి మారినట్లు వివరించారు. ప్రస్తుతం తన పనిలో కోడింగ్ భాగం సుమారు 10 శాతం మాత్రమేనని చెప్పారు. AI తన పనిని ఇప్పటివరకు దెబ్బతీయలేదని, అయితే తన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి AI సాధనాలను విస్తృతంగా ఉపయోగిస్తున్నానని తెలిపారు.

30ల్లోనూ విదేశీ అవకాశాలు సాధ్యమేనంటూ..

తాను 30లలోనే అమెరికాకు వెళ్లానని, 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉండటం వల్ల విదేశీ అవకాశాలు మరింత అందుబాటులోకి వచ్చాయని ఆయన చెప్పారు. తొలుత రిమోట్ అవకాశాన్ని పొందిన తర్వాత వర్క్ వీసా ద్వారా అమెరికాకు వెళ్లినట్లు, ప్రస్తుతం H-1Bపై ఉన్నట్లు కామెంట్లలో వెల్లడించారు. తనకు తెలిసిన ఓ సీనియర్ 42 ఏళ్ల వయసులో అమెరికాకు వెళ్లారని కూడా పేర్కొన్నారు.

అయితే అధిక జీతంతో పాటు విదేశీ ఉద్యోగ జీవితంలోని సవాళ్లను కూడా ఆయన ప్రస్తావించారు. కుటుంబానికి దూరంగా ఉండటం, ఒంటరితనం, వీసాపై ఆధారపడటం, ఉద్యోగ భద్రతపై అనిశ్చితి వంటి అంశాలు అమెరికాలోని జీవితంలో ప్రతికూలతలుగా పేర్కొన్నారు.

ఈ పోస్టుపై వందలాది మంది స్పందించారు. ముఖ్యంగా తక్కువ జీతాలతో కెరీర్ ప్రారంభిస్తున్న యువత తమ అనుభవాలను పంచుకోవడంతో పాటు డెవాప్స్‌, క్లౌడ్‌ వంటి నైపుణ్యాల్లోకి ఎలా మారాలి, సైడ్ గిగ్స్ ఎలా సంపాదించాలి, AI వల్ల టెక్ ఉద్యోగాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది వంటి ప్రశ్నలు అడిగారు. టెకీ మాత్రం నైపుణ్యంతో పాటు ఆన్‌లైన్ ప్రొఫెషనల్ ప్రెజెన్స్‌ను పెంచుకోవడం తన కెరీర్‌లో కీలకంగా పనిచేసిందని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement