ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో భారతీయ శాస్త్రవేత్త ప్రాభవం అంతర్జాతీయ సాంకేతిక దిగ్గజాలను విస్మయానికి గురిచేస్తోంది. ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి, ప్రముఖ ఏఐ పరిశోధకుడు త్రపిత్ బన్సల్‌ను తమ వైపు తిప్పుకునేందుకు సోషల్ మీడియా దిగ్గజం మెటా రూ.800 కోట్ల (100 మిలియన్ డాలర్లు) భారీ వేతన ప్యాకేజీని ఆఫర్ చేసినట్లు వెలువడిన నివేదికలు సిలికాన్ వ్యాలీలో చర్చనీయాంశమయ్యాయి. ఒక ఏఐ పరిశోధకుడికి ఈ స్థాయిలో పారితోషికం దక్కడం అంతర్జాతీయ సాంకేతిక చరిత్రలో అరుదైన ఘట్టం.
ఎవరీ త్రపిత్ బన్సల్?
త్రపిత్ బన్సల్ విజయం రాత్రికి రాత్రే సాధ్యమైంది కాదు; ఇది దశాబ్దానికి పైగా సాగిన కఠోర సాధన, నాణ్యమైన పరిశోధనల ఫలితం. 2007-2012 మధ్య ఐఐటీ కాన్పూర్ నుంచి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్‌లో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ పూర్తి చేసిన బన్సల్, అనంతరం బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేశారు. తరువాత అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మాసాచుసెట్స్ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ పట్టా పొందారు.
తన పరిశోధనా కాలంలో ఫేస్‌బుక్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఓపెన్ఏఐ వంటి దిగ్గజ సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌లు చేస్తూ డీప్ లెర్నింగ్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ (ఎన్‌ఎల్‌పీ) రంగాల్లో విశేష అనుభవాన్ని గడించారు. 2022లో ఓపెన్ఏఐలో చేరిన బన్సల్.. సంస్థ సహ వ్యవస్థాపకుడు ఇల్యా సుత్సకెవర్‌తో కలిసి పనిచేశారు. ముఖ్యంగా ఓపెన్ఏఐ అత్యంత సాంకేతిక సంక్లిష్టమైన రీజనింగ్ మోడల్ ‘ఓ1’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించి గ్లోబల్ ఏఐ వర్గాల్లో గుర్తింపు పొందారు.
మెటా ఎందుకింత భారీ ఆఫర్ ఇచ్చింది?
ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలో ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్’ (ఏజీఐ), సూపర్ ఇంటెలిజెన్స్ సాధించేందుకు గూగుల్, మెటా, ఓపెన్ఏఐల మధ్య తీవ్రమైన పోటీ నడుస్తోంది. మార్క్ జుకర్ బర్గ్ నేతృత్వంలోని మెటా, తమ 'సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్'ను బలోపేతం చేసేందుకు అత్యుత్తమ మేధావులను ఆకర్షిస్తోంది. బన్సల్‌కు ఉన్న మ్యాథమెటికల్ పునాది, అడ్వాన్స్డ్ ఏఐ రీజనింగ్ మోడళ్లపై ఉన్న అసాధారణ పట్టు మెటా వ్యూహాలకు కీలకంగా మారుతాయని కంపెనీ భావిస్తోంది.
యువతకు సందేశం
కోడింగ్ షార్ట్‌కట్‌లు, స్వల్పకాలిక కోర్సులతో కొన్ని విజయాలు సాధించాలనుకునే ఈ డిజిటల్ యుగంలో.. సుదీర్ఘ అధ్యయనం, ప్రాథమిక విజ్ఞానం, నిరంతర పరిశోధన మాత్రమే అత్యున్నత శిఖరాలకు చేరుస్తాయని త్రపిత్ ప్రయాణం నిరూపిస్తోంది. సబ్జెక్టుపై తిరుగులేని నైపుణ్యం ఉంటే ప్రపంచమే మన కోసం వస్తుందని ఈ ఉదంతం తేటతెల్లం చేస్తోంది.
ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..


