టాటా కార్ల ధరలు మరోసారి పెరగనున్నాయి. ఈ మేరకు టాటా మోటార్స్ నుంచి సంకేతాలు వచ్చాయి. ముడి సరుకుల ధరలు పెరుగుతుండటంతో మార్జిన్లపై ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో, 2027 ఆర్థిక సంవత్సరంలో అవసరాన్ని బట్టి విడతల వారీగా, క్రమాంకితంగా ధరలు పెంచనున్నట్లు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (TMPV) యాజమాన్యం వెల్లడించింది. అయితే, మొత్తం భారాన్ని వినియోగదారులపై ఒకేసారి మోపకుండా.. ధరల సవరణతో పాటు ఖర్చుల తగ్గింపు చర్యలను కొనసాగించనున్నట్లు తెలిపింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ సీఎఫ్‌వో ధీమన్ గుప్తా 2027 ఆర్థికేడాది క్యూ1 ఫలితాల సందర్భంగా మాట్లాడుతూ, ఏడాది పొడవునా మరిన్ని “క్రమాంకిత ధరల పెంపులు” చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే తదుపరి పెంపు ఎంత శాతం ఉండొచ్చు, ఎప్పుడు అమలు చేస్తారనే విషయాన్ని కంపెనీ వెల్లడించలేదు. ప్రధాన ఉద్దేశం మార్జిన్లను కాపాడుకోవడంతో పాటు కార్లకు ఉన్న కస్టమర్ విలువ ప్రతిపాదనను దెబ్బతీయకుండా చూడటమేనని యాజమాన్యం స్పష్టం చేసింది.
ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంపు
2026లో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ ఇప్పటికే రెండుసార్లు ధరలు పెంచింది. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ (ICE) కార్లపై 0.5% పెంపు అమలు చేసింది. ఆ తర్వాత జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ కార్లు, ఈవీలు సహా మొత్తం ప్యాసింజర్ వెహికల్ పోర్ట్‌ఫోలియో ధరలను 1.5% వరకు పెంచింది. జూలై పెంపు 2027 ఆర్థికేడాది క్యూ1 ఆర్థిక ఫలితాల్లో పూర్తిగా ప్రతిబింబించలేదని కంపెనీ తెలిపింది. అందువల్ల రెండో త్రైమాసికంలో ఆ పెంపు నుంచి కొంత ప్రయోజనం మార్జిన్లకు లభించే అవకాశం ఉంది.
కమోడిటీ ఖర్చులు మరింత పెరిగే అవకాశం
మరోవైపు, ముడి సరుకుల ధరలు కంపెనీకి ప్రధాన సవాలుగా మారుతున్నాయి. Q1లో కమోడిటీ సంబంధిత వ్యయ ఒత్తిడి గణనీయంగా ఉండగా, Q2లోనూ అదనపు ఖర్చు భారం ఉంటుందని యాజమాన్యం అంచనా వేసింది. ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం వంటి ఇన్‌పుట్ ధరల కదలికలు ఆటో కంపెనీల మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయి.
అమ్మకాల్లో మాత్రం జోరు
ధరల పెంపు నిర్ణయం వస్తున్న సమయంలో టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ వ్యాపారంలో డిమాండ్ మాత్రం బలంగానే ఉంది. 2027 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కంపెనీ మొత్తం 1,82,574 కార్లు, SUVలను విక్రయించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలోని 1,24,809 యూనిట్లతో పోలిస్తే 46% వృద్ధి. దేశీయ అమ్మకాలు 45% పెరిగి 1,80,166 యూనిట్లకు చేరాయి.


