విప్రో తీరుపై ఆగ్రహం.. కేంద్ర మంత్రికి అత్యవసర లేఖ! | Offer Letters in Hand, No Joining Date: Why 200 Wipro Recruits Asking Govt to Step In? | Sakshi
Sakshi News home page

విప్రో తీరుపై ఆగ్రహం.. కేంద్ర మంత్రికి అత్యవసర లేఖ!

Aug 14 2026 9:22 AM | Updated on Aug 14 2026 9:56 AM

Offer Letters in Hand, No Joining Date: Why 200 Wipro Recruits Asking Govt to Step In?

దేశీయ ఐటీ దిగ్గజం విప్రోలో ఎంపికైన 200 మందికి పైగా కొత్త ఇంజినీర్లు, విద్యార్థుల ఆన్‌బోర్డింగ్‌లో తీవ్ర జాప్యం జరుగుతోందంటూ ఐటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం ‘నైట్స్’ (NITES - Nascent Information Technology Employees Senate) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ వ్యవహారంలో తక్షణమే జోక్యం చేసుకుని బాధిత అభ్యర్థుల భవిష్యత్తుకు భరోసా కల్పించాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసింది.

విప్రో ‘ఎలైట్ హైరింగ్ 2025’ ప్రక్రియ కింద ఎంపికైన 200 మందికి పైగా అభ్యర్థులకు జులై 2025లో ఆఫర్ లెటర్లు, ఆగస్టు 2025లో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ అందాయి. మార్చి 2026లో బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసుకున్నా నేటికీ అధికారికంగా విధుల్లో చేరే తేదీ కేటాయించలేదు. కంపెనీ హెచ్‌ఆర్ బృందాలు, సహాయక కేంద్రాలను సంప్రదించినా ఎటువంటి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో అభ్యర్థులు తీవ్ర మానసిక, ఆర్థిక ఆందోళనకు గురవుతున్నారని నైట్స్ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా ఆవేదన వ్యక్తం చేశారు.

నైట్స్ ప్రధాన డిమాండ్లు

బాధిత అభ్యర్థుల ఆన్‌బోర్డింగ్‌కు సంబంధించి సమయ పరిమితితో కూడిన స్పష్టమైన ప్రణాళికను విప్రో ప్రకటించాలి. ఆఫర్ లెటర్లు, ఎల్‌ఓఐల చెల్లుబాటుపై అధికారిక ప్రకటన వెలువడాలి. ఒకవేళ ఎంపికను రద్దు చేసుకోవాలనుకుంటే ఆ విషయాన్ని అభ్యర్థులకు రాతపూర్వకంగా స్పష్టం చేయాలి.

క్యాంపస్ ఎంపికల్లో విప్రో ఉద్యోగం వచ్చిందనే ధీమాతో చాలామంది ఇతర కంపెనీల అవకాశాలను వదులుకున్నారని, ప్రస్తుత జాప్యం వారి కెరీర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఐటీ సంఘాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగాన్ని వేధిస్తున్న అనిశ్చితి, క్లయింట్ ప్రాజెక్టుల మందగమనమే ఈ పరిస్థితికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ అంశంపై విప్రో యాజమాన్యం స్పందించాల్సి ఉంది.

ఇదీ చదవండి: ఇకపై రోడ్డుపై పార్కింగ్ చేస్తే జేబుకు చిల్లే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement