కార్పొరేట్ ఉద్యోగంలో ఎంత ఎక్కువ ప్యాకేజీ ఉన్నా.. ఉద్యోగ భద్రత లేని చోట మానసిక ప్రశాంతత కరువే. ఈ విషయాన్ని గ్రహించిన ఒక ఐటీ నిపుణుడు 42 ఏళ్ల వయసులో ఊహించని ధైర్యం చేశారు. ఏకంగా రూ.18 లక్షల వార్షిక ప్యాకేజీ ఉన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని వదిలేసి సేంద్రీయ డెయిరీ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం నెలకు రూ.1.5 లక్షల నికర లాభాన్ని అర్జిస్తూ ఆంత్రప్రెన్యూర్లకు ప్రేరణగా నిలుస్తున్నారు.
మార్కెట్ అనిశ్చితి నుంచి స్వయం సమృద్ధి వైపు..
ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బీటెక్ పూర్తి చేసిన ఓ పారిశ్రామికవేత్త ప్రయాణాన్ని @VikasAlwys అనే ఎక్స్ హ్యాండిల్ ఇటీవల వెలుగులోకి తెచ్చింది. అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, పెరిగిన మార్కెట్ అనిశ్చితి, ప్రాజెక్టుల కొరత కారణంగా ఐటీ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళన మొదలైంది. రోజూ ఆందోళనతో గడిపే కంటే సొంతంగా ఏదైనా నిర్మించాలని ఆయన నిశ్చయించుకున్నారు.
ఆర్థిక స్వేచ్ఛే ప్రధాన బలం
ఈ సాహసోపేతమైన నిర్ణయానికి అతనికి ఉన్న ప్రధాన ప్లస్ పాయింట్.. ఏ విధమైన అప్పులు లేకపోవడం. ఈఎంఐలు, రుణ బాధ్యతలు లేకపోవడం, తగినంత పొదుపు ఉండటంతో రిస్క్ తీసుకోవడానికి వెనుకాడలేదు. తన డెయిరీ ఫామ్‌లో కేవలం పాలు మాత్రమే కాకుండా, నాణ్యమైన దేశీ నెయ్యి, స్వచ్ఛమైన పెరుగు, పన్నీర్ వంటి విలువ ఆధారిత సేంద్రీయ ఉత్పత్తులపై దృష్టి సారించారు. దాంతో అన్ని ఖర్చులుపోను నెలవారీ నికర లాభం రూ.1.5 లక్షలుగా ఉంది.
సోషల్ మీడియాలో స్పందన
ఈ కథనం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. ‘ఒకే ఆదాయ వనరుపై ఆధారపడకుండా సరైన సమయంలో ఆస్తులను నిర్మించుకోవడానికి ఇదొక ఉత్తమ ఉదాహరణ’ అని ఒక వినియోగదారుడు తెలిపాడు. ‘నిజమైన పారిశ్రామికవేత్తలు రిస్క్ తీసుకుంటారు. పరిస్థితులకు అనుగుణంగా మారతారు. ఆర్థిక అనిశ్చితినే అవకాశంగా మలుచుకోవడంలోనే స్వావలంబన దాగి ఉంది’ అని మరొకరు ప్రశంసించారు.
ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం


