భారతీయ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం ఒక చారిత్రక పరిణామానికి వేదికవుతోంది. దశాబ్దాలుగా ఐటీ దిగ్గజాల వ్యాపార వ్యూహంలో కీలక పాత్ర పోషించిన ‘బెంచ్ స్ట్రెంత్’ (క్రియాశీల ప్రాజెక్టులు లేని ఉద్యోగుల సంఖ్య) సంస్కృతికి స్వస్తి పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణ, కచ్చితమైన శ్రామిక శక్తి ప్రణాళిక, డిమాండ్-ఆధారిత నియామకాల కారణంగా రాబోయే రోజుల్లో ఐటీ సంస్థలు చాలా తక్కువ బెంచ్ కల్చర్‌తో పనిచేయనున్నాయి.
బెంచ్ కల్చర్ తగ్గేందుకు కారణాలు
గతంలో ఐటీ కంపెనీలు కొత్త ప్రాజెక్టులు రాగానే తక్షణమే కేటాయించేందుకు 20-30% వరకు బెంచ్ స్ట్రెంత్‌ను నిర్వహించేవి. అయితే, గత మూడేళ్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో, టెక్ మహీంద్రా వంటి అగ్రశ్రేణి సంస్థల్లో ఇది సింగిల్ డిజిట్‌కు లేదా గరిష్టంగా 12 శాతానికి పడిపోయింది. 2027 ఆర్థిక సంవత్సరం (FY27) నాటికి ఇది 8-10 శాతానికి పరిమితం కానుందని ప్రముఖ స్టాఫింగ్ సంస్థ టీమ్ లీజ్ డిజిటల్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
గతంలో బెంచ్ సమయం 45-60 రోజులుగా ఉండగా ప్రస్తుతం అది 30-45 రోజులకు తగ్గింది.
కంపెనీలు తమ హెడ్ కౌంట్ పై నియంత్రణ సాధిస్తూ ఉద్యోగుల వినియోగ సామర్థ్యాన్ని గరిష్ట స్థాయికి చేర్చుతున్నాయి.
క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్, ఏఐ స్పెషలైజ్డ్ నైపుణ్యాల ఆధారంగానే నియామకాలు జరుగుతున్నాయి.
ఐటీ ఉద్యోగులపై లేఆఫ్‌ల ప్రభావం ఉందా?
బెంచ్ స్ట్రెంత్ తగ్గడం అంటే భారీ తొలగింపులు అని భావించాల్సిన అవసరం లేదని పరిశ్రమ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొవిడ్ అనంతర కాలంలో తీసుకున్న అదనపు సామర్థ్యాన్ని ఐటీ సంస్థలు ఇప్పటికే సర్దుబాటు చేశాయి. ‘ఇది కేవలం ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం కాదు.. శ్రామిక శక్తిని పునర్నిర్మించడం. ఉద్యోగులను కొత్త ప్రాజెక్టులకు అనుగుణంగా మార్చేందుకు రీస్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్‌లలో కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి’ అని టీమ్ లీజ్ డిజిటల్ సీఈఓ నీతి శర్మ చెప్పారు.
మారుతున్న నియామకాల వ్యూహం
తక్కువ బెంచ్ స్ట్రెంత్ ఉన్నా నియామకాలు పూర్తిగా ఆగిపోలేదు. అయితే, మాస్ రిక్రూట్‌మెంట్ స్థానంలో ‘స్పెషలిస్ట్ రిక్రూట్‌మెంట్’ వచ్చి చేరింది. టీసీఎస్ అనుభవపూర్వక, ప్రాజెక్ట్-ఆధారిత విభాగంలో రిక్రూట్‌మెంట్ చేస్తుంది. ఇన్ఫీ రాబోయే కాలంలో 6,000 మంది ఫ్రెష్ ఫ్రంటియర్ ఇంజినీర్లను నియమించుకోనుంది. హెచ్‌సీఎల్ టెక్ స్పెషలిస్ట్ ఫ్రెషర్లపై దృష్టి సారిస్తోంది. టెక్ మహీంద్రా ఫ్రెషర్ రిక్రూట్‌మెంట్‌ను తిరిగి ప్రారంభించనుంది.
ఇదీ చదవండి: మెరుపు తగ్గిన మేలిమి బంగారం


