భారత ఐటీ రంగంలో ఇన్ఫోసిస్ భవిష్యత్తు కీలక మలుపు వద్ద ఉందని ప్రస్తుత ఎండీ, సీఈఓ సలీల్ పరేఖ్ అన్నారు. ఆయన పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ఇన్ఫోసిస్‌ను గతంలో కంటే మరింత మెరుగైన, దృఢమైన స్థానంలో నిలిపి వెళ్తున్నానని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవల రంగంలో రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్ ప్రపంచస్థాయిలో తిరుగులేని విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
సలీల్ పరేఖ్ నాయకత్వంలో ఇన్ఫోసిస్ కేవలం సాంప్రదాయ ఐటీ సేవలకు పరిమితం కాకుండా గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ దిశగా వేగంగా రూపాంతరం చెందింది. ప్రపంచ వ్యాప్తంగా ఐటీ పరిశ్రమ మందగమనం, భౌగోళిక రాజకీయ సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఇన్ఫోసిస్ బిలియన్ డాలర్ల భారీ ఒప్పందాలను దక్కించుకోవడంలో విజయం సాధించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్ ప్రధాన క్లయింట్లలో దాదాపు 90 శాతానికి పైగా సంస్థలు ఏఐ సాంకేతికత ఆధారిత పరిష్కారాలను వినియోగిస్తుండటం, పరేఖ్ చేపట్టిన వ్యూహాత్మక మార్పుల సామర్థ్యానికి అద్దం పడుతోంది.
ఇంజినీరింగ్, లెగసీ మోడర్నైజేషన్, డేటా, ప్రాసెస్ ఆటోమేషన్ వంటి కీలక రంగాల్లో ఏఐ ఆధారిత సేవల ద్వారా సుమారు 300 బిలియన్ డాలర్ల గ్లోబల్ మార్కెట్ అవకాశాన్ని అందుకునేందుకు కంపెనీ సన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. 35 ఏళ్ల క్రితం ఐటీ రంగాన్ని ఊపేసిన ఆఫ్‌షోరింగ్ మోడల్ తర్వాత ఏఐ ప్రవేశంతో వస్తున్న ఈ ఆపరేటింగ్ మోడల్ మార్పు అతిపెద్ద సాంకేతిక విప్లవమని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు


