ముంబై: దేశీయంగా ప్రస్తుత సంవత్సరం ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో పసిడికి డిమాండ్ 6 శాతం మేర క్షీణించింది. 131.4 టన్నులకు పరిమితమైంది. సీజనల్‌గా విక్రయాలు తగ్గడం, కస్టమ్స్ డ్యూటీ పెరగడంతో పాటు పసిడి కొనుగోళ్లను తగ్గించుకోవాలంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను సూచించడంలాంటి అంశాలు ఇందుకు కారణమయ్యాయి. ’గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ పేరిట రూపొందించిన నివేదికలో వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం గతేడాది ఇదే వ్యవధిలో పసిడికి డిమాండ్ 139.7 టన్నులుగా నమోదైంది.
పసిడికి పరిమాణంపరంగా డిమాండ్ నెమ్మదించినప్పటికీ విలువ మాత్రం రికార్డు స్థాయికి పెరిగినట్లు డబ్ల్యూజీసీ రీజినల్ సీఈవో (ఇండియా) సచిన్ జైన్ తెలిపారు. ‘2025 రెండో త్రైమాసికంలో వినియోగం విలువ రూ. 1,32,500 కోట్లుగా ఉండగా ఈసారి రూ. 1,98,100 కోట్లకు చేరింది. గతేడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే దాదాపు 50 శాతం పెరిగింది.
ధర ఎక్కువగా ఉన్నప్పటికీ పసిడి కొనుగోళ్లపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారనడానికి ఇది నిదర్శనం‘ అని ఆయన పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏడాది మొత్తం మీద డిమాండ్ 650–750 టన్నులుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు. అయితే, ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులు, వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం మొదలైన వాటిని పరిగణనలోకి తీసుకుంటే ఈ శ్రేణిలో మధ్య స్థాయికి కూడా పరిమితం కావొచ్చన్నారు. బంగారం ధరలు మరింత కరెక్షన్‌కి లోనయ్యి, కస్టమ్స్ డ్యూటీ తగ్గిస్తే డిమాండ్ గరిష్ట స్థాయిలో ఉండొచ్చని వివరించారు.
స్మగ్లింగ్ రిస్క్ లు..
సుంకాల పెంపుతో బ్లాక్ మార్కెటింగ్ పెరిగిందని జైన్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమ మార్గాల్లో ఇప్పటికే మార్కెట్లోకి బంగారం ప్రవేశిస్తోందని చెప్పారు. స్మగ్లింగ్, అక్రమ మార్గాల్లో మార్కెట్లలోకి పసిడి వెల్లువెత్తుతుండటమనేది పరిశ్రమకు అతి పెద్ద రిస్క్ అని జైన్ చెప్పారు. ‘ప్రస్తుత ట్రెండ్స్ చూస్తే బంగారానికి సంప్రదాయ కోణంలోనే కాకుండా ఆర్థిక అనిశ్చితిలో అక్కరకొచ్చే వ్యూహాత్మక పెట్టుబడి సాధనం కూడా అనే కోణంలోనూ డిమాండ్ ఏర్పడుతోందని తెలుస్తోంది. ద్వితీయార్థంలో పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌తో మరింత డిమాండ్ పెరగొచ్చు‘ అని జైన్ పేర్కొన్నారు.
నివేదికలో మరిన్ని విశేషాలు..
→ త్రైమాసికంలో మొత్తం జ్యుయలరీ డిమాండ్ 88.8 టన్నుల నుంచి 15% తగ్గి 75.1 టన్నులకు నెమ్మదించింది. ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా కడ్డీలు, నాణేలకు డిమాండ్ 9% పెరిగి 50.3 టన్నులకు చేరింది. ఇక అంతర్జాతీయంగా పెట్టుబడుల ఉపసంహరణ జరిగినప్పటికీ, మన గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నికరంగా 4.2 టన్నుల పెట్టుబడులొచ్చాయి.
→ క్యూ1లో రీసైకిల్ చేసిన మొత్తం పసిడి పరిమాణం 23.1 టన్నుల నుంచి 17% క్షీణించి 19.2 టన్నులకు తగ్గింది.
→ దిగుమతులు 23% క్షీణించి 127.4 టన్నుల నుంచి 98.1 టన్నులకు తగ్గాయి.
→ పసిడి ఔన్సు ధర సగటున 4,506 డాలర్లుగా ఉంది. 2025లో ఇదే వ్యవధిలో రేటు 3,280 డాలర్లుగా నమోదైంది.


