బిజినెస్ ఏఐ సేవలతోనే వేల కోట్ల ఆదాయం | Mark Zuckerberg AI Gamble How Meta Targeting Enterprise Cloud B2B Tech | Sakshi
Sakshi News home page

బిజినెస్ ఏఐ సేవలతోనే వేల కోట్ల ఆదాయం

Jul 30 2026 8:37 AM | Updated on Jul 30 2026 9:47 AM

Mark Zuckerberg AI Gamble How Meta Targeting Enterprise Cloud B2B Tech

కార్పొరేట్ వ్యాపారాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను విక్రయించడంలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, ఇదే రాబోయే రోజుల్లో తమ సంస్థకు ప్రధాన ఆదాయ వనరుగా మారనుందని మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల వెల్లడి సందర్భంగా ఆయన టెక్ రంగాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ప్రధానంగా ప్రకటనల ఆదాయంపైనే ఆధారపడిన మెటా ఇప్పుడు ఎంటర్ ప్రైజ్‌ ఏఐ మార్కెట్‌లోకి వేగంగా దూసుకెళ్లేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తోంది.

జుకర్ బర్గ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. వ్యాపార సంస్థల కోసం ప్రత్యేకంగా రూపొందించే ఏఐ బిజినెస్ ఏజెంట్లు, ఏపీఐల ద్వారా టెక్ సేవలు అందించడం, తమ అధునాతన డేటా సెంటర్లలోని అదనపు కంప్యూటింగ్ సామర్థ్యాన్ని నేరుగా విక్రయించడం వంటి మూడు ప్రధాన మార్గాల్లో బిజినెస్-టు-బిజినెస్ విభాగాన్ని విస్తరిస్తున్నారు. ఇప్పటికే వాట్సాప్, మెసెంజర్ ప్లాట్‌ఫారమ్‌లలో 10 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు మెటా ఏఐ ఏజెంట్లను కస్టమర్ సర్వీస్, విక్రయాల కోసం ఉపయోగిస్తున్నాయని, త్వరలోనే ఈ సదుపాయాన్ని ఇన్ స్టాగ్రామ్‌కు కూడా వర్తింపజేస్తున్నామని ఆయన తెలిపారు.

మరోవైపు, ఏఐ మౌలిక వసతుల కల్పనకు మెటా భారీగా ఖర్చు చేస్తోంది. 2026 నాటికి తమ మూలధన వ్యయం అంచనాలను 130 బిలియన్ డాలర్ల నుంచి 145 బిలియన్ డాలర్లకు పెంచినట్లు కంపెనీ ప్రకటించింది. బిలియన్ల కొద్దీ వినియోగదారులకు పర్సనల్ ఏఐ అసిస్టెంట్లను అందించడంతో పాటు పరిశ్రమల అవసరాలకు తగ్గట్లుగా క్లౌడ్ మౌలిక వసతులను కల్పించడమే తమ లక్ష్యమని జుకర్ బర్గ్ చెప్పారు. అమెజాన్ ఏడబ్ల్యూఎస్‌, మైక్రోసాఫ్ట్ అజూర్ వంటి దిగ్గజాలకు పోటీగా మెటా సొంత క్లౌడ్ సేవలను విస్తరించే ఆలోచనలో ఉంది.

ఈ త్రైమాసికంలో మెటా ఆదాయం 28 శాతం పెరిగి 60.8 బిలియన్ డాలర్లకు చేరినప్పటికీ ఏఐ పరిశోధనలు, సూపర్ కంప్యూటింగ్ మౌలిక వసతులకై చేసిన వ్యయం గణనీయంగా పెరిగింది. స్వల్పకాలిక లాభాల కంటే భవిష్యత్తు సాంకేతిక ఆధిపత్యమే ముఖ్యమని విశ్వసిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సాంకేతిక రంగాన్ని నడిపించే తదుపరి ప్రధాన శక్తి వ్యాపార స్థాయి ఏఐ సాధనాలేనని మెటా ప్రతిపాదనలు స్పష్టం చేస్తున్నాయి.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement