ట్రంప్‌ విమాన ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌ వార్నింగ్‌పై కొత్త డౌట్‌? | Israel Unverified Iran Warning Prompted Trump Secret Jet Switch: US Media Reports | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ విమాన ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్‌.. ఇజ్రాయెల్‌ వార్నింగ్‌పై కొత్త డౌట్‌?

Aug 13 2026 1:47 PM | Updated on Aug 13 2026 1:50 PM

Israel Unverified Iran Warning Behind Trump Jet Switch

వాషిం‍గ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టర్కీ నుంచి తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్న వేళ ఇజ్రాయెల్‌ ఇచ్చిన ఓ కీలక హెచ్చరిక అమెరికా భద్రతా వ్యవస్థను అప్రమత్తం చేసినట్లు అమెరికా మీడియా కథనాలు వెల్లడించాయి. ఇరాన్‌ నుంచి ట్రంప్‌ ప్రయాణిస్తున్న విమానంపై క్షిపణి దాడి జరిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్‌ అమెరికా అధికారులను హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో ట్రంప్‌ను అసలు విమానం నుంచి రహస్యంగా దించి.. మరో చిన్న మిలిటరీ జెట్‌లోకి తరలించారు. అయితే, ఇజ్రాయెల్‌ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై కొత్త చర్చ ప్రారంభమైంది.

టర్కీలో జరిగిన నాటో సదస్సు ముగిసిన తర్వాత ట్రంప్‌ తొలుత ఎయిర్‌ఫోర్స్‌ వన్‌గా భావించిన విమానంలోకి ఎక్కారు. అదే విమానంలో విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌, వైట్‌హౌస్‌ సిబ్బంది, మీడియా ప్రతినిధులు కూడా ఉన్నారు. అయితే ఇజ్రాయెల్‌ నుంచి వచ్చిన హెచ్చరిక నేపథ్యంలో సీక్రెట్‌ సర్వీస్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ట్రంప్‌ను ఎవరికీ తెలియకుండా మరో చిన్న సైనిక విమానంలోకి మార్చినట్లు ది వాషింగ్టన్‌ పోస్ట్‌, NPR వంటి అమెరికా మీడియా సంస్థలు వెల్లడించాయి. ఇందుకోసం క్యాటరింగ్‌ వాహనాన్ని ఉపయోగించినట్లు సమాచారం. దీంతో మీడియా, కొంతమంది వైట్‌హౌస్‌ సిబ్బందికి తెలియకుండానే ట్రంప్‌ మరో విమానంలో అమెరికా బయలుదేరారు.

అయితే ఇజ్రాయెల్‌ ఇచ్చిన హెచ్చరికపై అమెరికా నిఘా వర్గాల్లోనే అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమాచారం ఒక్క వర్గం నుంచే వచ్చిందని, దానికి బలమైన ఆధారాలు లేవని కొందరు అమెరికా అధికారులు భావించినట్లు కథనాలు చెబుతున్నాయి. CIA విశ్లేషకులు కూడా ఈ సమాచారాన్ని అధిక విశ్వసనీయత కలిగినదిగా పరిగణించలేదని సమాచారం. టర్కీ భద్రతా సంస్థలు కూడా ఈ అంశాన్ని పరిశీలించినప్పటికీ.. అంకారాలో ట్రంప్‌ను హత్య చేసేందుకు నిర్దిష్టమైన కుట్ర ఉన్నట్లు గుర్తించలేదని అమెరికా మీడియా పేర్కొంది. అయినప్పటికీ, ట్రంప్‌పై గతంలో జరిగిన హత్యాయత్నాలను దృష్టిలో పెట్టుకుని సీక్రెట్‌ సర్వీస్‌ ఎలాంటి రిస్క్‌ తీసుకోలేదని తెలుస్తోంది.

మరోవైపు ట్రంప్‌ రహస్యంగా విమానం మార్చినా.. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, ట్రెజరీ సెక్రటరీ స్కాట్‌ బెసెంట్‌ మాత్రం మొదటి విమానంలోనే కొనసాగారు. ట్రంప్‌ విమానం మార్చిన విషయం రూబియోకు తెలుసని ఓ అమెరికా అధికారి వెల్లడించారు. ఇక ఈ ఘటన ఇజ్రాయెల్‌ నిఘా సమాచారంపై కూడా చర్చకు దారితీసింది. ముప్పుపై అమెరికా నిఘా వర్గాలకు సందేహాలు ఉన్నప్పటికీ.. ఇజ్రాయెల్‌ హెచ్చరికను సీరియస్‌గా తీసుకుని ట్రంప్‌ ప్రయాణాన్నే మార్చడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అసలు ఇరాన్‌ నుంచి నిజమైన ముప్పు ఉందా? లేక ముందుజాగ్రత్త చర్యగానే ఈ రహస్య ఆపరేషన్‌ చేపట్టారా? అన్నది ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement