పశ్చిమాసియా సంక్షోభంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ.. హర్ముజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ఈ సముద్ర మార్గంపై పూర్తి నియంత్రణ అమెరికాదేనని.. ఇక మీదట దానిని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని, ఇరాన్ దీనిని ఎదుర్కొనే పరిస్థితిలో లేదని వ్యాఖ్యానించారు. అమెరికా నౌకాదళ దిగ్బంధాన్ని ‘‘ఉక్కు గోడ’’గా అభివర్ణించారు. అయితే తన పోస్ట్ చివర్లో ‘అల్లాహ్‌కు స్తుతి’ అంటూ ట్రంప్ ముగించారు. సాధారణంగా ఇస్లామిక్ సందర్భాల్లో వినిపించే ఈ పదబంధాన్ని ట్రంప్ ఇరాన్ అంశాన్ని ప్రస్తావిస్తూ వ్యంగ్య ధోరణిలో ఉపయోగించినట్లు భావిస్తున్నారు.
వీక్ ఇరాన్!
ఇరాన్‌కు నౌకాదళం, వైమానిక దళం బలహీనంగా ఉన్నాయని ట్రంప్ అంటున్నారు. ఇరాన్ సైనికులకు జీతాలు కూడా అందడం లేదని వ్యాఖ్యానించారు. ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) తీవ్రంగా దెబ్బతిన్నదని, వెనక్కి తగ్గుతోందని పేర్కొన్నారు.
తగ్గమంటున్న ఇరాన్
ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ కొట్టిపారేసింది. హార్ముజ్ జలసంధిపై అమెరికా పూర్తి నియంత్రణ సాధించిందన్న వాదన వాస్తవాన్ని మార్చలేదని పేర్కొంది. హార్ముజ్ ఇంకా మూసివేసే ఉందని, ఇరాన్ పెట్టిన షరతులు అంగీకరించే వరకు దానిని తిరిగి తెరవబోమని పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ (PGSA) స్పష్టం చేసింది. అమెరికా అధికారులు పదేపదే చేస్తున్న ప్రకటనలు పరిస్థితిని మార్చలేవని వెల్లడించింది. అమెరికా నౌకాదళ దిగ్బంధం ఎత్తివేయడం, తమ ఆస్తులపై ఆంక్షలు తొలగించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం వంటి డిమాండ్లను ఇరాన్ ముందుకు తెస్తోంది. ఈ షరతులు నెరవేరే వరకు జలసంధి విషయంలో వెనక్కి తగ్గబోమని చెబుతోంది.
ప్రపంచ ఇంధన మార్కెట్లపై ప్రభావం
ప్రపంచ చమురు సరఫరాలో హార్ముజ్ జలసంధి అత్యంత కీలకమైన మార్గం. ఇక్కడ నెలకొన్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. నౌకల రాకపోకలు తగ్గడం, భద్రతా భయాలు పెరగడంతో చమురు ధరలు, రవాణా వ్యయాలపై ప్రభావం కనిపిస్తోంది.
చర్చలపై ట్రంప్ వ్యూహం
ఇరాన్‌తో చర్చల విషయంలో ట్రంప్ భిన్నమైన వైఖరి ప్రదర్శిస్తున్నారు. తాము తక్కువ స్థాయిలో చర్చలు జరుపుతున్నామని, ఇది ఒక చెస్ ఆటలా ఉందని వ్యాఖ్యానించారు. ఇరాన్ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉందని, ద్రవ్యోల్బణం పెరిగిందని పేర్కొన్నారు. అయితే ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ మాత్రం అమెరికాతో నేరుగా చర్చలు జరగడం లేదని, మధ్యవర్తుల ద్వారా కేవలం సందేశాల మార్పిడి మాత్రమే జరుగుతోందని తెలిపారు.


