మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ మరో కీలక అంతర్జాతీయ బాధ్యతను చేపట్టారు. రష్యా–ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న న్యాయ వివాదంలో రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా ఆయన నియమితులైనట్లు సమాచారం. ప్రభుత్వ బ్యాంకు ఓష్చాడ్‌బ్యాంక్ (Oschadbank) దాఖలు చేసిన పెట్టుబడి వివాదానికి సంబంధించిన కేసులో ఈ నియామకం జరిగింది.
ఈ వివాదం 1998 రష్యా–ఉక్రెయిన్ ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (BIT) కింద విచారణకు వస్తోంది. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా బ్యాంకు ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలకు జరిగిన నష్టమే ఈ కేసుకు కేంద్రంగా ఉంది. ఈ మేరకు గ్లోబల్ ఆర్బిట్రేషన్ రివ్యూ (Global Arbitration Review) నివేదికను ఉటంకిస్తూ బార్ అండ్ బెంచ్ ఓ కథనం ఇచ్చింది.
భారీ నష్టం అంటూ బ్యాంకు క్లెయిమ్
ఉక్రెయిన్ ప్రభుత్వ ఆధీనంలోని ఓష్చాడ్‌బ్యాంక్.. డొనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సాన్, జపోరిజ్జియా ప్రాంతాల్లోని తన ఆస్తులు, వ్యాపార కార్యకలాపాలను రష్యా సైనిక చర్యల కారణంగా కోల్పోయినట్లు పేర్కొంటోంది. 2022లో రష్యా పూర్తి స్థాయి సైనిక దాడి ప్రారంభించిన తర్వాత ఈ నష్టం జరిగిందని బ్యాంకు వాదిస్తోంది. ఈ నేపథ్యంలో పరిహారం కోరుతూ అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌ను ఆశ్రయించింది. బ్యాంకు చేసిన క్లెయిమ్ విలువ వందల మిలియన్ డాలర్ల స్థాయిలో ఉన్నట్లు సమాచారం.
2025 జూలైలో ఓష్చాడ్‌బ్యాంక్ రష్యాకు వివాదానికి సంబంధించిన నోటీసు పంపినప్పటికీ.. రష్యా స్పందించకపోవడంతో ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైనట్లు నివేదికలు చెబుతున్నాయి.
ముగ్గురు సభ్యులతో ట్రిబ్యునల్
ఈ కేసును ముగ్గురు సభ్యులతో కూడిన ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్ విచారించనుంది. కోస్టారికా మాజీ వాణిజ్య మంత్రి, ఆర్బిట్రేటర్ డయాలా జిమెనెజ్‌ను రష్యా, ఓష్చాడ్‌బ్యాంక్ సంయుక్తంగా ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా ఎంపిక చేశాయి. మరో సభ్యుడిగా ఓష్చాడ్‌బ్యాంక్ తరఫున గ్రీస్‌కు చెందిన ఆర్బిట్రేటర్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ప్రొఫెసర్ స్టావ్రోస్ బ్రెకౌలాకిస్‌ను ఎంపిక చేశారు. రష్యా తరఫున మూడో సభ్యుడిగా మాజీ సీజేఐ చంద్రచూడ్‌ను నియమించింది.
అప్పట్లో తిరస్కరణ
చంద్రచూడ్‌కు రష్యా తరఫున అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ వ్యవహారాల్లో ఇది తొలి పరిచయం కాదని నివేదికలు చెబుతున్నాయి. గతంలో వింటర్‌షాల్ డియా అనే చమురు, గ్యాస్ సంస్థకు సంబంధించిన వివాదం, అలాగే ఉక్రెయిన్ ప్రభుత్వ విద్యుత్ ప్రసార సంస్థ ఉక్రెనెర్గోకు సంబంధించిన ఒప్పంద వివాదాల్లో రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా వ్యవహరించాలంటూ ఆయనను సంప్రదించినట్లు సమాచారం. అయితే ఆ ప్రతిపాదనలను చంద్రచూడ్ గతంలో తిరస్కరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
ఇక ఆ సమయంలో పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ (PCA) ఆయనను వింటర్‌షాల్ కేసులో నియామక అధికారిగా ఎంపిక చేసిన రోజే రష్యా నుంచి ఈ సంప్రదింపులు వచ్చినట్లు సమాచారం. ఆ విషయాన్ని వెల్లడించిన అనంతరం చంద్రచూడ్ ఆ బాధ్యత నుంచి తప్పుకున్నట్లు నివేదికలు తెలిపాయి.
యుద్ధం.. లీగల్‌వార్.. ఇప్పుడు చంద్రచూడ్
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం సైనిక రంగానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానాలు, పెట్టుబడి వివాదాల వరకు విస్తరించింది. యుద్ధం కారణంగా ఆస్తులు, వ్యాపారాలు, పెట్టుబడులకు జరిగిన నష్టాలపై ఇరు దేశాలకు చెందిన సంస్థలు అంతర్జాతీయ వేదికలను ఆశ్రయిస్తున్నాయి. అలాంటి కీలక వివాదంలో మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ రష్యా తరఫున ఆర్బిట్రేటర్‌గా నియమితులు కావడం ఇప్పుడు అంతర్జాతీయ న్యాయవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


