అమిత్‌ షా బండారం బయటపడింది: రాహుల్‌ గాంధీ | Amit Shah Bluff Exposed: Rahul Gandhi Launches Fresh Attack | Sakshi
Sakshi News home page

అమిత్‌ షా బండారం బయటపడింది: రాహుల్‌ గాంధీ

Aug 12 2026 12:36 PM | Updated on Aug 12 2026 12:43 PM

Amit Shah Bluff Exposed: Rahul Gandhi Launches Fresh Attack

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో నీట్‌ నిరసనల అంశంపై కేంద్ర ప్రభుత్వం, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా చర్చకు సిద్ధమని ప్రకటించిన నేపథ్యంలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ విపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు. అమిత్‌ షా వ్యాఖ్యలపై కౌంటర్‌ ఇస్తూ.. ఆయన సభకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

“అమిత్‌ షా బండారం బయటపడింది. ఆయన సభకు ఎందుకు రావడం లేదు? సభకు రావడానికి ఆయన భయపడుతున్నారా?” అంటూ రాహుల్‌ గాంధీ విమర్శించారు. నీట్‌ నిరసనల్లో విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలు, ఆందోళనకారులపై జరిగిన దాడులపై హోంమంత్రి సమాధానం చెప్పాల్సిందేనని అన్నారు.

విద్యార్థులపై దాడులకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఆందోళనకారులపై కాల్పులకు ఆదేశించింది ఎవరు? పోలీసుల కర్కశ చర్యలపై అమిత్‌ షా నోరు విప్పాలని రాహుల్‌ గాంధీ ప్రశ్నించారు. ఈ ఘటనలకు బాధ్యత హోంమంత్రిదేనని ఆరోపించారు.

రాజీనామాకు డిమాండ్‌
నిరసనల సమయంలో కాల్పులకు ఆదేశాలు ఇచ్చి ఉంటే అమిత్‌ షా రాజీనామా చేయాలని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. అమిత్‌ షా ఏం మాట్లాడతారన్నది తమకు అవసరం లేదని, బాధ్యత వహిస్తూ పదవి నుంచి తప్పుకోవాల్సిందేనని స్పష్టం చేశారు.

“చర్చకు సిద్ధం”: షా
మరోవైపు, విపక్షాల ఆరోపణలపై అమిత్‌ షా స్పందిస్తూ.. నీట్‌ అంశంతో పాటు విపక్షాలు లేవనెత్తే అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. చర్చకు రావాలని, సభా కార్యకలాపాలను అడ్డుకోవద్దని కోరారు. విపక్షాలు చర్చకు రాకుండా కేవలం ఆందోళనలు చేస్తున్నాయని అమిత్‌ షా ఆరోపించారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని, చర్చకు వస్తారా? లేదంటే ఆందోళనలు కొనసాగిస్తారా? అనేది విపక్షాలు తేల్చుకోవాలని అన్నారు.

నీట్‌ నిరసనల అంశంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు ప్రయత్నిస్తుండగా.. ప్రభుత్వం మాత్రం చర్చకు సిద్ధమంటూ చెబుతోంది. దీంతో పార్లమెంట్‌లో అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ వేడి మరింత పెరిగింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement