జస్ట్‌ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్‌ చేస్తే...! | HCL co-founder shares how 6 men Rs 2 lakh and a dream changed India tech story | Sakshi
Sakshi News home page

జస్ట్‌ రూ. 1.87 లక్షలు, ఆరుగురు యువకులు కట్‌ చేస్తే...!

Aug 12 2026 12:08 PM | Updated on Aug 12 2026 1:03 PM

HCL co-founder shares how 6 men Rs 2 lakh and a dream changed India tech story

ప్రముఖ ఐటీ సేవల సంస్థ హిందూస్థాన్ కంప్యూటర్స్ లిమిటెడ్ ( HCL Tech) ఐదు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అజయ్ చౌదరి 1976 నాటి ప్రారంభ రోజులను గుర్తు చేసుకుంటూ ఎక్స్‌ వేదికగా   పంచుకున్న విషయాలు నెట్టింట విశేషంగా మారాయి.

భారతదేశంలో ఆధునిక కంప్యూటింగ్ విప్లవానికి ఇది ఒక పునాదిగా, ఒక సాహసోపేత నిర్ణయంగా  నిలిచిన సంస్థ  ఆవిర్బావం  నాటి  1976 నాటి రోజులను  అజయ్‌ చౌదరి గుర్తు చేసుకున్నారు. చేస్తున్న ఉద్యోగాలు వదిలేసి, చివరికి కారు కూడా విక్రయించి, 1976 ఆగస్టు 11న శివ్ నాడార్‌, మరో ఐదుగురు భాగస్వాములు కలిసి ఢిల్లీలో ఒక చిన్న గ్యారేజ్ స్టార్టప్‌గా ప్రారంభించిన వైనాన్ని ఆయన వివరించారు. 

దేశంలో కంప్యూటర్ల భావన ఇంకా కొత్తగా ఉన్న సమయంలో, ఆరుగురు రూ. 1.87 లక్షలు పోగుచేసి, ఢిల్లీలో ఒక చిన్న కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, ఒక భారతీయ కంప్యూటర్‌ను నిర్మించడానికి ఎలా ప్రయత్నించారో ఆయన సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు.

స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్స్ లేని ఆ రోజుల్లో శివ్ నాడార్, అర్జున్ మల్హోత్రా, యోగేష్ వైద్య, సుభాష్ అరోరా, DS పురి, అజయ్ చౌదరి అనే ఆరుగురు యువకులు తమ ఉద్యోగాలను వదిలి HCL‌ను ప్రారంభించారు. తమ పొదుపు మొత్తం, అప్పులు, చివరికి ఒక కారు కూడా అమ్మి రూ. 1.87 లక్షల పెట్టుబడిని సమకూర్చుకున్నారు. ఢిల్లీలోని గోల్ఫ్ లింక్స్‌లో ఒక చిన్న రూఫ్‌టాప్ (బర్సాతీ) ఆఫీస్‌లో 'మైక్రోకాంప్' పేరుతో ప్రయాణం మొదలైంది.

అయితే  అమ్మకాలు ప్రారంభించడానికి అన్నీ సిద్ధమయ్యే వరకు వేచి ఉండలేదు. ఇంకా రూపకల్పన దశలో ఉన్న కంప్యూటర్‌ను అమ్మడం ప్రారంభించామని చౌదరి గుర్తుచేసుకున్నారు. తమ వద్ద ఒక బ్రోచర్ ,ఆ యంత్రం నమూనానాల తోనే  సేల్స్ బృందాలు దేశవ్యాప్తంగా పర్యటించి, అంతకుముందు చాలామంది ఎన్నడూ ఉపయోగించని ఒక సాంకేతికతలో పెట్టుబడి పెట్టేలా వ్యాపార సంస్థలను ఒప్పించాయి. మొదటి ఆర్డర్లు ఐఐటి ఖరగ్‌పూర్ , ఐఐటి మద్రాస్ నుండి వచ్చాయన్నారు. 

అలా కోయంబత్తూరులోని 'ప్రీమియర్ మిల్స్' వద్ద తమ కంటే పెద్ద కంపెనీ అయిన DCM DPని దాటుకుని HCL మొదటి ఆర్డర్ దక్కించుకుంది. ఈ ఒక్క విజయం తర్వాత మరిన్ని ఆర్డర్లు వెల్లువెత్తాయి. ఆ ఒక్క ఆర్డర్ మరో ఐదు, ఆపై పది ఆర్డర్లకు దారితీసింది. డీసీఎం బృందం తమ ప్రెజెంటేషన్ ఇస్తుండగా ప్రీమియర్ మిల్స్ రిసెప్షన్ ఏరియాలో కూర్చున్నది నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము రెండోసారి వెళ్ళాం గెలుపుసాధించాం," అంటూ ఆయన  తమ సక్సెస్‌ స్టోరీ గురించి రాసుకొచ్చారు. 

ప్రారంభంలో ఎదురైన అడ్డంకులను అధిగమిస్తూ, భారతదేశపు తొలి స్వదేశీ కంప్యూటర్లను తయారు చేయడమే కాకుండా, ప్రారంభించిన నాలుగేళ్లలోనే సింగపూర్‌కు కూడా విస్తరించారు. ఐటీ సేవలు, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంజనీరింగ్ రంగాలలో ప్రపంచవ్యాప్త క్లయింట్లకు సేవలను అందిస్తోంది కంపెనీ. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 60కి పైగా దేశాలలో విస్తరించి, 2,23,000 కంటే ఎక్కువ ఉద్యోగులతో పనిచేస్తోంది. అనేక నూతన సాంకేతికఆవిష్కరణలతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న సంస్థగా గుర్తింపు పొందింది.

హ్యాకింగ్‌ ఆరోపణల కలకలం
మరోవైపు హెచ్‌సీఎల్‌ టెక్  ఉద్యోగి సంబంధిత డేటా బహిర్గతమైందని ఒక హ్యాకర్ గ్రూప్ ఆరోపించింది. అయితే తమ సిస్టమ్‌లు లేదా క్లయింట్ ఎన్విరాన్‌మెంట్‌లు హ్యాకింగ్‌కు గురైనట్లు ఎటువంటి ఆధారాలు లభించలేదని హెచ్‌సీఎల్‌టెక్ ప్రకటించింది. ఉద్యోగుల సమాచారం బహిర్గతమయ్యే అవకాశం ఉందని తమకు థ్రెట్-ఇంటెలిజెన్స్ హెచ్చరికలు అందినట్లు ప్రత్యర్థి ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) వెల్లడించిన తర్వాత  హెచ్‌సీఎల్‌నుంచి కూడా ఈ వివరణ వెలువడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement