భారతీయ కార్పొరేట్ దిగ్గజం టాటా గ్రూప్‌లో ఊహించని నాయకత్వ పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఆగస్టు 18న జరగనున్న అత్యంత కీలకమైన కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం) ముందు ఈ వార్త బయటకు రావడం కార్పొరేట్ వర్గాలను విస్తుపోయేలా చేసింది. అయితే, వచ్చే ఏడాది ఫిబ్రవరి 2027 వరకు ఉన్న తన ప్రస్తుత పదవీ కాలాన్ని పూర్తి చేస్తానని, ఆ తర్వాత మళ్లీ పదవిని చేపట్టేందుకు ఆసక్తి చూపడం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు తదుపరి సారథి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలని ఆయన బోర్డును కోరినట్లు సమాచారం.
ట్రస్ట్ – బోర్డు మధ్య వ్యూహాత్మక విభేదాలు
గత కొంతకాలంగా టాటా సన్స్ ప్రధాన వాటాదారు అయిన టాటా ట్రస్ట్స్(నోయెల్ టాటా నేతృత్వంలో)కు, డైరెక్టర్ల బోర్డుకు మధ్య నూతన వ్యాపారాల పనితీరు, మూలధన కేటాయింపులపై లోతైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రశేఖరన్ పదవీకాలాన్ని మరొక ఐదేళ్లు పొడిగించే అంశంపై బోర్డులో ఏకాభిప్రాయం కుదరకపోవడం, అలాగే టాటా సన్స్‌ను స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ చేయకూడదనే షరతులతో పాటు బోర్డు ప్రాతినిధ్యంపై ఇరువర్గాల మధ్య విభేదాలు ముదిరాయి. పదేపదే మళ్లీ తెరపైకి వస్తున్న అంతర్గత వివాదాల కంటే గౌరవంగా తప్పుకోవడమే మేలని చంద్రశేఖరన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
సరికొత్త ఎత్తులకు చేరిన సంస్థ
2016లో సైరస్ మిస్త్రీ నిష్క్రమణ తర్వాత 2017 ప్రారంభంలో టాటా సన్స్ మొదటి నాన్-ఫ్యామిలీ, నాన్-పార్సీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన చంద్రశేఖరన్, గ్రూప్‌ను నూతన శిఖరాలకు తీసుకెళ్లారు. టీసీఎస్ సీఈఓ స్థాయి నుంచి గ్రూప్ సారధిగా ఎదిగిన ఆయన హయాంలో కంపెనీ రాబడి, నికర లాభాలు గణనీయంగా పెరిగాయి. ఎయిరిండియా పునరుద్ధరణ, డిజిటల్ వ్యాపారాల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ముందంజ వంటివి ఆయన దార్శనికతకు నిదర్శనాలు. అయితే ఇటీవల కాలంలో ఎయిరిండియాపై రెగ్యులేటరీ నిఘా, బ్రిటన్‌లో జాగువార్ ల్యాండ్ రోవర్‌పై సైబర్ దాడి, టీసీఎస్ ఎదుర్కొంటున్న మార్కెట్ ఒత్తిళ్లు కొంత సవాలుగా మారాయి.
కుదేలైన స్టాక్ ధరలు
ఈ వార్త విస్తరించడంతోనే దలాల్ స్ట్రీట్‌లో తీవ్ర అలజడి రేగింది. టాటా గ్రూప్‌నకు చెందిన లిస్టెడ్ కంపెనీల షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి. ప్రధానంగా గ్రూప్ ఫ్లాగ్‌షిప్ ఐటీ దిగ్గజం టీసీఎస్ షేరు అత్యధికంగా 4.1 శాతం పతనమవ్వగా, టాటా మోటార్స్, టాటా స్టీల్ సహా ఇతర అనుబంధ సంస్థలు నష్టాలను చవిచూశాయి. 2024 చివర్లో రతన్ టాటా కన్నుమూసిన నాటి నుంచి గ్రూప్‌లో అంతర్గత విభేదాలు ముదురుతుండటం, ఇప్పుడు చంద్రశేఖరన్ వైదొలగడం 400 బిలియన్ డాలర్ల సామ్రాజ్యానికి కొత్త నాయకత్వ సవాలును తెచ్చిపెట్టింది.
ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!


