కోల్‌కతా నుంచి చెన్నైకి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో గాల్లో ఉండగానే తీవ్ర సాంకేతిక లోపం తలెత్తింది. విమానం చెన్నై విమానాశ్రయంలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఒక్కసారిగా ఎడమ వైపు ఇంజిన్ నిలిచిపోయింది. దీంతో పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి సమాచారం అందించి ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానంలో 224 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉండటంతో ఉత్కంఠ నెలకొంది. అయినప్పటికీ పైలట్లు సమయస్ఫూర్తితో వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
అలర్ట్ అయిన విమానాశ్రయ బృందాలు
కోల్‌కతా (సీసీయూ) నుంచి చెన్నై (ఎంఏఏ) బయలుదేరిన ఇండిగో 6E-723 విమానం మంగళవారం రాత్రి చెన్నై విమానాశ్రయం సమీపంలోకి రాగానే ఎడమ ఇంజిన్ విఫలమైంది. రాత్రి 11:29 గంటలకు పైలట్ అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరడంతో చెన్నై ఎయిర్‌పోర్ట్ అథారిటీ వెంటనే స్పందించి విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ అమలు చేసింది. రన్-వే 25 వద్ద ఫైర్ ఇంజిన్లు, వైద్య బృందాలు, అత్యవసర రెస్క్యూ వాహనాలను సిద్ధంగా ఉంచారు.
ఒక్క ఇంజిన్‌తోనే సురక్షిత ల్యాండింగ్
అన్ని భద్రతా చర్యల మధ్య రాత్రి 11:37 గంటలకు పైలట్ ఒకే ఇంజిన్ సాయంతో విమానాన్ని రన్-వే 25పై క్షేమంగా ల్యాండ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 224 మంది సురక్షితంగా కిందకు దిగడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ల్యాండింగ్ సజావుగా సాగడంతో రాత్రి 11:47 గంటలకు అత్యవసర పరిస్థితిని ఉపసంహరించుకున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. అనంతరం సాధారణ విమాన రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.
డీజీసీఏ దర్యాప్తు
ఈ సాంకేతిక వైఫల్యంపై విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది. గాల్లో ఉండగా ఇంజిన్ ఆగిపోవడానికి గల కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు సాంకేతిక నిపుణుల బృందం విమానాన్ని పరిశీలిస్తోంది. ప్రయాణికుల భద్రత దృష్ట్యా తగిన చర్యలు తీసుకుంటామని విమానయాన సంస్థ ప్రతినిధులు తెలిపారు.
ఇదీ చదవండి: మళ్లీ భగ్గుమన్న బంగారం.. ధరకు రెక్కలు!


