‘చిన్న విషయాన్ని పెద్దది చేయకండి’.. ఎయిరిండియా ఘటనపై ప్రత్యక్ష సాక్షి | Phuket Delhi Air India pilot tests positive | Sakshi
Sakshi News home page

‘చిన్న విషయాన్ని పెద్దది చేయకండి’.. ఎయిరిండియా ఘటనపై ప్రత్యక్ష సాక్షి

Aug 12 2026 1:52 AM | Updated on Aug 12 2026 1:57 AM

Phuket Delhi Air India pilot tests positive

ఢిల్లీ: గత వారం గాల్లో ప్రయాణిస్తుండగా అకస్మాత్తుగా 300 అడుగుల కిందకు పడిపోయిన ఫుకెట్-ఢిల్లీ ఎయిరిండియా విమాన కెప్టెన్‌పై ప్రయాణికుడు తీవ్ర ఆరోపణలు చేశారు. విమానం టేకాఫ్ కావడానికి ముందే పైలట్ మత్తులో ఉన్నాడని, ప్రమాదం జరిగిన తర్వాత ఎవరూ వీడియోలు తీయవద్దని, చిన్న విషయాన్ని పెద్దది చేయవద్దంటూ హెచ్చరించాడని ఆయన తెలిపారు.

ఆగస్టు 4న 137 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ఫుకెట్ నుండి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా (AI-2379) విమానం మార్గమధ్యంలో ఒక్కసారిగా తీవ్ర కుదుపులకు గురై 300 అడుగుల మేర కిందికి పడిపోయింది. ఈ ఘటనలో కనీసం 20 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు. ప్రమాదం అనంతరం నిర్వహించిన రెండు డోప్ పరీక్షల్లోనూ కెప్టెన్ ఫెయిల్ అయ్యాడని, అతను మత్తు పదార్థాలు తీసుకున్నట్లు తేలిందని సమాచారం. ఈ క్రమంలో ఆ విమానంలో ప్రయాణించిన ఒక ప్రత్యక్ష సాక్షి జాతీయ మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు.

‘నేను, నా సోదరుడు విమానం ఎక్కే చివరి ప్రయాణికులం. పైలట్ కూడా మాతోనే విమానం ఎక్కాడు. ‘విమానం సరైన సమయానికే బయలుదేరుతుందా? లేదా మేము ఆలస్యమయ్యామా?’ అని నేను అతనిని అడిగాను. దానికి అతను చాలా నిదానంగా స్పందించాడు. అతని కళ్లు ఎర్రగా ఉన్నాయి.  మత్తులో ఉన్నాడని నేను అప్పుడే నా సోదరుడికి చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే’ అని ఆయన చెప్పారు.

‘పైలట్ మొదటి డోప్ పరీక్షలో ఫెయిల్ అయ్యాడని తెలిసిన వెంటనే నేను నా సోదరుడికి ఫోన్ చేసి చెప్పాను. అంతకుముందు విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో మీడియాతో మాట్లాడుతూ పైలట్ మత్తులో ఉన్నాడని చెప్పినప్పుడు చాలామంది నా మాటలను ఎగతాళి చేశారు. మీమ్స్ కూడా వేస్తూ, మత్తులో ఉన్న వ్యక్తి విమానాన్ని ఎలా నడుపుతాడంటూ ప్రశ్నించారు’ అని ఆ ప్రయాణికుడు గుర్తు చేసుకున్నారు.

విమానం అకస్మాత్తుగా కిందకు పడిపోయిన భయానక క్షణాలను వివరిస్తూ.. ‘టేకాఫ్ అయిన రెండు గంటల తర్వాత అల్పాహారం పూర్తయి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. నేను, నా సోదరుడు పక్కపక్కనే కూర్చుని కళ్లు మూసుకున్నాము. అకస్మాత్తుగా ఫైటర్ జెట్ లాంటి తీవ్రమైన శబ్దం వచ్చింది. మరుసటి క్షణంలోనే నా సోదరుడు మూడు నాలుగు సార్లు విమానం పైకప్పును బలంగా ఢీకొట్టడం చూశాను. లగేజీ, వస్తువులన్నీ గాల్లోకి ఎగిరిపడ్డాయి. ప్రయాణికులకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. అంతా హాహాకారాలు చేస్తూ, ఏడుస్తూ విమానాన్ని సురక్షితంగా ఆపాలని పైలట్‌ను వేడుకున్నారు.

నా జీవితంలో మొదటిసారి ఒక పైలట్ కాక్‌పిట్ నుండి బయటకు వచ్చి, ప్రయాణికులు వీడియోలు రికార్డ్ చేయవద్దని బ్రతిమలాడటం చూశాను. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. అందులో అతను 'చిన్న విషయాన్ని పెద్దది చేయకండి' అని స్పష్టంగా అన్నాడు. తీవ్ర భయాందోళనల్లో ఉన్న సమయంలో రికార్డింగ్ గురించి ఎవరు ఆలోచిస్తారు? గాయపడిన వారికి సత్వర వైద్య చికిత్స అందించడం అతని ప్రధాన ఉద్దేశం కాదు. విచారణ తప్పించుకోవడానికే లక్నోలో సరైన వైద్య సదుపాయాలు లేవనే సాకుతో విమానాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాడు అని ఆ ప్రయాణికుడు ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement