చర్చకు నో.. నినాదాలకు ఓ.. లోక్‌సభలో గందరగోళం! | Lok Sabha Erupts Again: Slogans Force Adjournment | Sakshi
Sakshi News home page

చర్చకు నో.. నినాదాలకు ఓ.. లోక్‌సభలో గందరగోళం!

Aug 11 2026 11:16 AM | Updated on Aug 11 2026 11:20 AM

Lok Sabha Erupts Again: Slogans Force Adjournment

సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో మరోసారి గందరగోళం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్ష ఎంపీలు నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లడంతో లోక్‌సభ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సభ సజావుగా సాగనివ్వాలని, దేశ ప్రజలు చర్చ జరగాలని కోరుకుంటున్నారని స్పీకర్‌ ఓం బిర్లా సభ్యులను సముదాయించే ప్రయత్నం చేసినా.. విపక్ష ఎంపీలు వెనక్కి తగ్గలేదు.

నీట్‌ అంశం, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుతో పాటు పలు అంశాలపై విపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ మధ్యలోకి రావడంతో పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

అంతకుముందు పార్లమెంట్‌ ఆవరణలోనూ అధికార, ప్రతిపక్షాల మధ్య పోటాపోటీ నిరసనలు జరిగాయి. విపక్షాల ఆందోళనలకు కౌంటర్‌గా ఎన్డీయే ఎంపీలు మకర్‌ ద్వార్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సభను అడ్డుకుంటున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. విద్యార్థుల ఆందోళనలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని, హోంమంత్రి అమిత్‌ షా సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఎన్డీయే నేతలు పేర్కొన్నారు. రాహుల్‌ గాంధీనే సభ జరగనీయకుండా అడ్డుపడుతున్నారని.. ఆయన చర్చలో పాల్గొనాలంటూ నినాదాలు చేశారు. అదే సమయంలో జార్ఖండ్‌లో విద్యార్థులపై లాఠీ చార్జి చేయడాన్ని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. 

ఎన్డీయే ఎంపీలకు కౌంటర్‌గా మరోవైపు ఇండియా కూటమి ఎంపీలు జంతర్‌ మంతర్‌ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్య, నీట్‌ అంశం, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లుపై కేంద్రాన్ని నిలదీశారు. కాంగ్రెస్‌, డీఎంకే ఎంపీలు కలిసి నీట్‌ అంశంపై నినాదాలు చేశారు. జార్ఖండ్‌ పేపర్‌ లీక్‌ వ్యవహారానికి రాహుల్‌ గాంధీ బాధ్యుడు కాదని.. జంతర్‌ మంతర్‌ లాఠీ ఛార్జికి మాత్రం అమిత్‌ షా బాధ్యుడంటూ వాదించారు.

సమావేశాలు ముగింపు దశకు చేరుకున్న వేళ.. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. కీలక బిల్లుల ఆమోదం నేపథ్యంలో సభ సజావుగా సాగాలని ప్రభుత్వం కోరుతుండగా.. తమ డిమాండ్లపై చర్చ జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని విపక్షాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో పార్లమెంట్‌లో రాజకీయ వేడి మరింత పెరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement