‘సంగక్కర బూతులు తిట్టాడు’ | Sangakkara said you guys cheat your parents teach all this:IND ex Star Reveals | Sakshi
Sakshi News home page

‘సంగక్కర బూతులు తిట్టాడు’

Aug 10 2026 5:02 PM | Updated on Aug 10 2026 5:17 PM

Sangakkara said you guys cheat your parents teach all this:IND ex Star Reveals

టీమిండియా మాజీ క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ శ్రీలంక దిగ్గజం కుమార్‌ సంగక్కర గురించి ఆసక్తికర విషయం వెల్లడించాడు. 2005 నాటి ఢిల్లీ టెస్టు సందర్భంగా సంగక్కర బూతులు తిట్టాడని.. తాను కూడా అందుకు గట్టిగానే బదులిచ్చానని తెలిపాడు.

కాగా 2005లో మూడు టెస్టులు ఆడేందుకు శ్రీలంక క్రికెట్‌ జట్టు భారత్‌కు వచ్చింది. ఇందులో భాగంగా చెన్నైలో తొలి మ్యాచ్‌ ‘డ్రా’గా ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్‌ 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌ సందర్భంగా టీమిండియా మేనేజ్‌మెంట్‌ అనూహ్య నిర్ణయం తీసుకుంది.

సెంచరీ మిస్‌
ఓపెనర్‌ గౌతం గంభీర్‌కు జోడీగా బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ను పంపింది. అయితే, గంభీర్‌ మూడు పరుగులకే నిష్క్రమించగా.. ఊహించని రీతిలో ఇర్ఫాన్‌ పఠాన్‌ 93 పరుగులు సాధించాడు. సెంచరీకి కేవలం ఏడు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇర్ఫాన్‌ ఇన్నింగ్స్‌ కారణంగా భారత్‌ మెరుగైన స్కోరు సాధించింది. ఆ తర్వాత లంకను తక్కువ స్కోరుకే ఆలౌట్‌ చేసి జయభేరి మోగించింది.

మురళీధరన్‌ బౌలింగ్‌లో సిక్సర్లు
నాటి సంగతులను ఇర్ఫాన్‌ పఠాన్‌ తాజాగా గుర్తు చేసుకున్నాడు. చీకీ సింగిల్స్‌లో మాట్లాడుతూ.. ‘‘ఢిల్లీలో టెస్టు మ్యాచ్‌. రెండో ఇన్నింగ్స్‌లో నేను ఓపెనర్‌గా వచ్చి 93 పరుగులు చేశాను. అపుడు శ్రీలంక ఆటగాళ్లు ఎందుకో అసంతృప్తిగా కనిపించారు.

సంగక్కర బూతులు తిట్టాడు
ముఖ్యంగా సంగక్కర కోపంగా ఉన్నాడు. నేను బ్యాటింగ్‌ చేయడానికి వెళ్లినపుడు అసలేం జరిగిందో తెలియలేదు. ముత్తయ్య మురళీధరన్‌ బౌలింగ్‌లో నేను రెండు సిక్సర్లు బాదాను. కొత్త బంతిని ఎదుర్కొంటూ మురళీధరన్‌ బౌలింగ్‌లో షాట్లు కొట్టగానే వారి ముఖాలు మారిపోయాయి.

దీనర్థం మేము వారి ప్రణాళికలను ఛిన్నాభిన్నం చేశాము. ఆ వెంటనే సంగక్కర.. ‘మీరు మోసగాళ్లు. మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పారు?’ అంటూ బూతులు అందుకున్నాడు. వ్యక్తిగతంగానూ నన్ను మాటలు అన్నాడు. నేనూ ఊరుకోకుండా.. తిరిగి అతడిని తిట్టాడు. ఏదేమైనా ముందైతే అతడు మొదలుపెట్టాడు.

మంచి స్నేహితులమయ్యాము
ఆ తర్వాత మేము ఐపీఎల్‌లో పంజాబ్‌కు కలిసి ఆడాల్సి వచ్చింది. ఇద్దరి కుటుంబాలు కలిసి కూర్చుని తినాల్సిన పరిస్థితి. అప్పుడు నేను సంగక్కర దగ్గరికి వెళ్లి సారీ చెప్పాను. అతడు కూడా క్షమాపణ కోరాడు.

అప్పటి నుంచి మేమిద్దరం మంచి స్నేహితులమయ్యాము. మ్యాచ్‌ సమయంలో మా భావోద్వేగాలను నియంత్రించుకోలేక ఆరోజు అలా తిట్టుకున్నాము. మనుషులు పొరపాట్లు చేయడం సహజం. అయితే, పరిణతితో వాటిని ఎలా సరిదిద్దుకున్నామనేదే ముఖ్యం’’ అని ఇర్ఫాన్‌ పఠాన్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఆనాటి మూడో టెస్టులోనూ శ్రీలంకపై గెలిచి టీమిండియా 2-0తో సిరీస్‌ కైవసం చేసుకుంది. 

చదవండి: చరిత్ర సృష్టించనున్న టీమిండియా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement