చరిత్ర సృష్టించిన మిచెల్‌ మార్ష్ | Mitchell Marsh Enters Virat Kohli, AB de Villiers League With Special T20 Feat | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన మిచెల్‌ మార్ష్‌.. టీ20ల్లో అరుదైన రికార్డు

Aug 10 2026 3:45 PM | Updated on Aug 10 2026 4:07 PM

Mitchell Marsh Enters Virat Kohli, AB de Villiers League With Special T20 Feat

source: X

ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్‌ మిచెల్‌ మార్ష్‌ పొట్టి క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ఒకే ఏడాదిలో 1500 టీ20 పరుగులు పూర్తి చేసిన తొలి ఆసీస్‌ బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. హండ్రెడ్‌ 2026లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న అతడు.. తాజాగా వెల్ష్‌ ఫైర్‌తో జరిగిన మ్యాచ్‌లో (34 బంతుల్లో 50) ఈ ఘనత సాధించాడు.

మిచ్‌ మార్ష్‌కు ముందు ఈ రికార్డు టిమ్‌ డేవిడ్‌ పేరిట ఉండేది. 2022లో అతడు 1461 పరుగులు చేశాడు. 2024లో ట్రావిస్‌ హెడ్‌ 1442 పరుగులతో టిమ్‌కు దగ్గరగా వచ్చాడు.

ఈ ఏడాది ఇప్పటివరకు 35 మ్యాచ్‌లు ఆడిన మార్ష్‌.. 44.17 సగటున, 160కి దగ్గరగా స్ట్రైక్‌రేట్‌తో,  రెండు సెంచరీలు, 11 అర్ధ సెంచరీల సాయంతో 1502 పరుగులు చేసి టిమ్‌ డేవిడ్‌ రికార్డును బద్దలు కొట్టాడు.

మార్ష్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆస్ట్రేలియా తరఫున, బిగ్‌ బాష్‌ లీగ్‌లో పెర్త్‌ స్కార్చర్స్‌, ఐపీఎల్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌, ది హండ్రెడ్‌లో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ తరఫున ఆడుతూ ఈ పరుగులు సాధించాడు.

కోహ్లి, ఏబీడీ సరసన చోటు
ఈ ఏడాది టీ20ల్లో 1500 పరుగులు సాధించడంతో మార్ష్‌ విరాట్‌ కోహ్లి, ఏబీ డివిలియర్స్‌ సరసన చేరాడు. విరాట్‌ 2016లో 1614 పరుగులు చేయగా.. ఏబీడీ 2019లో 1580 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 పరుగుల ప్రపంచ రికార్డు మాత్రం వెస్టిండీస్‌ స్టార్‌ నికోలస్‌ పూరన్‌ పేరిట ఉంది. 2024లో పూరన్‌ ఏకంగా 2331 పరుగులు చేశాడు.

హండ్రెడ్‌లోనూ చరిత్రకు చేరువలో..!
హండ్రెడ్‌లోనూ మార్ష్‌ మరో రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన  ఏడు ఇన్నింగ్స్‌ల్లో 374 పరుగులు చేసిన అతడు.. ఓ హండ్రెడ్‌ సీజన్‌లో అత్యధిక పరుగుల రికార్డుకు 51 పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ రికార్డు ప్రస్తుతం జేమ్స్‌ విన్స్‌ పేరిట ఉంది. విన్స్‌ 2024లో సదర్న్‌ బ్రేవ్‌ తరఫున 424 పరుగులు చేశాడు.

గత కొన్నేళ్లలో మార్ష్‌ తన బ్యాటింగ్‌ తీరును చాలా మార్చుకున్నాడు. ఒకప్పుడు ప్రధానంగా ఆల్‌రౌండర్‌గా కనిపించిన అతడు ఇప్పుడు టాపార్డర్‌లో విధ్వంసక బ్యాటర్‌గా మారాడు. మొత్తం టీ20 కెరీర్‌లో మార్ష్‌ ఇప్పటివరకు 7033 పరుగులు చేశాడు. అతడి సగటు 34.64 కాగా.. స్ట్రైక్‌రేట్‌ 141.48.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement