దంచికొట్టిన రికెల్టన్‌.. దూసుకెళ్తున్న సన్‌రైజర్స్‌ | The Hundred 2026: Sunrisers Leeds Beat Birmingham Phoenix to Reach 2nd Place | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన రికెల్టన్‌.. దూసుకెళ్తున్న సన్‌రైజర్స్‌

Aug 8 2026 1:43 PM | Updated on Aug 8 2026 1:46 PM

Sunrisers Rickelton Carse send Phoenix crashing out Jumps To 2nd Place

PC: SunRisers Leeds X

‘ది హండ్రెడ్‌ మెన్స్‌ కాంపిటీషన్‌’-2026 టోర్నీలో సన్‌రైజర్స్‌ లీడ్స్‌ వరుస విజయాలతో దూసుకువెళ్తోంది. తాజాగా బర్మింగ్‌హామ్‌ ఫొనిక్స్‌ జట్టును ఓడించిన సన్‌రైజర్స్‌.. సీజన్‌లో నాలుగో విజయం నమోదు చేసింది. తద్వారా పదహారు పాయింట్లతో పట్టికలో రెండోస్థానానికి దూసుకువచ్చింది.

సన్‌రైజర్స్‌ లీడ్స్‌ ప్రయాణం ఇలా
ది హండ్రెడ్‌ తాజా ఎడిషన్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ తొలి మ్యాచ్‌లో ఎంఐ లండన్‌ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం సదరన్‌ బ్రేవ్‌తో తలపడి ఐదు పరుగుల స్వల్ప తేడాతో గెలిచి.. విజయాల ఖాతా తెరిచింది. 

ఆ తర్వాత మాంచెస్టర్‌ సూపర్‌ జెయింట్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్‌కు.. ట్రెంట్‌ రాకెట్స్‌ షాకిచ్చింది. దీంతో సీజన్‌లో రెండో పరాజయం చవిచూసిన సన్‌రైజర్స్‌.. లండన్‌ స్పిరిట్‌పై గెలిచి మరోసారి గెలుపుబాట పట్టింది.

దంచికొట్టిన రికెల్టన్‌
తాజాగా బర్మింగ్‌హాన్‌ ఫినిక్స్‌తో తలపడ్డ సన్‌రైజర్స్‌ 45 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా టాస్‌ ఓడిన సన్‌రైజర్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్లలో మిచెల్‌ మార్ష్‌ (34) ఫర్వాలేదనిపించగా.. రియాన్‌ రికెల్టన్‌ దంచికొట్టాడు. కేవలం 37 బంతుల్లోనే ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాది 65 పరుగులు సాధించాడు.

మిగిలిన వారిలో హ్యారీ బ్రూక్‌ 19, డాన్‌ లారెన్స్‌ 14 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ జాక్‌ క్రాలే (3) విఫలమయ్యాడు. ఫలితంగా నిర్ణీత 100 బంతుల్లో సన్‌రైజర్స్‌ ఏడు వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. బర్మింగ్‌హామ్‌ బౌలర్లలో ఉస్మాన్‌ తారిఖ్‌ రెండు వికెట్లు తీయగా.. క్రిస్‌ వుడ్‌, టామ్‌ హెల్మ్‌, జోర్డాన్‌ థాంప్సన్‌ తలా ఒక వికెట్‌ దక్కించుకున్నారు.

124 పరుగులకే పరిమితం
అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన బర్మింగ్‌హామ్‌ జట్టు నిర్ణీత 100 బంతుల్లో ఎనిమిది వికెట్లు నష్టపోయి 124 పరుగులకే పరిమితమైంది. దీంతో సన్‌రైజర్స్‌ 45 పరుగుల తేడాతో గెలిచింది. బర్మింగ్‌హామ్‌ బ్యాటర్లలో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జో క్లార్క్‌ 25, సీన్‌ డెక్సాన్‌ 34, జోర్డాన్‌ థాంప్సన్‌ 25 (నాటౌట్‌) ఓ మోస్తరుగా రాణించగా.. మిగతా వాళ్లంతా విఫలమయ్యారు.

రెండోస్థానానికి
సన్‌రైజర్స్‌ బౌలర్లలో బ్రైడన్‌ కార్స్‌, మాథ్యూ పాట్స్‌ చెరో మూడు వికెట్లతో చెలరేగగా.. నాథన్‌ ఎల్లిస్‌, అబ్రార్‌ అహ్మద్‌ తలా ఒక వికెట్‌ తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌కు ఆరింట ఇది నాలుగో విజయం. 

ఎంఐ లండన్‌తో పాయింట్ల పరంగా (16) సమానంగా ఉన్నప్పటికీ.. నెట్‌రన్‌రేటు పరంగా మెరుగైన స్థితిలో ఉన్న సన్‌రైజర్స్‌ (+0.674) పట్టికలో రెండోస్థానానికి చేరుకుంది. మరోవైపు.. బర్మింగ్‌హామ్‌ జట్టు ఎలిమినేట్‌ అయింది.

చదవండి: IND vs SL: కేఎల్‌ రాహుల్‌ అలా.. పడిక్కల్‌ ఇలా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement