PC: MI London X
‘ది హండ్రెడ్ మెన్స్ కాంపిటిషన్’-2026 ఎడిషన్‌లో లండన్ స్పిరిట్ ప్రయాణం ముగిసిపోయింది. ఎంఐ లండన్‌తో కీలక మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ బృందం తేలిపోయింది. ప్రత్యర్థి జట్టు చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయి టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.
160 పరుగులు
లండన్‌లోని లార్డ్స్ వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఎంఐ లండన్ జట్టు తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన లండన్ స్పిరిట్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో ఐదు వికెట్లు నష్టపోయి 160 పరుగులు చేసింది.
ఓపెనర్లలో లువాన్ డ్రి ప్రిటోరియస్ మెరుపు అర్ధ శతకం (28 బంతుల్లో 52) సాధించగా.. జానీ బెయిర్ స్టో (13) విఫలమయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన లండన్ స్పిరిట్ కెప్టెన్ లియామ్ లివింగ్‌స్టోన్ (6), డెవాల్డ్ బ్రెవిస్ (4) కూడా తేలిపోయారు.
మిగిలిన వారిలో డేవిడ్ విల్లే (18 బంతుల్లో 31), జేమ్స్ కోల్స్ (23 బంతుల్లో 30 నాటౌట్), జేమీ ఓవర్టన్ (6 బంతుల్లో 13 నాటౌట్) వేగంగా ఆడటంతో ఈ స్కోరు సాధ్యమైంది. ఎంఐ లండన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, నాథన్ సోటర్ రెండేసి వికెట్లు కూల్చగా.. రిచర్ట్ గ్లీసన్ ఒక వికెట్ దక్కించుకున్నాడు.
ఓపెనర్లు విఫలమైనా
లండన్ స్పిరిట్ విధించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎంఐ లండన్ ఆదిలో తడబడింది. ఓపెనర్లు విల్ జాక్స్ (18), జేమ్స్ విన్స్ (15) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అయితే, వన్‌డౌన్‌లో వచ్చిన నికోలస్ పూరన్, కెప్టెన్ సామ్ కర్రాన్ ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
రజా మెరుపులు
నికోలస్ 25 బంతుల్లో 39, సామ్ 23 బంతుల్లో 33 పరుగులతో రాణించారు. వీరికి తోడుగా సికిందర్ రజా దుమ్ములేపాడు. కేవలం 16 బంతుల్లోనే నాలుగు సిక్సర్ల సాయంతో 32 పరుగులు రాబట్టాడు. మిగిలిన వారిలో షెర్ఫానే రూథర్‌ఫర్డ్ (4) విఫలం కాగా.. టామ్ కర్రాన్ 8, ఓలీ పోప్ 5 పరుగులతో అజేయంగా నిలిచి ఎంఐ లండన్ విజయాన్ని ఖరారు చేశారు.
Welcome to the Hundred @SRazaB24 🔥#MILondon 💙💚 pic.twitter.com/8DpJc4IMQ7
— MI London (@MILondonCricket) August 6, 2026
మొత్తానికి సామ్ కర్రాన్ బృందం 94 బంతుల్లో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసి నాలుగు వికెట్ల తేడాతో గెలిచింది. ఇక లండన్ స్పిరిట్‌కు ఆరింట ఇది ఐదో ఓటమి. దీంతో టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిపోయింది.
రషీద్ ఖాన్ స్థానంలో
జింబాబ్వే టీ20 జట్టు కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ సికిందర్ రజా ఎంఐ లండన్ జట్టులో అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ స్థానాన్ని భర్తీ చేశాడు. ఇందుకు సంబంధించి ఫ్రాంఛైజీ ఆగష్టు 5న ప్రకటన విడుదల చేసింది.
రషీద్ ఖాన్ ఐర్లాండ్‌తో సిరీస్ సందర్భంగా అఫ్గాన్ తరఫున విధుల్లోకి వెళ్లగా.. సికిందర్ రజాకు ఈ మేరకు బంపరాఫర్ వచ్చింది. ఇక వచ్చీరాగానే లండన్ స్పిరిట్‌తో మ్యాచ్‌లో రజా అదరగొట్టాడు.
మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు రజా. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో ఎంఐ లండన్‌కు ఆరింట ఇది నాలుగో విజయం. తద్వారా 16 పాయింట్లతో పట్టికలో రెండో స్థానానికి చేరింది.
చదవండి: వాళ్లిద్దరికి కంగ్రాట్స్.. ప్రతీ ప్రశ్నకు సమాధానమిస్తాం: గంభీర్


