నేటి నుంచి భారత్ వామప్ మ్యాచ్
ఎస్‌ఎల్‌సీ ఎలెవన్‌తో పోరు
కొలంబో: సొంతగడ్డపై భారత జట్టు ఇటీవల రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోయింది. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతుల్లో ఓడిన ఈ సిరీస్‌లలో అనూహ్యంగా ప్రత్యర్థి స్పిన్నర్లు మనపై ఆధిపత్యం ప్రదర్శించారు. స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో తిరుగులేని రికార్డు ఉన్న టీమిండియా కూడా పూర్తిగా తడబడింది. ఇప్పుడు శ్రీలంకతో భారత్‌కు అదే తరహా సవాల్ ఎదురు కావచ్చు. లంక జట్టులో నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో పాటు సొంతగడ్డపై వారి బలం రెట్టింపయ్యే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో టెస్టు సిరీస్‌కు ముందు స్పిన్‌లో మరింత సాధన అవసరమని జట్టు భావిస్తోంది. అందుకే నేటి నుంచి జరిగే వామప్ మ్యాచ్‌లో స్పిన్‌ను ఎదుర్కోవడంపైనే ప్రధానంగా దృష్టి పెట్టింది. ఈ మూడు రోజుల పోరులో శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎస్‌సీ) ఎలెవన్‌లో భారత్ తలపడుతుంది.
స్థానిక ఎన్‌సీసీ గ్రౌండ్‌లో జరిగే ఈ మ్యాచ్ శ్రీలంకలోని పరిస్థితులపై అలవాటు పడేందుకు కూడా ఉపయోగపడనుంది. భారత్ చివరిసారిగా 2017లో శ్రీలంకలో టెస్టు సిరీస్ ఆడింది. నాటి జట్టులో ఉన్న కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ మాత్రమే ఇప్పుడు మళ్లీ ఆడుతున్నారు. మిగతా వారందరికీ లంకలో టెస్టు ఆడటం ఇదే మొదటిసారి కానుంది.
వామప్ పోరులో భారత బ్యాటర్లంతా బరిలోకి దిగే అవకాశం ఉంది. బౌలింగ్‌లో ప్రధాన పేసర్ సిరాజ్‌తో పాటు ప్రసిధ్, గుర్నూర్, ఆకిబ్ నబీ ఉన్నారు. కొత్త స్పిన్నర్లు సుతార్, సారాంశ్‌లకు తమ స్పిన్ బలాన్ని ప్రదర్శించేందుకు ఇది మంచి అవకాశం.
ఇటీవల భారత ‘ఎ’ జట్టు తరఫున బ్రార్, సారాంశ్ మెరుగైన ప్రదర్శన కనబర్చడం సానుకూలాంశం. మరోవైపు శ్రీలంక తరఫున 3 టెస్టులు ఆడిన సొనాల్ దినుష ఎస్‌ఎల్‌సీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా.. ఇషిత విజేసుందర్, రమేశ్ మెండిస్ రూపంలో ఇద్దరు నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు.


