రెండేళ్ల క్రితం ఉవ్వెత్తున ఎగిసిపడిన విద్యార్థి ఉద్యమాన్ని అదుపుచేయటం అసాధ్యమని తేలాక హెలికాప్టర్‌లో అక్కడినుంచి నిష్క్రమించి భారత్‌లో ఆశ్రయం పొందిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సరిగ్గా ఆ తేదీనే ఎంచుకుని తొలిసారి బుధవారం మీడియాతో మాట్లాడారు. వచ్చే డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లబోతున్నానని గతంలో చెప్పిన మాటనే పునరుద్ఘాటించారు. తనను జైల్లో బంధిస్తారని తెలిసినా, ఉరికంబం తన కోసం ఎదురు చూస్తున్నదని అర్థమైనా తిరిగి వెళ్లటానికే ఆమె సంసిద్ధులవుతున్నారు. దేశానికి సారథ్యంవహించే నాయకత్వానికి పరిణతి లోపిస్తే కక్ష సాధింపులే సమర్థతగా అనిపిస్తాయి.
సాధించిన స్వాతంత్య్రం అర్థరహితమవుతుంది. ఇది బంగ్లాదేశ్ ప్రస్తుత నాయకత్వానికి మాత్రమే కాదు... హసీనాతోసహా బంగ్లా మాజీ పాలకులందరికీ వర్తిస్తుంది. ఆ మాట కొస్తే పాకిస్తాన్ పరిస్థితి కూడా మొదటినుంచీ ఇంతే. అదృష్టవశాత్తూ మన దేశంలో స్వాతంత్య్రోద్యమ నాయకత్వం నుంచి తొలి తరం సారథులు రావటంవల్ల కావొచ్చు...ఆ బెడద లేదు. ఇక్కడ సైతం ఆ పోకడలు తలెత్తుతూనే ఉన్నా ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తమై వాటిని తిప్పికొడుతూనే ఉన్నారు. బంగ్లాదేశ్‌లో తనకెదురైన దుఃస్థితికి హసీనా తనను తానే నిందించుకోవాలి. ప్రజలు మెచ్చి అధికారం కట్టబెట్టాక ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దారు. జీడీపీ పెరిగింది. అంతక్రితంతో పోలిస్తే ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. కానీ ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకోవటానికి ఆమె వేసిన ఎత్తుగడలు అవధులు మీరాయి.
వస్తున్న మెజారిటీ చాలదనుకుని ఎన్నికల ఫలితాలు ఏమార్చారు. చివరకు మొత్తం ఎన్నికలే రిగ్గింగ్ చేసే స్థాయికి దిగజారారు. మతోన్మాద శక్తుల ఆటకట్టించేందుకు చర్యలు తీసుకున్నా, సహేతుకమైన అసమ్మతికి సైతం ముద్రలేసి పబ్బం గడుపుకోవాలనుకున్నారు. మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ (బీఎన్‌పీ) అధినేత బేగం ఖలీదా జియాను అవినీతి ఆరోపణలతో దీర్ఘకాలం చెరసాలపాలు చేశారు. ఖలీదా సైతం అంతే. తాను రాజ్యమేలిన మూడు దఫాలూ కక్షసాధింపు రాజకీయాల్లోనే మునిగితేలారు. ఆమె కుమారుడు, ప్రస్తుత ప్రధాని తారిఖ్ రెహ్మాన్ ఆ వారసత్వాన్నే కొనసాగించదల్చుకున్నట్టు కనబడుతోంది.
హసీనా సర్కార్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పోలీసులు, సైన్యం జరిపిన కాల్పుల్లో 1,400 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి లెక్కలే చెబుతున్నాయి. నిజమే కావొచ్చు. జరిగిన తప్పిదాలకు ఆమె బాధ్యత వహించాల్సిందే. కానీ న్యాయవ్యవస్థను మహ్మద్ యూనస్ సలహాదారుగా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం భ్రష్టుపట్టించింది. మతతత్వవాదులు రెచ్చిపోయి హసీనా ఏలుబడిలోని న్యాయమూర్తుల్ని వేధించి రాజీనామాలు చేయించారు. ఉన్నతాధికారుల్ని అరెస్టు చేశారు. హిందూ మైనారిటీల ఇళ్లపై దాడులకు దిగారు. ఇలాంటి వాతావరణంలో జరిగిన విచారణకు విశ్వసనీయత ఉంటుందా?
హసీనాను అప్పగించటంలేదన్న ఆగ్రహం బంగ్లాకు ఉంది. ఇదేమీ అసహజం కాదు. కానీ అధికారంలోకొచ్చాక భారత్‌ను రెచ్చగొట్టేలా తారిఖ్ రెహ్మాన్ చర్యలుంటున్నాయి. జూన్‌లో చైనాలో నాలుగు రోజులు పర్యటించి, 17 ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ‘2+2 డైలాగ్’ పేరిట విదేశాంగ విధానాన్నీ, భద్రతనూ నిర్ణీత వ్యవధిలో చర్చించుకుంటూ ఉండాలని రెండు దేశాలూ నిర్ణయించుకున్నాయి. అమెరికాతో ఆయన సాన్నిహిత్యం తెలియందేమీ కాదు. బంగ్లాలో అలజడుల వెనక అమెరికా పాత్ర జగద్విదితం. ఇదిగాక భారత్‌కు సన్నిహితమైతే విపక్షమైన జమాతే ఇస్లామీ బలపడుతుందేమోనన్న భయంతో రెహ్మాన్ మనవైపు కన్నెత్తి చూడటానికే సాహసించటం లేదు.
ఇలాంటి స్థితిలో హసీనాను భారత్ అప్పగిస్తుందని ఆ దేశం అనుకోవటం హాస్యాస్పదం. అందరి మాదిరే మన దేశం ఎటూ స్వీయప్రయోజనాలు చూసుకుంటుంది. దౌత్యరంగంలో ఎప్పుడూ పరిస్థితులు ఒకేలా ఉండవు. బంగ్లా చిత్తశుద్ధితో వ్యవహరిస్తే, ఇంటా బయటా భారత వ్యతిరేక శక్తులతో చేతులు కలిపే అత్యుత్సాహాన్ని ఆపుకుంటే ఏ సమస్య అయినా తప్పక పరిష్కారమవుతుంది. అంతకన్నా ముందు హసీనా కుమారుడు ఈ మీడియా సదస్సులో ఆరోపించినట్టు బంగ్లా మరో పాకిస్తాన్‌గా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత రెహ్మాన్‌కుంది.


