కాఠ్మాండు: నేపాల్ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చోలేంద్ర శంషేర్ జంగ్ బహదూర్ రాణాను పోలీసులు అరెస్ట్ చేశారు. కాఠ్మాండు క్రైమ్ బ్రాంచ్ అధికారులు ఆదివారం ఉదయం మహారాజ్‌గంజ్‌లోని ఆయన నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. క్రైమ్ బ్రాంచ్‌లో రాణాపై ఫిర్యాదు నమోదైన నేపథ్యంలో ఈ అరెస్ట్ జరిగినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు, అరెస్ట్‌కు దారితీసిన కారణాలను పోలీసులు ఇప్పటివరకు వెల్లడించలేదు. తొలుత దర్యాప్తు కోసం ఆయనను తీసుకెళ్లినట్లు తెలిపారు. త్వరలో మరిన్ని వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు.
రాణా 2019 జనవరి 2న నేపాల్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 2022 ఫిబ్రవరి 13న ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ప్రారంభం కావడంతో రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయనను సస్పెండ్ చేశారు. ఆయనపై అభిశంసన ప్రక్రియ చాలా కాలం కొనసాగింది. ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అభిశంసన ప్రక్రియ పూర్తికాకపోవడంతో రాణాకు పెన్షన్‌తో పాటు పదవీ విరమణ అనంతరం అందాల్సిన ఇతర మొత్తాలను విడుదల చేయాలని ఆదేశించింది.
రాణా ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సమయంలో అప్పటి ప్రధాని కేపీ శర్మ ఓలి తీసుకున్న పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని ఆయన నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొట్టివేసింది. అనంతరం నేపాలీ కాంగ్రెస్, మావోయిస్టుల కూటమి నేత షేర్ బహదూర్ దేఉబాను ప్రధానమంత్రిగా నియమించాలని ఆదేశించింది. ప్రస్తుతం రాణా అరెస్ట్‌కు సంబంధించిన అసలు కారణం, ఆయనపై నమోదైన ఫిర్యాదులోని ఆరోపణలు ఇంకా అధికారికంగా వెలువడాల్సి ఉంది. దర్యాప్తు అనంతరం ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: హీరోయిన్‌ను బాడీ షేమింగ్ చేసిన తేజ్.. లాలూను గుర్తుచేసిన నటి!


