దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన అభిషేక్ ను అదుపులోకి తీసుకున్న సీబీఐ
ట్రాన్సిట్ రిమాండ్‌పై రాయ్‌పూర్ తరలింపు
గత పదేళ్లలో రూ. 94,400 కోట్ల అక్రమ ఆదాయం ఆర్జన: ఈడీ
శంషాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో ప్రధాన సూత్రధారి అభిషేక్ ను అరెస్టు చేసినట్లు సీబీఐ గురువారం ప్రకటించింది. ఛత్తీస్‌గఢ్ కేంద్రంగా మహాదేవ్ బుక్ పేరుతో ఆన్‌లైన్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహించడంలో అతను కీలకపాత్ర పోషించాడని పేర్కొంది. అరెస్టు భయంతో పరారీలో ఉన్న అభిషేక్ .. దుబాయ్ నుంచి హైదరాబాద్ రావడంతో అతన్ని తొలుత శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు లుక్‌ఔట్ నోటీసు ఆధారంగా అదుపులోకి తీసుకున్నారు.
ఆ తర్వాత సీబీఐ అధికారులకు అప్పగించగా వారు నిందితుడిని స్థానిక కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ రిమాండ్‌పై విమానంలో రాయ్‌పూర్‌కు తరలించారు. ఈ కుంభకోణానికి సంబంధించి నమోదైన 13 ఎఫ్‌ఐఆర్‌లను ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం సీబీఐకి బదిలీ చేసింది. సీబీఐ ఇప్పటివరకు దాదాపు 100 మంది నిందితులపై 8 చార్జిïÙట్లు దాఖలు చేసింది. మరోవైపు మహాదేవ్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్, దాని అనుబంధ వెబ్‌సైట్లు గత పదేళ్లలో రూ. 94,400 కోట్ల మేర అక్రమ ఆదాయాన్ని ఆర్జించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రాయ్‌పూర్ కోర్టుకు తెలిపింది. ప్రధాన ప్లాట్‌ఫామ్ ఇప్పటికీ పెద్ద సంఖ్యలో ప్యానెళ్లను నడుపుతూ అందుబాటులోనే ఉందని స్పష్టం చేసింది.


