రోజుంతా ప్రత్యేక గస్తీ | Immediate assistance to accident victims on national highways | Sakshi
Sakshi News home page

రోజుంతా ప్రత్యేక గస్తీ

Sep 25 2026 6:06 AM | Updated on Sep 25 2026 6:06 AM

Immediate assistance to accident victims on national highways

జాతీయ రహదారులపై ప్రమాద బాధితులకు తక్షణ సహాయం

ఆధునిక సాంకేతికత; ఒకే కమాండ్‌ కింద ట్రాఫిక్‌ నియంత్రణ 

తెలంగాణ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్, రోడ్డు, రైలు భద్రతా బ్యూరో ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌: నానాటికీ పెరుగుతున్న వాహనాలు, ట్రాఫిక్‌ రద్దీ ఇబ్బందులు, రోడ్డు ప్రమాదాల నివారణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా శాస్త్రీయ పద్ధతుల్లో ట్రాఫిక్‌ నిర్వహణను మెరుగుపరచడానికి, రహదారులపై నిఘాను బలోపేతం చేయడానికి, రైలు ప్రయాణాల భద్రతను అత్యున్నత ప్రమాణాలతో పర్యవేక్షించడానికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విభాగానికి ’తెలంగాణ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్, రోడ్డు, రైలు భద్రతా బ్యూరో’ అని నామకరణం చేశారు. ఇది రాష్ట్ర పోలీస్‌ శాఖ పరిధిలో ప్రత్యేక విభాగంగా పూర్తి అధికారాలతో పనిచేస్తుంది.

ఈ విభాగం చేతుల్లోనే.. : రాష్ట్రంలో 32 వేల కి.మీ. కంటే ఎక్కువ నిడివి గల రహదారుల నెట్‌వర్క్‌ ఉంది. అలాగే రిజిస్టర్‌ అయిన వాహనాల సంఖ్య 1.80 కోట్లు దాటిపోయింది. ఇంత పెద్దఎత్తున విస్తరిస్తున్న రవాణా వ్యవస్థకు అనుగుణంగా ట్రాఫిక్‌ విభాగాలు ఒకే విధమైన ప్రమాణాలు, సాంకేతికత, శిక్షణ, విశ్లేషణలతో పనిచేయడం అత్యంత ఆవశ్యకంగా మారింది. 

ఈ నేపథ్యంలోనే అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎలక్ట్రానిక్‌ పద్ధతుల్లో నిఘా పెంచడానికి, ప్రయాణాలను సురక్షితం చేయడానికి ఈ సమగ్ర విభాగాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే ఈ విభాగానికి అదనపు డీజీపీ లేదా ఐజీ హోదా కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్‌ కమిషనరేట్లు, జిల్లాల పరిధిలోని ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్లపై ఈ విభాగానికి పూర్తి పర్యవేక్షణ, నియంత్రణ అధికారాలు ఉంటాయి.

ఈ బ్యూరోలోని రెండు ముఖ్యమైన విభాగాలు  
ట్రాఫిక్‌ విభాగం: రాష్ట్రంలోని అన్ని రహదారులపై ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ, ఆధునిక సంకేతాల నిర్వహణ, భారీ వేడుకలు, పండుగల సమయంలో ట్రాఫిక్‌ ప్రణాళికలు, రహదారులపై ఆటంకాల తొలగింపు, వర్షా్షకాలంలో అత్యవసర చర్యలను పర్యవేక్షిస్తుంది. 
రోడ్డు, రైలు భద్రతా విభాగం: ఇది ఎల్రక్టానిక్‌ పద్ధతుల్లో రోడ్డు నియమాల ఉల్లంఘనలను గుర్తించడం, జాతీయ రహదారులపై గస్తీ నిర్వహించడం, ప్రమాదాలపై శాస్త్రీయ, ఫోరెన్సిక్‌ దర్యాప్తు చేయడం, డేటా విశ్లేషణ, మెట్రో రైలుతో సహా అన్ని రకాల రైలు ప్రయాణాల భద్రతను పర్యవేక్షించడం వంటి విధులను నిర్వర్తిస్తుంది.

ప్రత్యేక గస్తీ బృందాలు..  
50 కి.మీ. కంటే ఎక్కువ పొడవున్న జాతీయ లేదా రాష్ట్ర రహదారుల పరిధిలోని ప్రతి పోలీస్‌ స్టేషన్‌లో ఒక ప్రత్యేక గస్తీ బృందాన్ని, అలాగే ఓ వాహనాన్ని కేటాయిస్తారు. ఈ బృందంలో ఒక హెడ్‌ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్‌ ఉంటారు. ఈ వాహనాలకు ఆధునిక నిఘా కెమెరాలు, నంబర్‌ ప్లేట్లను గుర్తించే పరికరాలు, వేగాన్ని కొలిచే యంత్రాలు అమర్చి ఉంటాయి. ప్రమాదాలు జరిగిన వెంటనే స్పందించి, బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చడం, రహదారులపై నిలిచిపోయిన వాహనాలను తొలగించడం వీరి ముఖ్య విధి. 

ఆర్థికంగా ఈ విభాగం స్వయంసమృద్ధి సాధించడానికి ’ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ ఫండ్‌’ పేరిట ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి వసూలు చేసే జరిమానాలో 40 శాతం నిధులను ఈ బ్యూరో ఖాతాకు జమ చేస్తారు. ఈ నిధులను సాంకేతిక పరికరాల కొనుగోలు, కెమెరాల ఏర్పాటు, శరీరానికి ధరించే కెమెరాలు, సిబ్బంది శిక్షణ, రహదారుల అత్యవసర మరమ్మతులకు మాత్రమే ఉపయోగించాలి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement